బాలయ్యకు ఆ వేషం ఎలా దక్కిందంటే....

ABN , First Publish Date - 2022-04-09T21:23:12+05:30 IST

బాలయ్య పన్నెండు చిత్రాల్లో హీరోగా నటించారు. అయితే హీరోగా తగిన గుర్తింపు వచ్చేసరికే యుక్త వయసు వెళ్లిపోవడంతో కృష్ణ, శోభన్‌బాబు వంటి యువ హీరోల నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఆ పోటీని తట్టుకోలేక క్యారెక్టర్‌ రోల్స్‌, విలన్‌ పాత్రలు చేయాల్సి వచ్చింది. ఆయన విలన్‌ పాత్రలు పోషించిన చిత్రాల్లో ‘మొనగాళ్లకు మొనగాడు’ ముఖ్యమైంది.

బాలయ్యకు ఆ వేషం ఎలా దక్కిందంటే....

బాలయ్య పన్నెండు చిత్రాల్లో హీరోగా నటించారు. అయితే హీరోగా తగిన గుర్తింపు వచ్చేసరికే యుక్త వయసు వెళ్లిపోవడంతో  కృష్ణ, శోభన్‌బాబు వంటి యువ హీరోల నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఆ పోటీని తట్టుకోలేక క్యారెక్టర్‌ రోల్స్‌, విలన్‌ పాత్రలు చేయాల్సి వచ్చింది. ఆయన విలన్‌ పాత్రలు పోషించిన చిత్రాల్లో ‘మొనగాళ్లకు మొనగాడు’ ముఖ్యమైంది. మోడరన్‌ థియేటర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో ఎస్‌స్వీ రంగారావు టైటిల్‌ రోల్‌ పోషించారు. హిందీ చిత్రం ‘ఉస్తాదోం కె ఉస్తాద్‌’కు రీమేక్‌ ఇది. ఆ తర్వాత ఆ చిత్రాన్నే తమిళంలో ‘వల్లవనక్కు వల్లవన్‌’ పేరుతో రీమేక్‌ చేశారు. హిందీలో అశోక్‌ కుమార్‌ పోషించిన పాత్రను తమిళంలో జెమినీ గణేశన్‌ చేశారు. తమిళంలో కూడా హిట్‌ కావడంతో తెలుగులో తిద్దామనుకున్నారు మోడరన్‌ థియేటర్స్‌ సంస్థ అధినేత రామ సుందరం. అశోక్‌ కుమార్‌, జెమినీ గణేశన్‌ వంటి ప్రముఖులు పోషించిన విలన్‌ పాత్ర కోసం కాంతారావు, గుమ్మడి, జగ్గయ్య.. ఇలా రకరకాల పేర్లు పరిశీలించారు. కానీ సుందరానికి మాత్రం బాలయ్య ఆ పాత్రకు బాగుంటారని ఎందుకో అనిపించింది. వెంటనే ఆయన ఈ విషయం తమ డిస్ర్టిబ్యూటర్స్‌ నవయుగ వారికి చెప్పారు. అశోక్‌ కుమార్‌ వేసిన వేషాన్ని బాలయ్య వంటి జూనియర్‌తో వేయిస్తారా? అందులోనూ రంగారావుని ఢీకొనే పాత్ర అది. ఆయన పర్సనాలిటీ ముందు బాలయ్య సరిపోతారా అనే సందేహం వ్యక్తం చేసి వద్దన్నారు. అయినా సుందరం వెనక్కి తగ్గలేదు. బాలయ్యను సేలం తీసుకెళ్లి పది రోజులు షూటింగ్‌ చేసి ఆ రష్‌ను నవయుగ వారికి చూపించారు. ఆయన జడ్జిమెంట్‌ కరక్టేనని వారు ఒప్పుకున్నారు. 


‘మొనగాళ్లకు మొనగాడు’ చిత్రానికి ఎస్‌.డి.లాల్‌ దర్శకుడు. రోజూ సాయంత్రం షూటింగ్‌ పూర్తి కాగానే ఆ మర్నాడు తీయబోయే సన్నివేశాలను బాలయ్యతో ప్రాక్టీస్‌ చేయించే వారు. డైలాగ్‌ ఎలా చెప్పాలి.. నడక ఏ విధంగా ఉండాలి అనేది బాగా నూరిపోసేవారు. దాని వల్ల ఆ పాత్రతో మంచి పేరు తెచ్చుకున్నారు బాలయ్య.


– వినాయకరావు




Updated Date - 2022-04-09T21:23:12+05:30 IST