వేతనాలు పెంచాలంటూ.. సినీ కార్మికులు ఈ రోజు (జూన్ 22).. నిర్మాతల మండలి కార్యాలయాన్ని ముట్టడించిన సంగతి తెలిసిందే. దానికి ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ మీడియా ముందుకొచ్చి.. వేతనాలు పెంచడానికి తమకు అభ్యంతరాలు లేవని, రేపటి నుంచి యధావిధిగా కార్మికుల్ని షూటింగ్స్ కు హాజరుకమ్మని సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్.. స్పందించారు. ఆదర్శనగర్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘కరోనా నేపథ్యంలో సినీ కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు. సినిమాల షూటింగ్స్ లేకపోవడంతో ఉపాధి దొరక్క ఆర్ధిక కష్టాల్లో ఉన్నారు. తక్షణమే కార్మిక సంఘాలతో ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొనే వరకూ ఎదురు చూడొద్దు. సమస్య రెండు మూడు రోజుల్లో పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాను’.. అని తలసాని అన్నారు.