Rewind 2021 : మనసుదోచిన కోర్ట్ రూమ్ డ్రామాస్

Twitter IconWatsapp IconFacebook Icon
Rewind 2021 : మనసుదోచిన కోర్ట్ రూమ్ డ్రామాస్

కోర్టు రూమ్ డ్రామాస్ కు ఎప్పుడూ మంచి రీచ్ ఉంటుంది.  కథాకథనాలు ఆసక్తికరమైన రీతిలో ఉండి.. చక్కటి ఎమోషన్స్ కూ చోటు కల్పిస్తే అలాంటి సినిమాలు ఎప్పుడూ  ప్రేక్షకాదరణను పొందుతూనే ఉంటాయి. 2021 లో ఆ తరహాలోనే పలు చిత్రాలు విడుదలయ్యాయి. చేయని నేరానికి జైలుకు వెళ్ళడం.. హీరో/హీరోయిన్ అయిన లాయర్ అలాంటి వారి తరపున అండగా నిలబడి బల్ల గుద్ది మరీ వాదించడం.. చివరికి ఆ కేసును ఉత్కంఠను గొలిపే తీర్పుతో గెలచుకోవడం.. ఈ కాన్సెప్ట్స్ లోని కామన్ పాయింట్. మరి ఈ ఏడాది అలాంటి మనసుదోచిన కోర్ట్ రూమ్ డ్రామాస్ ఏమేం ఉన్నాయో చూసేద్దాం...

వకీల్ సాబ్ 

పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత కమ్ బ్యాక్ ఇచ్చిన ప్రత్యేకమైన చిత్రం ‘వకీల్‌సాబ్’ . పింక్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రీమేక్ గా వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ‘పింక్’ మూవీ కాన్సెప్ట్ ను అజిత్ తమిళ చిత్రం ‘నేర్కొండ పార్వై’ ఫార్మేట్ లో మలిచి పవర్ స్టార్ అభిమానులకు మంచి ఫీస్ట్ ఇచ్చిన చిత్రమిది. వివిధ ప్రాంతాలనుంచి హైద్రాబాద్ వచ్చి ఒక హాస్టల్ లో ఉంటున్న ముగ్గురు అమ్మాయిలు.. వారి స్నేహితులైన కొందరు అబ్బాయిల వల్ల ఒక గొడవలో ఇరుక్కుంటారు. దాని వల్ల ఆ అమ్మాయిల జీవితాలు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడుతుంది. ఆ గొడవ కోర్ట్ కేసు వరకూ వెళుతుంది. ఆ పరిస్థితుల్లో ఆ అమ్మాయిల తరపున సత్యదేవ్ అనే ఒక వకీల్ నిలబడి.. వారికి న్యాయం చేయడమే ఈ సినిమా కథాంశం. బలమైన కోర్ట్ సన్నివేశాలే ఈ సినిమాను నిలబెట్టాయి. ముఖ్యంగా ప్రకాశ్ రాజ్, పవన్ మధ్య వచ్చే సీన్స్ విజిల్స్ వేయించాయి. పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకే హైలైట్. 


జైభీమ్ 

తమిళ హీరో సూర్య లాయర్ గా నటించిన చిత్రం ‘జైభీమ్’. చంద్రు అనే ఒక లాయర్ నిజజీవిత కథగా ఈ సినిమా తెరకెక్కింది. జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం ఈ సినిమా విడుదలైంది. చేయని నేరానికి జైలు పాలైన ముగ్గురు గిరిజనులు అదృశ్యమవుతారు. అందులో ఒకరి భార్య తనకు న్యాయం చేయమని కోర్ట్ మెట్లు ఎక్కుతుంది. ఆ పరిస్థితుల్లో చంద్రు అనే ఒక లాయర్ ఈ కేసు ను వాదించి ఆమెకు న్యాయం చేయడమే ఈ సినిమా కథాంశం. ఇందులోని సహజమైన సన్నివేశాలు, ఎమోషన్స్ సినిమాను నిలబెట్టాయి. విమర్శకుల ప్రసంశలు సైతం అందుకున్న ఈ సినిమా వరల్డ్ నెం. 1 మూవీగా నిలిచింది. చంద్రుగా సూర్య నటనకి మంచి ప్రశంసలు దక్కాయి. ఆసక్తికరమైన కోర్ట్ రూమ్ సన్నివేశాలు, గుండెను పిండేసే ఎమోషన్స్ ఈ సినిమాను నిలబెట్టాయి. 


నాంది

అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రం ‘నాంది’. కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఒక హత్యకేసులో ప్రధాన నిందితుడిగా కోర్టు మెట్లు ఎక్కిన ఒక యువకుడి తరపున ఒక లాయర్ నిలబడి.. అతడి నిర్ధోషిత్వాన్ని నిరూపించడమే ఈ సినిమా కథాంశం. ఈ పాత్ర కోసం అల్లరి నరేశ్ నగ్నంగా కూడా నటించాడు. సహజమైన నటనతో.. ఆకట్టుకున్నాడు నరేశ్, లాయర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఈ సినిమా అల్లరి నరేశ్ కు నటుడిగా పునర్జన్మనిచ్చిందని చెప్పొచ్చు. ఇందులోని కోర్ట్ సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. అలాగే.. చక్కటి ఎమోషన్స్ కూడా పండడంతో సినిమాకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. 


తిమ్మరుసు 

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ లాయర్ గా నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్ తిమ్మరుసు. ఆపరేషన్ వాలి ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ సినిమాకి శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. కన్నడ చిత్రం ‘బీర్బల్ ట్రయాలజీ కేస్ 1: ఫైండింగ్ వజ్రముని’ చిత్రానికిది అఫీషియల్ రీమేక్.  ఒక మర్డర్ ను స్వయంగా చూసిన ఒక యువకుడు అదే మర్డర్ కేసులో నిందితుడిగా ఇరికించబడతాడు. ఆ పరిస్థితుల్లో అతడి తరపున రామచంద్ర అనే లాయర్ కేసు వాదిస్తాడు. ఆ క్రమంలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చివరికి ఆ కేసు నుంచి అమాయకుడైన ఆ యువకుడు ఎలా బైటపడతాడు? అన్నదే మిగతా కథ. ఆసక్తికరమైన కథాకథనాలతో, ఉత్కంఠను గొలిపే కోర్ట్ రూమ్ సన్నివేశాలతో ఈ సినిమా ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఈ సినిమాకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయి.. సినిమాను సూపర్ హిట్ చేశారు. 


చెక్

నితిన్ హీరోగా.. ఏలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్ ‘చెక్’. చేయని నేరానికి జైలు పాలైన ఒక యువకుడు చదరంగంలో గ్రాండ్ మాస్టర్ గా ఎదిగి తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడు అన్నదే ఈ సినిమా కథాంశం. ఉగ్రదాడిలో 40 మంది మరణానికి కారణమయ్యాడనే కారణంగా హీరోకి ఉరిశిక్ష వేస్తారు. అలా జైలుకు వెళ్ళిన హీరో అక్కడ ఒకరి సహాయంతో చెస్ నేర్చుకొని ఛాంపియన్ అయి..  రాష్ట్రపతిని క్షమాభిక్ష అర్ధిస్తాడు.  చివరికి అతడు జైలు నుంచి విడుదలయ్యాడా లేదా అన్నదే మిగతా కథ. కోర్ట్ రూమ్ సన్నివేశాలు, చెస్ ముడిపడి ఉన్న సీన్స్ ఆసక్తిని కలిగిస్తాయి. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇందులో హీరో తరపున వాదించే లాయర్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. 

-రామకృష్ణ కుమార్ 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

మీకు తెలుసా !..Latest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.