‘మిస్ ఇండియా’ మూవీ రివ్యూ
ABN , First Publish Date - 2020-11-04T17:15:31+05:30 IST
కీర్తిసురేశ్.. మహానటితో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న హీరోయిన్. మంచి నటిగా ప్రూవ్ కావడంతో ఈమెకు కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా అవకాశాలు వచ్చాయి.

సినిమా: మిస్ ఇండియా
విడుదల: నెట్‌ఫ్లిక్స్(నవంబర్ 4,2020)
బ్యానర్: ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్
నటీనటులు: కీర్తిసురేశ్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, వీకే నరేశ్, నదియా, నవీన్‌చంద్ర, కమల్ కామరాజు, సుమంత్ శైలేంద్ర తదితరులు
సంగీతం: ఎస్.ఎస్.తమన్
సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్
ఎడిటింగ్: తమ్మిరాజు
నిర్మాత: మహేశ్ కోనేరు
దర్శకత్వం: నరేంద్రనాథ్
కీర్తిసురేశ్.. మహానటితో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న హీరోయిన్. మంచి నటిగా ప్రూవ్ కావడంతో ఈమెకు కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా అవకాశాలు వచ్చాయి. అలా మహానటి తర్వాత కీర్తి నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ మిస్ ఇండియా. కోవిడ్ ప్రభావంతో ఆరేడు నెలలు థియేటర్స్ బంద్. ఈ కారణంగా కొన్ని సినిమాలు ఓటీటీ విడుదలకు రెడీ అయ్యాయి. అలా కీర్తిసురేశ్ నటించిన పెంగ్విన్ ఓటీటీలో విడుదలైంది. ఇప్పుడు మిస్ ఇండియా కూడా ఓటీటీ ద్వారానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మిస్ ఇండియా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అనే సంగతి తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం....

కథ:
వైజాగ్ దగ్గరలోని లంబసి అనే ప్రాంతంలో ఓ మధ్యతరగతి కుటుంబం, ఆ కుటుంబానికి పెద్ద శివరామకృష్ణ(వీకే నరేశ్). ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు,ఓ అబ్బాయి. ఇందులో చిన్నమ్మాయి మానస సంయుక్త(కీర్తిసురేశ్). చిన్నప్పుడే ఎంబీఏ చదివి బిజినెస్ ఉమెన్ కావాలని నిర్ణయించుకుంటుంది. ఈమె తాతయ్య(రాజేంద్రప్రసాద్) ఓ ఆయుర్వేద డాక్టర్, టీ స్పెషలిస్ట్. రోగులకు కొన్ని చిన్న చిన్న జీర్ణ సంబంధిత సమస్యలను టీ ద్వారా నయం చేస్తుంటాడు. మానసకు తాతయ్య చేసే టీ అంటే ప్రాణం. తన తాతకు మంచి పేరు తాను తెస్తానని మాట ఇచ్చి ఆయన దగ్గర టీ గురించిన వివరాలను తెలుసుకుంటుంది. పిల్లలు యుక్త వయసు వచ్చిన తర్వాత.. ఉద్యోగంలో ఒత్తిడి కారణంగా శివరామకృష్ణకు అల్జిమర్స్ వచ్చేస్తుంది. దాంతో ఇంటి భారం పిల్లలు మోయాల్సి వస్తుంది. సమస్యలను పట్టించుకోకుండా మానస అక్కయ్య నచ్చినవాడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. ఇక మానస అన్నయ్య(కమల్ కామరాజు)కి యు.ఎస్‌లో ఉద్యోగం రావడంతో అమెరికా వెళదామని అంటాడు. మానస తాతయ్య కుటుంబంతో సహా అమెరికా వెళ్లడం ఇష్టం ఉండదు. ఆ బాధతోనే అదే రోజు రాత్రి ఆయన కన్నుమూస్తాడు.

దాంతో ఇక శివరామకృష్ణ కుటుంబం అమెరికా వస్తుంది. అక్కడ స్నేహితులు పరిచయం అవుతారు. ఓసందర్భంలో మానసకు విజయ్(నవీన్ చంద్ర)తో పరిచయం ఏర్పడుతుంది. మానసను విజయ్ పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించినా ఆమె ఒప్పుకోదు. నచ్చిన పని అయిన బిజినెస్ చేయాలని అనుకుంటుంది. దాంతో ఇంట్లో గొడవ జరుగుతుంది. మానస ఇల్లు వదలి వచ్చేస్తుంది. అదే సమయంలో అమెరికాలో సెటిలైన టాప్ కాఫీ కంపెనీ ఓనర్ కైలాస్ శివకుమార్(జగపతిబాబు)ని కలుస్తుంది. టీ బిజినెస్ గురించి చెబుతుంది. కైలాస్ ఆమె కేవలం వెయ్యి డాలర్లు మాత్రమే ఇస్తాడు. ఆ వెయ్యి డాలర్స్‌తో మానస ఏం చేస్తుంది. టీ బిజినెస్‌ను ఎలా స్టార్ట్ చేస్తుంది? ఆమెకు సపోర్ట్ చేసేదెవరు? మానస ప్రయాణంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష:
మిస్ ఇండియా ట్రైలర్ చూస్తే .. సినిమాలో ఓ అమ్మాయి తన కలను నేరవేర్చుకునే క్రమంలో ఎలాంటి సమస్యలను ఫేస్ చేసిందనేదే సినిమా అని క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. సినిమాలో ఎలాంటి గొప్ప ట్విస్టులు, టర్న్‌లు ఉండవని కూడా ట్రైలర్‌తోనే క్లియర్ చేశారు. అయితే కీర్తిసురేశ్ వంటి పెర్ఫామర్‌తో డైరెక్టర్ నరేంద్రనాథ్ సినిమాను ఎలా తెరకెక్కించాడనేదే ఆసక్తిని రేపింది. కానీ ఆ ఆసక్తి సినిమా చూసే క్రమంలో నీరుగారిందనే చెప్పాలి. సినిమా చూసేటప్పుడు ప్రేక్షకుడు ఎమోషన్స్‌కు కనెక్ట్ కావాలి. కానీ.. ఎక్కడా ప్రేక్షకుడు భావోద్వేగానికి లోను కాడు. రియాలిటీకి దూరంగా ఉన్న ఓ కాన్సెప్ట్‌తో సినిమా చేసినట్టు అనిపించింది. ఓ మధ్య తరగతి అమ్మాయి.. యు.ఎస్‌లో వెళ్లి వ్యాపారం చేయడమంటే.. చిన్న విషయం కాదు. సరే! ఇప్పుడు అమెరికాకు వెళితే మన ఆంధ్రాకు వెళ్లినట్లు ఉంటుంది. ప్రపంచమంతా గ్లోబలైజేషన్ అయ్యింది. ఇలాంటి సమయంలో అమెరికా వెళ్లి ఛాయ్ అమ్మడం అనే కాన్సెప్ట్‌తో సినిమా చేయడం మేకర్స్‌ను ఆలోచింప చేయలేదేమో కానీ.. ప్రేక్షకుడిని మాత్రం ఆలోచింప చేసింది.
ఓ మారుమూల పల్లెలో మొదటి తరగతి అమ్మాయిని ఏదో పెద్ద గోల్ చేసుకోమని తండ్రి అడగటం, ఆ అమ్మాయి బిజినెస్ చేస్తాననడం .. అప్పటి నుండే ఇంట్లో అమ్మాయికి వ్యతిరేకత రావడం ఇవన్నీ చూస్తే...అసలు సినిమా పాయింట్ ఇక చివరి వరకు ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. జగపతిబాబు పాత్రను చూస్తే కామెడీగా అనిపిస్తుంది. సినిమా పస్టాప్ అంతా హీరోయిన్ బిజినెస్ ఎలాస్టార్ట్ చేయాలా అనే పాయింట్ చుట్టూ తిరిగితే.. సెకండ్ హాఫ్ అంతా, హీరోయిన్, విలన్ మధ్య బిజినెస్ పోరు.. అది చూస్తే వేక్‌గా అనిపిస్తుంది. కీర్తిసురేశ్ సినిమాలో లుక్, డ్రెస్సింగ్, స్టైల్‌గా కనిపించి చేయాల్సిందంతా చేసింది. సినిమాలో రాజేంద్ర ప్రసాద్, నదియా, జగపతిబాబు వంటి ఎందుకా అనే డౌట్ కూడా వస్తుంది. వారు లేకుండా ఉండుంటే కాస్త బడ్జెట్ అయినా మిగిలేదిగా. తమన్ అందించిన పాటల్లో టైటిల్స్ వేసే సందర్భంలో వచ్చే పాట, బ్యాగ్రౌండ్ స్కోర్ బావున్నాయి. సినిమాను ఓ పాత కాన్సెప్ట్‌తో తెరకెక్కించి ఏదో తీసేయాలి, జనాలు చూసేస్తారని ఇప్పటి పరిస్థితుల్లో అనుకుంటే తప్పే. ఇది మిస్ ఇండియాతో మరోసారి ప్రూవ్ అయ్యింది.
