Mohammed Rafi: రఫీ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పిన ఘటన .. స్టేజ్‌పై కరెంటు పోవడంతో కలిసొచ్చిన అదృష్టం..!

Twitter IconWatsapp IconFacebook Icon
Mohammed Rafi: రఫీ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పిన ఘటన ..  స్టేజ్‌పై కరెంటు పోవడంతో కలిసొచ్చిన అదృష్టం..!

ఆ గొంతు వింటే "జననాంతర సౌహృదాని" అనే మాట గుర్తొస్తుంది,జన్మజన్మలుగా నేనెరిగిన గొంతు అనిపిస్తుంది.నేనింకా పూర్తిగా కళ్లు తెరవక ముందే  రేడియోలోంచి వచ్చే పాటలలో వినబడి మెత్తగా, మధురంగా వెంటాడిందీ గొంతే అని తెలుసుకున్నది మాత్రం యవ్వనంలో అడుగు పెడుతున్న కొత్తల్లో హిందీ పాటల వెల్లువలో కొట్టుకు పోయేటపుడు!


ఇదంతా ఇంకెవరి గురించీ, గొంతు విప్పితే చాలు వినే వారి మనసులను మధురమయిన లయలో కరిగించి పూలదారులలో, తేనె వాకలలో తేలించే మహ్మద్ రఫీ గురించే! ఇక్కడో చిన్న ముచ్చట..నా అజ్ఞానం గురించి.. 9వ క్లాసులో వున్నప్పుడనుకుంటా నేనూ, నా స్నేహితురాలూ మాటాడుకుంటూ నీ అభిమాన గాయకుడెవరూ అని పరస్పరం ప్రశ్నించుకున్నాం. నా స్నేహితురాలు మహ్మద్ రఫీ పేరు చెప్పింది. నేను వెంటనే “యేదీ తెలుగులో ‘ఎంత వారు గానీ వేదాంతులైన గానీ…’ అని పాడాడే, అయ్యో ఆయనా,” అని ఆమెను చూసి జాలి పడ్డాను. అప్పుడు తెలియదు నాకు, ‘రఫీ’ అనే మోహ సముద్రంలో నేను మున్ముందు మునిగి పోబోతున్నాననీ.


నేనూ నాస్నేహితురాలు మృణాళినీ కూడా గాఢమయిన రఫీ అభిమానులం. మేమిద్దరం కలసినపుడు తన చిన్నప్పటి సంఘటన చెప్పుకుని నవ్వుకుంటాం; అదేంటంటే మృణాళినికి మూడేళ్ల వయసున్నపుడు రేడియోలో రఫీ పాటొస్తున్నంత సేపూ రేడియోని కావలించుకుని వదిలేది కాదట. ఇప్పటికీ వాళ్లింటో వాళ్లు యీ విషయం చెప్పి వెక్కిరిస్తారట. ఎంతోమంది గాయకులున్నా, ఏ గొంతుకకు ఆ గొంతే ప్రత్యేకమయినదయినా పాటకు అతను ప్రాణంపోసే తీరూ, ఆ గొంతులోని మాధుర్యం, పలికే పదాలకి సొగసులద్ది అనుభూతిని వొలికించే వైనం అతనిని అసమాన గాయకుడిని చేశాయనిపిస్తుంది.  చలం కూడా తన ‘మ్యూజింగ్స్’లో మహ్మద్ రఫీ "పియా" అని మూలిగాడా ప్రాణం కొట్టుకు పోతుంది అని రాస్తాడు. ఇంకా ఆయనే చెప్పినట్టు "గొప్ప ఆత్మలేనిదే గొప్ప సంగీతం పలకదు" అన్నది రఫీ పట్ల నిజం అనిపిస్తుంది ఆయన జీవిత చరిత్రా, ఆయన ఇతరులను గౌరవించే విధానమూ చూస్తే..

Mohammed Rafi: రఫీ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పిన ఘటన ..  స్టేజ్‌పై కరెంటు పోవడంతో కలిసొచ్చిన అదృష్టం..!

ఆ స్వర స్రోతస్విని పుట్టిందెక్కడ

రఫీ పంజాబ్‌లోని అమృత్ సర్ జిల్లాలో కోట్ల సుల్తాన్ సింగ్ అనే గ్రామంలో డిసెంబర్ 24వ తారీఖున 1924లో జన్మించాడు. ఆయన చిన్నతనం అంటే ఎనిమిదేళ్లు వచ్చేవరకూ అక్కడే గడిచిందని చాలా చోట్ల చెప్పారు. అయితే ఆయన కోడలు యాస్మిన్ ఖాలిద్ రఫీ రాసిన పుస్తకంలో రఫీ తల్లిగారు బంధువులను చూడటానికి ఆ గ్రామం వెళ్లి అక్కడ కానుపు అయ్యారనీ ఆ తరువాత వారి సొంతవూరు లాహోర్ వచ్చేశారనీ ఆయన బాల్యమంతా లాహోర్‌లోనే గడిచిందనీ రాశారు. 


ఆయన తండ్రి పేరు హాజీ ఆలీ అహ్మద్, తల్లి పేరు అల్లా రఖీ. రఫీ ముద్దుపేరు "ఫీకూ". అతను ఆరుగురు అన్నదమ్ములలో అయిదవ వాడుగా జన్మించాడు. కుటుంబంలో సంగీత వాసనలేవీ లేవు. తండ్రి కేటరింగ్ బిజినెస్‌లో వుండే వారట. సోదరునికి బార్బర్ షాపు వుండేదట. చిన్న రఫీ పాటలంటే చాలా ఇష్టం చూపిస్తూ, ప్రతిరోజూ వీధిలో పాడుతూ అడుక్కునే ఒక ఫకీరుని అనుసరిస్తూ, అతను పాడినట్టే పాడుతూ వుండేవాడట. ఒకరోజు ఇతని పాట విన్న ఆ ఫకీరు "గొప్ప గాయకుడవవుతావు" అని ఆశీర్వదించాడట. ఇదంతా జరిగింది అతని ఎనిమిదీ తొమ్మిదేళ్ల వయసులో....


చిన్నతనంలో రఫీ సంగీతాభిరుచి పట్ల ఇంట్లో వ్యతిరేకత వుండేది; ముఖ్యంగా తండ్రి నుండి వ్యతిరేకత ఎదురయింది. అయితే తల్లి ప్రోత్సాహం కొంతా అన్నగారయిన మహ్మద్ దీన్ ప్రోత్సాహం కొంత తనని ముందుకు నడిపాయి. ఇక్కడ మహ్మద్ దీన్ స్నేహితుడయిన అబ్దుల్ హమీద్ పాత్ర మరువలేనిది ఆయన చిన్న రఫీలోని ప్రతిభను గమనించి బాగా ప్రోత్సహించడమే కాక బొంబాయి వెంటపెట్టుకుని తీసుకువెళ్లి గాయకుడుగా నిలదొక్కుకునే వరకూ సహాయంగా వున్నాడు. ఇక రఫీ సంగీతశిక్షణ తీసుకున్న గురువులు బర్కత్ ఆలీఖాన్, ఛోటే గులామ్ ఆలీ సాబ్, అబ్దుల్ వహీద్ ఖాన్ (కిరానా ఘరానాకు చెందిన వారు), బడే గులామ్ ఆలీఖాన్, పండిట్ జీవన్ లాల్ మట్టూ, జవహర్ లాల్ మట్టూ, ఫిరోజ్ నిజామీ.

Mohammed Rafi: రఫీ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పిన ఘటన ..  స్టేజ్‌పై కరెంటు పోవడంతో కలిసొచ్చిన అదృష్టం..!

లాహోర్ టు బొంబాయి…

లాహోర్‌లో వున్న రోజులలో లాహోర్ రేడియోలో ఘజల్స్ అవీ పాడుతూ కాలం గడుపుతుండగా, అతని జీవితంలో ముఖ్యమైన మలుపుకి కారణమైన సంఘటన ఒకటి సంభవించింది. 1937లో లాహోర్‌లో పాన్ ఇండియా యెగ్జిబిషన్‌లో కె.యల్.సైగల్, జోహ్రాబాయ్ అంబేలీవాలాల పాట కచేరీ వొకటి యేర్పాటు చేశారు నిర్వాహకులు. వేలాది మంది సంగీతాభిమానులతో పాటు రఫీకూడా హాజరయ్యాడు. ఈలోగా అదృష్టవశాత్తూ కరెంట్ పోయి మైకులు పనిచెయ్యలేదు. ‘అదృష్టవశాత్తూ’ అని యెందుకన్నానంటే అది రఫీ పాలిట అదృష్టంగానే పరిణమించింది.  మైకులేకుండా సైగల్ పాడలేడు. యేం చేయాలో పాలుపోని నిర్వాహకులు జనాన్ని వూరుకోబెట్టడానికి రఫీకి పాడటం వచ్చని తెలుసుకుని పాడమన్నారు. రఫీ మైక్ సహాయంలేకుండానే తన గాత్రమాధుర్యంతో శ్రోతలని మైమరపించాడు. 


ఇదంతా చూసిన విన్న సైగల్ "ఏనాటికైనా నువ్వో గొప్ప గాయకుడవవుతావని" ఆశీర్వదించాడు. అక్కడే ప్రేక్షకులలో వున్న శ్యామసుందర్ అనే సంగీత దర్శకుడు రఫీ ప్రతిభ గమనించి పంజాబీ సినిమా "గుల్ బలోచ్"లో పాడే అవకాశమిచ్చాడు. అలా రఫీ తన మొట్టమొదటి పాట 1941 ఫిబ్రవరి 28న జీనత్ బేగంతో కలసి "సోనియేని, హీరియేని" అని పాడాడు. తర్వాత నటుడూ-నిర్మాత నసీర్ ఖాన్ బొంబాయి రావలసిందిగా ఆహ్వానించాడు. రఫీ కూడా బొంబాయి వెళ్లి అక్కడ సినిమాలలో అవకాశాలకోసం ప్రయత్నించాలనుకున్నాడు. అయితే ఇంట్లో వాళ్ల అంగీకారం అతికష్టం మీద పొంది, తన అన్నగారి స్నేహితుడూ తనని ప్రోత్సహించే వాడూ అయిన అబ్దుల్ హమీద్‌ని తోడు తీసుకుని బొంబాయి బయల్దేరాడు రఫీ. లాహోర్ రైల్వే స్టేషన్‌కి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన తండ్రి ఒకటే మాట చెప్పాడు. బాధనిండిన గొంతుతో "విజయం పొందితేనే తిరిగిరా, లేకపోతే నాకు రఫీ అనే కొడుకు లేడనుకుంటాను"అని. బహుశా యీ మాటలే రఫీలో విజయం సాధించటానికి కావలసిన పట్టుదల నింపి వుంటాయి.

Mohammed Rafi: రఫీ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పిన ఘటన ..  స్టేజ్‌పై కరెంటు పోవడంతో కలిసొచ్చిన అదృష్టం..!

కోటి ఆశలతో 1942లో బొంబాయిలో అడుగు పెట్టి "భేండీ బజార్" ఏరియాలో ప్రిన్సెస్ బిల్డింగ్‌లో ఒక చిన్న గదిలో వుండి అవకాశాల కోసం ప్రయత్న చేయసాగాడు రఫీ. ఆ సమయానికి సైగల్ హవా నడుస్తోంది, పంకజ్ మల్లిక్, జి.యమ్.దుర్రానీ కూడా మంచి పేరులో వున్నారు. తలత్ మహ్మద్, మన్నాడే, ముఖేష్ అవకాశాల కోసం పోటీ పడుతున్నారు. రఫీకి ఒక రకంగా భేండీ బజార్లో మహ్మద్ ఆలీ రోడ్‌లో షిరాజుద్దీన్ బారీ గారి ఇంట్లో స్థానం దొరకడంతోనే దశ తిరిగిందని చెప్పాలి. షిరాజుద్దీన్ గారి అల్లుడు లక్నోకి చెందిన వాడు. ఆయన ఇంటి పక్కనే నౌషద్ ఆలీ తండ్రి వాహిద్ ఆలీ వుండే వాడు. ఆయనకీ షిరాజుద్దీన్ అల్లుడు గారికీ వున్న స్నేహాన్ని పురస్కరించుకుని రఫీ బాగా పాడుతాడనీ సినిమాలలో అవకాశం ఇమ్మనీ కొడుకైన నౌషద్‌కి ఒక ఉత్తరం రాశాడు వాహిద్ ఆలీ. ఆ లేఖ తీసుకుని రఫీ నౌషద్‌ని కర్దార్ స్టుడియోకి వెళ్లి కలిశాడు. తండ్రి రాసిన లేఖ చదువుకుని, రఫీ పాట విన్నాక నౌషాద్ రఫీకి "పెహలే ఆప్" అనే సినిమాలో బృంద గానంలో అవకాశం కల్పించాడు. అది "హిందూస్థాన్ కే హమ్ హై, హిందూస్థాన్ హమారా "అనే పాట.  అలా చిన్నా చితకా అవకాశాలు రాసాగాయి. మొదట పంజాబీలో అవకాశ మిచ్చిన శ్యామసుందర్ హిందీలో కూడా "గావ్ కీ గోరీ "అనే సినిమాలో అవకాశ మిచ్చాడు. రఫీ ప్రతిభ పసిగట్టిన నౌషద్ తను అంతవరకూ ప్రోత్సహిస్తూ వచ్చిన తలత్‌ని పక్కన బెట్టి రఫీకి ఎక్కువ ఛాన్సులివ్వడం మొదలు పెట్టాడు. 1949లో "దులారీ" లో నౌషద్ దర్శకత్వంలో పాడిన "సుహానీ రాత్ ఢల్ ఛుకీ "రఫీ కెరీర్‌ని ఒక మలుపు తిప్పితే "బైజుబావరా"లో పాటలు రఫీనీ, నౌషద్‌నీ సమున్నత స్థానంలో నిలిపాయి. వారిద్దరి మధ్య ఒక ఆత్మీయ అనుబంధం నెలకొని వుండేది.సొంత గొంతుక కోసం తపస్సు

అయితే నేపథ్య గాయకుడుగా స్థిరపడే వరకూ రఫీ పడ్డ కష్టం సామాన్యమయినది కాదు. "సైగల్ " అనే మహా వృక్షపు నీడను తప్పించుకుని తన సొంత శైలిలో మనగలగటం అందరూ సైగలే కావాలనుకునే రోజుల్లో తనకొచ్చిన అవకాశాలు వినియోగించుకుని సత్తా చూపించడం ఇవన్నీ చెప్పినంత తేలిక కాదు. వీటికి తోడు ఆర్థిక పరిస్థితి వలన స్టుడియోలకు రెండు మూడుసార్లు తిరగ వలసి వస్తే ఇంటికి వెనక్కి తిరిగి రాకుండా దగ్గరలో వున్న రైల్వే స్టేషన్లో పడుకునే వాడట రఫీ. సినిమాలలో ప్రవేశించిన కొత్తల్లో రెండు మూడు సినిమాలలో చిన్నా చితకా వేషాలు కూడా వేశాడు రఫీ. నాకెందుకో రఫీకీ మన ఘంటసాలకీ చాలా పోలికలు కనిపిస్తాయి. దాదాపు ఇద్దరూ రెండేళ్లు అటూ ఇటూగా ఆయన హిందీలో, ఈయన తెలుగులో ప్రవేశించారు. ఇద్దరూ మొదట్లో చిన్న చిన్న వేషాలు వేశారు, ఇద్దరిదీ మృదువైన ప్రవర్తనా, మధురమైన గాత్రం… ఇంకా విచిత్రం ఇద్దరూ రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు.

ఇక రఫీ నటించిన సినిమాలు జుగ్నూ, లైలామజ్నూ, సమాజ్‌ కో బదల్ దాలో. ఆ తర్వాత సినిమాలలో నటించ లేదు. అతని కుటుంబం విషయాని కొస్తే అతనికి పదమూడవ ఏటే లాహోర్‌లో తండ్రి ఆఖరి సోదరుని కుమార్తె బషీరున్ బేగంతో పెళ్లి జరిగింది. సయ్యీద్ రఫీ ఆమె కొడుకే. అయితే ఇండియా పాకిస్థాన్ విడిపోయే సమయంలో ఆమె తన తలిదండ్రులను కోల్పోయిందట. ఆమె పాకిస్థాన్ విడిచి రావడానికి ఇష్టపడలేదట. రఫీ ఇండియాలోనే వుండదలచుకున్నాడట. అలా వారిద్దరూ చాలా కొద్దికాలమే కలసి వుండి తర్వాత విడాకులు తీసుకున్నారట. సయూద్ రఫీ బొంబాయిలో రఫీ వద్దే పెరిగి తర్వాత లండన్‌లో స్థిర పడ్డాడట. ఆయన రెండో పెళ్లి తనున్న ఇంటి వోనర్ షిరాజుద్దీన్ బారీ కూతురైన బిల్కీస్ బేగంతో జరిగింది. ఆమెకు ముగ్గురు కొడుకులూ ముగ్గురు కూతుళ్లూ.  ఎందుకో బిల్కీస్ రఫీ ఆమె కుటుంబమూ రఫీ మొదటి పెళ్లి గురించి మాటాడటానికి ఇష్టపడే వారు కారట, ఆయన కోడలు రాసింది. ఆయన బావమరిది జహీర్ బారీ ఆయన డేట్స్ అవీ చూస్తూ సెక్రటరీగా వ్యవహరించే వాడు.

Mohammed Rafi: రఫీ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పిన ఘటన ..  స్టేజ్‌పై కరెంటు పోవడంతో కలిసొచ్చిన అదృష్టం..!

రఫీ యుగం…

రఫీ పాటల ప్రస్థానానికి వస్తే "బైజు బావరా "తర్వాత వెనుదిరిగి చూడలేదు. 1950 -1970 మధ్యలో రఫీ స్వర్ణయుగం అనవచ్చు. సంగీత దర్శకులందరికీ బాగా కావలసిన గాయకుడు రఫీనే! ఏ పాట తీసుకున్నా భజన్, ఖవ్వాలీ, ఘజల్, ప్రేమగీతం, విరహగీతం, విషాద గీతం, చివరికి హాస్యగీతంలో కూడా ఆయన చూపే వైవిధ్యం మరెవ్వరూ సాధించలేనిది. నేపథ్య గాయకుడికీ నటుడికీ మధ్య దూరాన్ని చెరిపేశాడు రఫీ అంటాడు జావేద్ అఖ్తర్. 1942లో హిందీ సినిమాలలో నేపథ్య గాయకుడిగా ప్రవేశించిన రఫీకి వొక సుస్థిర స్థానం సంపాదించుకోడానికి సుమారు ఆరేడేళ్ళు పట్టింది. ఈ కాలంలో అతను పాడిన సినీ గీతాలతో పాటు వొకటి రెండు ప్రయివేటు గీతాలు కూడా అతను నిలదొక్కుకోడానికి సహాయపడ్డాయి. దేశానికి స్వతంత్రం వచ్చిన సందర్భంగా ఎర్రకోటలో జరిగిన సంబరాలలో రఫీ పాడాలని వుత్సాహ పడ్డాడు, అతనికి అవకాశం దొరికింది కూడా. మూడు నిమిషాలు అనుకున్నది శ్రోతల కోరికపై ముఫ్ఫయి నిమిషాలు పాడవలసి వచ్చింది. ఆయన పాట విన్న నెహ్రూ ప్రశంసించటమే కాక గాఢంగా గుండెకు హత్తుకుని తను నివసిస్తున్న తీన్ మూర్తి భవన్ లో పాడవలసిందిగా ఆహ్వానించాడు. ఇది జరిగింది 1947లో,  పాడిన పాట-  "లెహరావో తిరంగా లెహరావో. 


ఆ తర్వాత బాపూజీ మరణంతో జాతి అంతా విషాదంలో మునిగి వున్నపుడు హుసన్ లాల్ భగత్ రామ్ సంగీత దర్శకత్వంలో రాజేంద్రకిషన్ రచించిన "సునో సునో యే దునియా వాలో బాపూజీకి అమర్ కహానీ"అని రఫీ పాడిన పాట ప్రజలనే కాదు ప్రధాన మంత్రి నెహ్రూని కూడా కదిలించింది. ఆయన రఫీని తన ఇంటికి పిలిచి మళ్లీ పాడించుకుని సిల్వర్ మెడల్ బహూకరించటం రఫీ ఇష్టంగా తలుచుకునే వారట. ఈ పాట స్ఫూర్తితో తెలుగులో మన ఘంటసాల కూడా గాంధీ గురించి వొక ప్రయివేట్ రికార్డు ఇవ్వాలనుకుని, రఫీ పాట విన్నాక, ఆ ప్రయత్నం విరమించుకున్నారట.

 

అలా 1950 వచ్చేటప్పటికి ప్రతీ సంగీత దర్శకుడూ తనకి రఫీయే కావాలనే పరిస్థితి యేర్పడింది. రఫీ యెవరినీ నిరుత్సాహ పరచగూడదని శాయ శక్తులా ప్రయత్నించే వారట. ఒకరా ఇద్దరా యెంతమంది సంగీత దర్శకుల పాటలు పాడారు.. చెప్పాలంటే కష్టం. కొన్ని పేర్లు మాత్రం చెపుతాను- నౌషాద్, రోషన్, యస్.డి.బర్మన్, ఆర్.డి బర్మన్, ఓ.పి. నయ్యర్, జయదేవ్, చిత్రగుప్త్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, రవి, ఖయ్యామ్, లక్ష్మీకాంత్ -ప్యారేలాల్, హేమంత్ కుమార్, దత్తారామ్…. ఇంకా యెందరో సంగీత దర్శకుల పాటలు పాడి మెప్పించారాయన. మచ్చుకి వొకరిద్దరితో అనుబంధం ముచ్చటించు కుందాం: నౌషాద్‌తో వున్న అనుబంధం ప్రత్యేకమయినదని చెప్పుకున్నాం కదా; రఫీ టాలెంట్‌ని దాదాపు పూర్తిగా వినియోగించుకున్నాడు నౌషాద్ అనిపిస్తుంది. క్లాసికల్ బేస్ వున్న పాటల్నించీ అన్ని రకాల పాటలూ పాడించాడు. ఆయనకు 149 పాటలు పాడాడు రఫీ.

Mohammed Rafi: రఫీ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పిన ఘటన ..  స్టేజ్‌పై కరెంటు పోవడంతో కలిసొచ్చిన అదృష్టం..!

యస్.డి.బర్మన్ అద్భుతమయిన పాటలు పాడించాడు రఫీచేత "ప్యాసా, గైడ్ "లలోవి యెలాంటి మధురాలు. ఆయన దగ్గర 96పాటలు పాడాడు. ఓ.పి. నయ్యర్‌కీ రఫీకి మంచి స్నేహం వుండేదట, ఇద్దరూ లాహోర్‌కే చెందిన వారవడం కూడా దానికి ఒక కారణమట. అయితే ఆయన చండశాసనుడూ, ముక్కోపి, సమయానికి రికార్డింగ్‌కి రాకపోతే వూరుకోడు. ఒకరోజు శంకర్ -జైకిషన్ దగ్గర రికార్డింగ్ ఆలస్యమయిందట రఫీకి. దానితో తన దగ్గరకు ఆలస్యంగా వచ్చిన రఫీని చూసి అగ్గిమీద గుగ్గిలమయిన నయ్యర్ రికార్డింగ్ కాన్సిల్ చేసి మూడు సంవత్సరాలు అవకాశాలివ్వడం మానేశాడట. ఇదేమీ మనసులో పెట్టుకోని రఫీ కొంతకాలం తర్వాత యేదో ఫంక్షన్లో యెదురు పడిన నయ్యర్‌ని యెప్పట్లాగే ఆత్మీయంగా పలకరించాడట. నయ్యర్ ఒక్కసారిగా పశ్చాత్తాపపడి, ‘ఇంత మంచి మనిషినీ, గాయకుడినీ వదులుకున్నానా’ అని మళ్లీ పిలిచి అవకాశాలిచ్చాడట. రవి సంగీత దర్శకత్వంలో కూడా మంచి పాటలున్నాయి. ఒకపాటకి ఫిల్మ్ ఫేర్ అవార్డు ఇంకోదానికి రాష్ట్రీయ అవార్డూ లభించాయి. ఇలా చెప్పాలంటే యెంతో వుంది. చివరగా ఒకముక్క, ఆశ్చర్యం కలిగించే విషయం- అందరి కంటే ఎక్కువ పాటలు లక్ష్శీకాంత్ -ప్యారే లాల్‌కి 369 పాటలు పాడాడు. 


మొత్తంగా అన్ని భాషలలో కలిపి ఆయన పాడిన పాటలు 4941. ఇది మ్యూజిక్ కలెక్టర్ మహ్మద్ సలీమ్ -ఉల్ -హక్‌గారు రాసిన పుస్తకంలో వుంది. అయితే ఏడు వేల చిల్లర అని ఇంకో చోట చదివాను. ఎన్ని పాటలు పాడాడు అనే లెక్క కంటే ఎంత క్వాలిటీతో పాడాడు అనేది గమనించాలిసిన విషయం. రఫీ కూడా అలాగే భావించే వాడట! "దేవుడు నా గొంతులో క్వాలిటీ తగ్గకుండా చూడాలి" అని ప్రార్థించే వాడని ఆయన కోడలు రాసింది. రఫీ పాటలోని ఇంకో విశేషమేంటంటే.. ఏ నటునికి పాడుతుంటే ఆ నటునికి తగ్గట్టు వాయిస్ క్వాలిటీని మార్చడం. దిలీప్ కుమార్‌కి, దేవానంద్‌కి, రాజేంద్రకుమార్‌కి, షమ్మీ కపూర్‌కి పాడిన విధానానికీ మొహమూద్‌కి, జానీ వాకర్‌కి పాడిన విధానానికీ వున్న తేడా గమనిస్తే తెలుస్తుంది. 


ఆయన గానప్రస్థానం సాగిన నలభై ఏళ్లలో ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులూ, రెండు నేషనల్ అవార్డులూ వచ్చాయి. 1967లో ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. ఇవన్నీ పక్కన పెడితే గాయకులకే గాయకుడాయన. అంటే గాయనీగాయకులందరూ ఆయన పాటనీ ప్రవర్తననీ అమితంగా ఇష్టపడతారు. మన్నాడే, మహేంద్ర కపూర్ మరీనూ. అయితే, లతాతో ఒకసారి రికార్డుల రాయల్టీ గురించి వివాదం వచ్చింది. దాంతో ఆవిడ రఫీతో ఆరు సంవత్సరాలు పాడలేదు. జైకిషన్ మధ్యవర్తిత్వంతో ఆ వివాదం సమసిపోయి ఇద్దరూ కలిసి పాడటం మొదలు పెట్టారు. ఆయన కిషోర్‌కి "షరారత్ "అనే సినిమాలో ప్లేబాక్ పాడాడు.

 

ఆయన వ్యక్తిగత జీవితానికొస్తే ఆయన చాలా సింపుల్ మాన్. స్టుడియో కెళ్లడం పాట పాడటం, ఇంటికి రావడం. ఏ అలవాట్లూ లేవు. భోజన ప్రియుడు వేపుడు కూరలూ, తియ్యని పదార్థాలూ ఇష్టంగా తినేవాడు. రోజుకు మూడుసార్లు చల్లని తీపి లస్సీ వుండాలిసిందే. పిల్లలతో కలిసి పతంగులెగరెయ్యడం, కారమ్స్ ఆడటం ఇష్టమయిన హాబీలు. కొన్నాళ్లు బాడ్మింటన్ కూడా ఆడే వాడట. బాక్సింగ్ ఛాంపియన్ మహ్మదాలీని చూడాలని తహతహలాడి ఆయనతో ఫోటో తీయించుకుని సంతోషించాడట. 


చివరి రోజులలో డయాబిటిస్‌తో, స్థూలకాయంతో బాధపడి చివరకు హార్ట్ అటాక్‌తో 1980 జూలై 31న ఇదే రోజు తన బంధువులనూ అభిమానులనూ దుఃఖ సాగరంలో ముంచి రఫీ దివ్యలోకాలకు తరలి పోయాడు. ఆయన మరణించాడని నేనను అనుకోను. ఆయన పాటల ద్వారా ఆయన చిరంజీవి. ఆయనకు లండన్ అభిమానులు బర్మింగ్ హామ్‌లో ఒక గుడి కడితే ప్రపంచవ్యాప్తంగా వున్న ఆయన అభిమానులు తమతమ గుండెల్లో కట్టిన గుళ్లు కొన్ని కోట్లు. రఫీకి వీడ్కోలు చెప్పే రోజు ఆకాశమే దుఃఖిస్తోందా అన్నట్టు కురిసే వర్షంలో లక్షలాది అభిమానులు తమ మనసులే గొడుగులుగా చేసుకుని ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. 2010లో జుహూలో వున్న సమాధిని చోటు చాలక తవ్వేశారట. ఆయన విశ్రమించిన చోటుని ఒక కొబ్బరి చెట్టు ఆధారంగా అభిమానులు గుర్తిస్తారట, ఇంతకన్నా విషాదముందా!


శ్రీశ్రీ చెప్పినట్టు రఫీ అనే సముద్రాన్ని వొక చెంచాతో తోడే సాహసం చేయడానికి కారణం- నా మనసును కలచి వేసే సందర్భాలలో, నిరాశ మూసిన చీకటి వేళలలో, నిద్రపట్టని రాత్రులలో రఫీ పాట నన్ను సేదతీర్చడం, లాలించడం, నాకు తోడై నిలవడం, అందుకే "ఓ జబ్ యాద్ ఆయే బహుత్ యాద్ ఆయే" అని పాడుకుంటూ లాంగ్ లివ్ రఫీ సాబ్, వియ్ లవ్ యూ. 


                                                                                           - డాక్టర్ రొంపిచర్ల భార్గవి

                                                                                          ప్రముఖ వైద్యులు, రచయిత


                                                                                                                     

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.