‘‘ఎవరి దగ్గరి నుంచి గౌరవాన్ని ఆశించకు. కానీ సెట్లో అందరినీ గౌరవించు. అని నా కెరీర్ తొలి రోజుల్లో మా అమ్మ చెప్పింది. అదే ఈరోజుకీ ఫాలో అవుతున్నా’’ అన్నారు నరేష్ విజయకృష్ణ. ఆయన నట ప్రయాణానికి సరిగ్గా యాభై ఏళ్లు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ‘‘1972లో పండంటి కాపురం చిత్రంతో తెరంగేట్రం చేశాను. యాభై ఏళ్లు నటుడిగా కొనసాగడం అంటే మాటలు కాదు. ఇదంతా ప్రేక్షకులు, దర్శకులు, నిర్మాతలు నాపై ఉంచిన నమ్మకంతోనే సాధ్యమైంది. ఇప్పటికీ దర్శకులు, రచయితలు నన్ను దృష్టిలో ఉంచుకుని కథలు రాసుకుంటున్నారంటే ఇదంతా నా అదృష్టమే. సెకండ్ ఇన్నింగ్స్లో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు వచ్చినప్పుడు నేను ఎస్వీ.రంగారావుగారిని ఆదర్శంగా తీసుకున్నా. ఆయనలా ఎలాంటి పాత్రలో అయినా నటించాలని అనుకున్నా. దానికి తగ్గట్టే విభిన్నమైన పాత్రలు వస్తున్నాయి. ‘హీరో’లో మంచి వేషం వేశా. గతేడాది ‘జాతిరత్నాలు’, ‘దృశ్యం 2’, ‘ఽశ్రీదేవి సోడా సెంటర్’ మంచి పేరు తీసుకొచ్చాయి. ఈ యేడాది ‘గని’, ‘అంటే.. సుందరానికి’, ‘అన్నీ మంచి శకునాలే’ చిత్రాల్లోనూ మంచి పాత్రలు దక్కాయ’’న్నారు.