నెట్‌ఫ్లిక్స్ తెరపై మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహద్ ఫాజిల్

సూపర్ స్టార్‌లైన మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాజిల్‌‌లకు ఇండస్ట్రీలకు అతీతంగా అభిమానులున్నారు. ఆ స్టార్ నటులందరు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తాజాగా వీరందరూ కలిసి ఒక వెబ్‌సిరీస్‌లో నటించబోతున్నారని తెలుస్తోంది. స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వీరందరని ఒకే వేదికపైకి తీసుకురానుంది. మాలీవుడ్ సూపర్ స్టార్‌లైన మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాజిల్, అసిఫ్ అలీ, శాంతి కృష్ణ తదితరులందరు ఒకే వెబ్‌సిరీస్‌‌లో కనిపంచబోతున్నారట. ఆ వెబ్‌సిరీస్ షార్ట్ స్టోరీస్‌గా రూపొందబోతోందని సమాచారం. మాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు లిజో జోస్, ప్రియదర్శన్, జయరాజ్, శ్యాం ప్రసాద్, సంతోశ్ శివన్, మహేశ్ నారాయణన్ తదితరులు ఆ షార్ట్ స్టోరీస్‌కు దర్శకత్వం వహించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రముఖ మలయాళ రచయిత ఎమ్‌టీ. వాసుదేవన్ నాయర్  రచించిన షార్ట్ స్టోరీస్ ఆధారంగా ఆ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆసక్తికర విషయమేమిటంటే కమల్ హాసన్ ఆ వెబ్‌సిరీస్‌ను సమర్పించనున్నారని మాలీవుడ్ మీడియా తెలుపుతోంది. అతి త్వరలోనే ఆ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందట.   


భారత ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని ఆ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించాలని నెట్‌ఫ్లిక్స్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఆ వెబ్‌సిరీస్‌తో ప్రాంతీయ సినిమా మార్కెట్‌లలోకి చొచ్చుకుపోవాలని స్ట్రీమింగ్ దిగ్గజం భావిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ గతంలోనే తెలుగు, తమిళ్‌లో అటువంటి వెబ్‌సిరీస్‌ల‌ను రూపొందించింది. గతేడాది నెట్‌ఫ్లిక్స్ ‘‘ నవరస ’’ అనే వెబ్ సిరీస్‌ను రూపొందించింది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఆ వెబ్‌సిరీస్‌కు సమర్పకులుగా వ్యవహరించారు. ‘‘ నవరస’’ లో సూర్య, విజయ్ సేతుపతి, సిద్ధార్థ్, రేవతి, పార్వతి తిరువొత్తు, ప్రయాగ మార్టిన్ తదితరులు నటించారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.