నన్ను రెచ్చగొడితే.. ఇలానే ఉంటుంది: మోహన్ బాబు

ABN , First Publish Date - 2021-10-12T04:40:22+05:30 IST

‘మా’ తుది ఫలితాల వెల్లడి తర్వాత మంచు మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసిందీ అంటే.. ఆలోచించుకోవడానికే.. ఆ తర్వాత విజృంభిస్తుంది అంటూ తన కొడుకు విష్ణుకు మొత్తం మా సభ్యులు

నన్ను రెచ్చగొడితే.. ఇలానే ఉంటుంది: మోహన్ బాబు

‘మా’ తుది ఫలితాల వెల్లడి తర్వాత మంచు మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసిందీ అంటే.. ఆలోచించుకోవడానికే.. ఆ తర్వాత విజృంభిస్తుంది అంటూ తన కొడుకు విష్ణుకు మొత్తం మా సభ్యులు ఆశీస్సులు అందించారని అన్నారు. నన్ను మాట్లాడమని అవకాశం ఇచ్చారు కాబట్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించే నేనిప్పుడు మాట్లాడాలి. ఇది కాకుండా వేరే రాజకీయం మాట్లాడితే.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హీట్ పెంచుతున్నాయి. 


నన్ను రెచ్చగొడితే.. 

ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏదైనా భగవంతుడు, కాలం నిర్ణయిస్తుంది. అంతా నాదే అనుకుంటాం.. మన చేతుల్లో ఏమీ లేదు. భగవంతుని నిర్ణయం ప్రకారం ఇదంతా జరిగింది. 17వ సంవత్సరాల క్రితం నేను ‘మా’ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యా. అక్టోబర్ 10వ తేదీనే. మరి దీనిని ఏమంటాం. ఇది అందరి విజయం. 883 మంది సభ్యుల ఆశీస్సులు ఉన్నాయి. నేను మాట్లాడాల్సి వస్తే.. చాలా ఉంది మాట్లాడడానికి. మీడియాకి తెలియని విషయాలు కాదు. సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసిందీ అంటే.. ఆలోచించుకోవడానికే. ఆ తర్వాత విజృంభిస్తుంది. సముద్ర కెరటం ఓ.. అని ఉప్పొంగుతుంది.. అది వెనక్కి వెళ్లింది కదా అని అజాగ్రత్తతో ఉంటే.. సునామి వచ్చినట్లు ఉదృతి ప్రదర్శిస్తుంది. పొట్టేలు నాలుగడుగులు వెనక్కి వేసింది కదా.. అని మనం తిరుగుదాం అనుకునే లోపల నడుంపై కొడుతుంది. అది కొట్టిన దగ్గర రెండు పార్ట్‌లుగా విడిపోతుంది. అందుకని నేను చెప్పేది ఏమిటంటే.. నన్ను రెచ్చగొట్టాలని చూస్తూనే ఉన్నారు. అసమర్దుడిని కాను. మౌనంగా ఉండాలని అంతే. పీవీ నరసింహారావుగారు ఎక్కడున్నారో కానీ.. ఆయన భారత ప్రధానిగా ఉన్నప్పుడు, నేను రాజ్యసభ మెంబర్‌గా ఉన్నా. నేను తెలుగుదేశం. వారు కాంగ్రెస్. మా ఇద్దరికీ ఎటువంటి సన్నిహితం ఉందో మీకు తెలియదు. ఒకే ఒకమాట చెప్పగలను. ప్రతిదానికి మౌనంగా ఉండాలట. అన్నీ నవ్వుతూ స్వీకరించాలి. ఎప్పుడు సమాధానం చెప్పాలో చెప్పాలి. 


ఏ స్టేజ్ మీద ఏం మాట్లాడాలో నేర్చుకోండి

టీవీలో కనిపించాలని చాలా మంది సినీ యాక్టర్స్‌కి ఉంటుంది. నేను 500కి పైగా యాక్ట్ చేశా. ఇప్పుడు నా బిడ్డ అందరి ఆశీస్సులతో విజయం సాధించాడు. నన్ను మాట్లాడమని అవకాశం ఇచ్చారు కాబట్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించే నేనిప్పుడు మాట్లాడాలి. ఇది కాకుండా వేరే రాజకీయం మాట్లాడితే.. అంటే ఎక్కడా మాట్లాడడానికి అవకాశం లేక, ఎక్కడో ఒక వేదిక దొరికితే.. ఆ వేదికలో ఇష్టం వచ్చినట్లు నోరు జారడం మనిషి స్థాయి ధీన స్థితికి దిగజార్చడమే అవుతుంది. వయసు పెరిగేకొద్ది.. మనిషి ఆలోచనాపరుడై, ఆ ఆలోచనా విధానంతో మాట్లాడాలి. నోరు ఉంది కదా.. అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. మాట్లాడనీ.. ఈ రోజు అంతా చూస్తున్నారు. భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏమిటి? ‘మా’ అంటే ఏమిటి? ఎలక్షన్ ఏమిటి? ఏమిటీ గొడవలు.. ఏమిటీ భీభత్సం? అంటూ విద్యావంతులంతా పరిశీలిస్తున్నారు. గొర్రెలు మేపుకునే వాడు కూడా చూస్తున్నాడు. అతని దగ్గర కూడా సెల్‌ఫోన్ ఉంది. ఏం జరుగుతుంది? అని అతనూ చూస్తున్నాడు. కాబట్టి మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. భగవంతుడు మనకీ జన్మని ప్రసాదించాడు. వేదాంతం మాట్లాడటం కాదు.. వేదాంతం మాట్లాడనిస్తుంది కొన్ని కొన్ని సార్లు. కరెక్ట్ కాదు. 


పక్క రాష్ట్రాల సీఎంలను కాదు.. మన సీఎంలను గౌరవించాలి

అందరికీ చెప్పినట్లు గుర్తు. నిన్నటిది వేస్ట్ పేపర్. ఈ రోజు న్యూస్ పేపర్. రేపు క్వశ్చన్ పేపర్. రీడ్ అండ్ రైట్.. అదర్‌వైజ్ యు విల్ బికమ్ ఏ టిష్యూ పేపర్ అన్నాడు మహానుభావుడు అబ్దుల్ కలాంగారు. అందువల్ల గెలిచిన వారంతా రేపు క్వశ్చన్ పేపర్ అవుతారు. (విష్ణుని ఉద్దేశిస్తూ..) ఆలోచించు.. సహాయం కోరుకో. బాధ్యతను తీసుకున్నాం. ముఖ్యమంత్రులు సహాయ సహకారం లేకపోతే నువ్వు అడుగు వేయలేవు. రాజశేఖర్ రెడ్డిగారు ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం సీఎంలను కళాకారులు సత్కరించేవాళ్లు. అప్పుడు మాకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని.. అందరూ సమానంగా లేరని చెప్పుకునే వాళ్లం. ప్రభుత్వం తరపు నుంచి సాయం అడిగేవాళ్లం. కళాకారులను ఎంకరేజ్ చేసేలా ప్రభుత్వం తరపున ఏవైనా అవార్డులు ఇవ్వాలని కోరుకునే వాళ్లం. ఇప్పుడు కేసీఆర్, జగన్‌లను సత్కరించామా? కాకా పట్టడం లేదు నేను. లాస్ట్ టైమ్ ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన దగ్గరకీ పోలేదు. ఇప్పుడున్న జగన్ దగ్గరకి పోలేదు. ఆయన దగ్గరకి పోయి.. సార్ మేమందరం వస్తాం. మాకిలా సాయం చేయండి. మిమ్మల్ని కూడా మేము సన్మానించాలి. అంటే సన్మానానికి రానని అనడుగా. మీరు వేదిక మీదకి రావాలి. మిమ్మిల్ని మేము గౌరవించాలి అని పిలవాలి. అంతేకానీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి కాదు. ఇది నేర్చుకోండి సభ్యులారా? పార్టీలు వేరే ఉండొచ్చు. ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో ఉండొచ్చు. ఇక్కడంతా ఒకే పార్టీ. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పార్టీ. ఇది నేర్చుకోమని అందరికీ చెబుతున్నాను..’’ అని అన్నారు.

Updated Date - 2021-10-12T04:40:22+05:30 IST