‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీ రివ్యూ

ABN , First Publish Date - 2021-10-15T20:30:22+05:30 IST

అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్, హీరోగా తనకంటూ ప్రత్యేక స్టార్డమ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన చేస్తున్న ప్రయత్నాలు అంచువరకు వచ్చి ఆగిపోతున్నాయి. దీంతో యాక్షన్ పక్కనెట్టి లవర్‌ బాయ్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు మొదలెట్టాడు. హీరోకి లవర్ బాయ్ ఇమేజ్ ఇవ్వడంలో

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీ రివ్యూ

చిత్రం: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’

విడుదల తేదీ: 15, అక్టోబర్ 2021

నటీనటులు: అఖిల్, పూజా హెగ్డే, ఇషా రెబ్బా, మురళీ శర్మ, జయప్రకాశ్, ఆమని, ప్రగతి, అజయ్, అమిత్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు

బ్యానర్: జీఏ2 పిక్చర్స్

సమర్పణ: అల్లు అరవింద్

మ్యూజిక్: గోపీసుందర్

సినిమాటోగ్రఫీ: ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ

ఎడిట‌ర్: మార్తాండ్. కె వెంక‌టేశ్

ఆర్ట్ డైరెక్ట‌ర్: అవినాష్ కొల్లా 

నిర్మాత‌లు: బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌  

దర్శకత్వం: బొమ్మ‌రిల్లు భాస్క‌ర్


అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్, హీరోగా తనకంటూ ప్రత్యేక స్టార్డమ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన చేస్తున్న ప్రయత్నాలు అంచువరకు వచ్చి ఆగిపోతున్నాయి. దీంతో యాక్షన్ పక్కనెట్టి లవర్‌ బాయ్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు మొదలెట్టాడు. హీరోకి లవర్ బాయ్ ఇమేజ్ ఇవ్వడంలో సిద్ధహస్తుడైన దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. కొంతకాలంగా సరైన సమయం కోసం వేచి చూస్తున్న భాస్కర్‌, అలాగే సరైన హిట్ కోసం చూస్తున్న అఖిల్ కాంబినేషన్‌లో సినిమా.. అందులోనూ వరుస హిట్స్‌తో గీతా ఆర్ట్స్ ప్రతిష్టని పెంచుతున్న గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌లో అనగానే సహజంగానే ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. అఖిల్ సరసన టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే నటించడంతో పాటు, వీరిద్దరూ కలిసున్న పోస్టర్స్ కూడా సినిమాపై క్రేజ్ పెంచాయి. ఈ సినిమా మొదలైనప్పటి నుండి ‘బొమ్మరిల్లు’ తరహాలోనే భాస్కర్ ఈసారి ఏదో కొత్త పాయింట్‌ని చెప్పబోతున్నాడనేలా ప్రమోషన్ కార్యక్రమాలు నడిచాయి. అలాగే విడుదలకు ముందే సాంగ్స్ ఆకర్షించడం, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటం వంటివి ఈ సినిమా కోసం ప్రేక్షకులు వెయిట్ చేసేలా చేశాయి. మరి ఇలాంటి అంచనాల నడుమ, ఫెస్టివల్ మూడ్‌లో నేడు(శుక్రవారం) థియేటర్లలోకి వచ్చిన ఈ బ్యాచ్‌లర్.. ప్రేక్షకులకి నచ్చాడో? లేదో? రివ్యూలో తెలుసుకుందాం. 


కథ:

అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఐటీ ప్రొఫెషినల్ అయిన హర్ష(అఖిల్), తన ఆలోచనలకు తగ్గ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని 20 రోజులు సెలవు పెట్టి ఇండియా వస్తాడు. హర్ష ఫ్యామిలీ అతని కోసం 20 సంబంధాలను రెడీ చేసి ఉంచుతుంది. అంటే 20 రోజుల్లో 20 మంది అమ్మాయిలని చూసి అందులో నుండి ఒకర్ని హర్ష పెళ్లి చేసుకుని మళ్లీ అమెరికా వెళ్లిపోవాలి. ఆ 20 అమ్మాయిల్లో ఒకమ్మాయి విభ(పూజా హెగ్డే). బ్యాచ్‌లర్ లైఫ్‌, పెళ్లి తర్వాత లైఫ్‌ వంటి వాటిపై స్టాండప్ కామెడీ చేసే విభని చూసిన వెంటనే హర్ష.. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే విభ జాతకం, హర్ష జాతకం కలవలేదని అతని ఫ్యామిలీ రిజిక్ట్ చేస్తుంది. విభ భావాలను, ఆలోచనలను.. హర్ష ఇతర అమ్మాయిలను చూడడానికి వెళ్లినప్పుడు ప్రదర్శిస్తుండటంతో.. ఏ ఒక్క సంబంధం అతనికి సెట్ కాదు. పైగా గొడవలు జరిగి కోర్టు వరకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఫ్యామిలీ హర్టయి.. పెళ్లొద్దు, ఏం వద్దు అని హర్షను మళ్లీ అమెరికా పంపించేస్తారు. అమెరికా వెళ్లిన తర్వాత పెళ్లిపై తనకి ఉన్న క్లారిటీ సరైంది కాదని, విభకి ఉన్న క్లారిటీతో జీవితాంతం సుఖంగా ఉండగలమని భావించిన హర్ష ఆమె కోసం భారత్ వచ్చేస్తాడు. ఈలోపు హర్ష ఫ్యామిలీ అమెరికాకు చెందిన అమ్మాయితో హర్ష పెళ్లిని ఫిక్స్ చేసి నిశ్చితార్థ కార్యక్రమం కూడా పూర్తి చేస్తారు. తన తండ్రి సుబ్రమణ్యం(మురళీశర్మ) ప్రవర్తనతో పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయం తీసుకున్న విభని హర్ష పొందగలిగాడా? సుబ్రమణ్యం చేసిన తప్పేంటి? చివరికి హర్ష తన ఫ్యామిలీ సెట్ చేసిన అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేక తను ప్రేమించిన విభని చేసుకున్నాడా? వంటి ప్రశ్నలకు ఓ మెసేజ్‌‌తో కూడా సమాధానమే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.  


విశ్లేషణ:

ఈ సినిమాలో హర్షగా చేసిన అఖిల్‌కి ఓ డైలాగ్ ఉంది. ‘నాలో వచ్చిన మార్పును చూపిద్దామని..’. ఈ డైలాగ్‌లానే ఈ సినిమాలో అఖిల్‌లో చాలా మార్పు కనిపించింది. నటనపరంగా అఖిల్ ఓ మెట్టు ఎక్కాడనే చెప్పవచ్చు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు. అఖిల్ డైలాగ్ డెలివరీ, అతను కనిపించిన తీరంతా చూసే ప్రేక్షకులకు నచ్చుతుంది. విభగా చేసిన పూజా హెగ్డే పాత్రని మరో హాసిని(బొమ్మరిల్లు-జెనీలియా) పాత్రలా తీర్చిదిద్దాలని దర్శకుడు భావించినట్లు ఉన్నాడు. పూజా హెగ్డే తన పాత్రని చక్కగా చేసింది. గ్లామర్ విషయంలోనూ ఎక్కడా తగ్గలేదు. కానీ అఖిల్ పక్కన పూజా హెగ్డేని యాక్సెఫ్ట్ చేయలేనంతగా.. అతని పక్కన ఆమె కాస్త పెద్దగా అనిపించింది. పాత్రగా మాత్రం పూజా ఎక్కడా తగ్గలేదు. సుబ్రమణ్యంగా మురళీశర్మ, అతని వైఫ్‌గా ప్రగతి డిఫరెంట్‌గా కనిపించారు. ముఖ్యంగా మురళీశర్మ పాత్ర సినిమాకి కామెడీ, సీరియస్‌నెస్‌ని ఇచ్చేలా ఉంటుంది. మురళీశర్మకి మరో మంచి పాత్ర అని చెప్పవచ్చు. హర్ష తల్లిదండ్రులుగా జయప్రకాశ్, ఆమని.. గాడ్‌ఫాదర్‌గా శ్రీకాంత్ అయ్యంగార్, హర్ష బావగా అజయ్ పాత్రలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రగతి, సుడిగాలి సుధీర్, వెన్నెల కిషోర్, పోసాని పాత్రలతో చేసిన కామెడీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది. ఇంకా ఇతర పాత్రలలో చేసిన వారంతా వారి పాత్రల పరిధిమేర నటించారు.


ఈ సినిమాకి గోపీసుందర్ ఇచ్చిన నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. గుచ్చే గులాబి, లెహరాయి పాటలు చిత్రీకరణ బాగుంది. అలాగే నిర్మాణ విలువలు గురించి ప్రత్యేకంగా చెప్పుకునేంతగా ఉన్నాయి. సినిమాని రిచ్‌గా తెరకెక్కించారు. ఎడిటింగ్ విషయంలో ఎడిటర్‌కి సెకండాఫ్‌లో ఇంకాస్త స్వేచ్ఛనివాల్సింది. సినిమాటోగ్రఫీ హైలెట్‌గా ఉంది. ఇతర డిపార్ట్‌మెంట్స్ వారు కూడా వారి పనితనం కనబరిచారు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాలో చెప్పాలనుకున్న అంశం ఏంటంటే.. ‘వాట్ డు యు ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ మ్యారీడ్ లైఫ్?’. పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయి కానీ, అబ్బాయికానీ ఎటువంటి క్లారిటీతో ఉండాలి. పెళ్లి చేసుకోబోతోన్న వారు అంటే తకిట తధిమి తందాన బ్యాచ్.. పెళ్లి చేసుకోవాలా? వద్దా? పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో? ఎవరిని చేసుకోవాలి? ఎవరిని సెలక్ట్ చేసుకోవాలి? అనే ఐఏఎస్ క్వశ్చన్ పేపర్ అందుకున్న ఎల్‌కెజి స్టూడెంట్‌లా కాకుండా క్లారిటీతో ఉండాలని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఫస్టాప్ అంతా పెళ్లిపై చాలా క్లారిటీగా ఉన్న విభ పాత్రని సెకండాఫ్‌లో చూపించిన తీరు లాజిక్‌గా అనిపించదు. అలాగే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలియకుండా పెళ్లి పనులు హడావుడిగా, ఆర్బాటంగా చేసే హర్ష ఫ్యామిలీ.. అతడిని ఓ స్టార్‌లా చూసే ఫ్యామిలీ.. చిన్న మిస్ అండర్‌స్టాండింగ్ విషయంలో కోర్టుకు వెళ్లడం, అతను తప్పు చేశాడని నమ్మడం, మళ్లీ అమెరికా పంపించడం వంటి సీన్లు కూడా అంత లాజిక్‌గా అనిపించవు. 


మ్యారీడ్ లైఫ్ అంటే నైస్ ఫ్యామిలీ, కిడ్స్, అన్నిటికి మించి లవ్ మాత్రమే కాదు ఇంకొకటి ఉంటుంది అని, అది తెలుసుకుంటేనే జీవితం ఎప్పుడూ ఫ్రెష్‌గా సాగుతుందని విభ పాత్రతో దర్శకుడు చెప్పించాడు. కాపురానికి కావాల్సిన ఏకైక ఎలిజిబిలిటి సర్దుకుపోవడమే అనే హర్ష మైండ్ సెట్‌ని విభ మార్చిన విధానం అంతా ఆకట్టుకునేలా తెరకెక్కించిన భాస్కర్.. పెళ్లి చేసుకోబోయే వారికి డర్టీ మైండ్ ఉండాలని చెప్పిన తీరే మళ్లీ కన్ఫ్యూజ్ చేస్తుంది. కలుద్దాం, కబుర్లు చెప్పుకుందాం అంటూ గోడలపై రాసే రాతలతో ‘ఆరంజ్‌’ కన్ఫ్యూజన్ కంటిన్యూ చేస్తున్నాడనిపిస్తే.. హీరో, హీరోయిన్లతో ఇచ్చే మెసేజ్‌లతో ‘బొమ్మరిల్లు’ నుండి భాస్కర్ బయటికి రాలేకపోతున్నాడేమో అనిపించింది. ‘సన్ రైజ్ ఇష్టమా? సన్ సెట్ అంటే ఇష్టమా?’ అంటే.. దేనికుండే ప్రయారిటీ దానికుంటుంది. కాపురం అన్నాక కష్టమూ ఉంటుంది, సుఖమూ ఉంటుంది. కేవలం డర్టీ మైండ్ కోరుకునే సుఖమే కావాలనుకుంటే ఇక్కడ కాపురం నడవదు. సన్ రైజ్ లేకుండా సన్ సెట్ ఎక్కడి నుండి వస్తుంది. కాబట్టి భాస్కర్ చెప్పాలనుకునే పాయింట్ మంచిదే అయినా.. దానిని చెప్పే మార్గంలో లాజిక్‌గా తడబడ్డాడనిపిస్తుంది. ఫస్టాఫ్ నడిచిన తీరంతా ప్రేక్షకులని అలరిస్తుంది. ఫస్టాఫ్‌లో వచ్చే డైలాగ్స్ చాలా బాగున్నాయి. కామెడీ పరంగా, ఆర్టిస్టుల నటన పరంగా ప్రేక్షకులని ఈ బ్యాచ్‌లర్ అలరించినా.. ఎమోషనల్‌గా మాత్రం కనెక్ట్ చేయలేకపోయాడు. అయితే ఇందులో చెప్పిన కొన్ని పాయింట్స్ పెళ్లి చేసుకోబోయే వారికి, వారిని కన్న తల్లిదండ్రులకు మంచి మెసేజ్ ఇచ్చేలా ఉన్నాయి. ఫైనల్‌గా ‘సర్దుకుపోవడం కాదు.. ఇంకేదో ఉంది అని చెప్పాలనుకున్న దర్శకుడు.. కేవలం ఆ సర్దుకుపోవడం దగ్గరే ఆపేశాడు’.

ట్యాగ్‌లైన్: సర్దుకుపోతే.. ఓకే   

Updated Date - 2021-10-15T20:30:22+05:30 IST