మాస్‌... ఊర మాస్‌... 12 నుంచి షూటింగ్‌

హీరో రామ్‌, దర్శకుడు ఎన్‌. లింగుసామి కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్‌ స్ర్కీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.6గా తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇది రామ్‌ నటిస్తున్న తొలి ద్విభాషా చిత్రమైతే... లింగుసామికి తొలి స్ట్రయిట్‌ సినిమా. ఈ నెల 12న చిత్రీకరణ ప్రారంభం కానుంది. నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ ‘‘రామ్‌తో ఎప్పట్నుంచో సినిమా చేయాలనుకుంటున్నాం. లింగుసామి మాంచి ఊర మాస్‌ కథ చెప్పారు. రామ్‌ వెంటనే చేద్దామన్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించింది. అందుకు తగ్గట్టు దర్శకుడు పవర్‌ఫుల్‌ కథ సిద్ధం చేశారు. ఇటీవలే హీరోకి తుది స్ర్కిప్ట్‌ వినిపించారు. ఆయనకు బాగా నచ్చింది. వెంటనే చిత్రీకరణ ప్రారంభించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ట్వీట్‌ చేశారు. దాంతో అంచనాలు మరింత పెరిగాయి. వాటికి తగ్గట్టు ఉన్నత సాంకేతిక విలువలు, భారీ నిర్మాణ వ్యయంతో ఖర్చుకు రాజీ పడకుండా సినిమా రూపొందిస్తున్నాం. దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన బాణీలు అందిస్తున్నారు’’ అని చెప్పారు. రామ్‌కు జంటగా కృతీ శెట్టి నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: నవీన్‌ నూలి, కళ: డి.వై. సత్యనారాయణ, పోరాటాలు: అన్బు-అరివు, ఛాయాగ్రహణం: సుజీత్‌ వాసుదేవ్‌, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా-లింగుసామి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, సమర్పణ: పవన్‌కుమార్‌, కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: ఎన్‌. లింగుసామి.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.