ముందుంది మాస్ జాతర
ABN , First Publish Date - 2022-07-25T06:17:25+05:30 IST
ఓపక్క ‘టాలీవుడ్‌లో పరిస్థితులు బాలేవు... జనాలకు థియేటర్లకు వచ్చే మూడ్ లేదు’ అనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇంకోవైపు గంపగుత్తగా సినిమాలు వస్తూనే ఉన్నాయి...

ఆగస్టులో సినిమా పండగ
ఓపక్క ‘టాలీవుడ్‌లో పరిస్థితులు బాలేవు... జనాలకు థియేటర్లకు వచ్చే మూడ్ లేదు’ అనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇంకోవైపు గంపగుత్తగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. జులైలో కొత్త సినిమాల హవా బాగానే కపిపించింది. ప్రతీ వారం ఓ పెద్ద సినిమాతో పాటు, నాలుగైదు చిన్న చిత్రాలూ వరుస కట్టాయి. అయితే వాటిలో ఒక్కటి కూడా సరైన విజయాన్ని అందుకోలేదు. ఆగస్టులో కూడా సేమ్ టూ సేమ్.. వరుసగా సినిమాలు వచ్చేస్తున్నాయి. వాటిలో అధికశాతం మాస్ చిత్రాలే. గత రెండు నెలలుగా టాలీవుడ్‌కి హిట్ అనేదే లేదు. సో.. ఆగస్టులో ఒకట్రెండు హిట్లు పడడం అత్యవసరం.
ఈనెలాఖరున ‘రామారావు ఆన్ డ్యూటీ’ వస్తోంది. రవితేజ నటించిన సినిమా ఇది. రవితేజ అంటేనే మాస్. అందుకే ఆయన ‘మాస్ మారాజ్’ అయ్యారు. ఆయన సినిమాలో మాస్‌కి నచ్చే అంశాలు పుష్కలంగా ఉంటాయి. ట్రైలర్‌లోనూ యాక్షన్‌ని బాగా దట్టించారు. జులైకి ‘రామారావు’ గుడ్ బై చెప్పబోతున్నాడు. ఈ నెలలో వచ్చిన ‘ది వారియర్’, ‘థ్యాంక్యూ’ చిత్రాలు బోల్తా పడ్డాయి. ఈనెలలో కనీసం ఒక్క యావరేజ్ కూడా లేదు. ఆ లోటు రామారావు తీరుస్తాడేమో చూడాలి. ఆగస్టులో అయితే... కొత్త సినిమాలు వరుసగా రాబోతున్నాయి. 5న ‘బింబిసార’ ముస్తాబైంది. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సోషియో ఫాంటసీ అంశాలు ఇందులో మిక్స్ చేశారు. కల్యాణ్ రామ్ గెటప్పులు కూడా అలరిస్తున్నాయి. ప్రచార చిత్రాల్లో యాక్షన్ హంగామా ఎక్కువగానే కనిపిస్తోంది. ‘మగధీర’, ‘బాహుబలి’లా... కత్తి యుద్ధాలూ ఉండబోతున్నాయి. ప్రేక్షకుల్ని ఆకర్షించే అంశాలన్నీ ఇందులో పొందుపరిచారు. మరి ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. ‘బింబిసార’ హిట్టయితే... పార్ట్ 2, పార్ట్ 3 కూడా రూపొందిస్తామని ఇది వరకే కల్యాణ్ రామ్ చెప్పేశారు. పార్ట్ 2కి సంబంధించిన కథ కూడా రెడీ అయిపోయిందని సమాచారం. అదే రోజున.. ‘సీతారామం’ విడుదల అవుతోంది. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. వైజయంతీ మూవీస్ నిర్మించింది. ఈ సినిమాపై ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు పెట్టారట. దుల్కర్‌కి తెలుగుతో పోలిస్తే, మలయాళంలో మంచి మార్కెట్ ఉంది. అక్కడ తన సినిమా హిట్టయితే కనీసం రూ.25 కోట్లు వసూలు చేస్తుంది. అందుకే ఈ స్థాయిలో ఖర్చు పెట్టారు. ఈ చిత్రంతో మృణాల్ ఠాకూర్ కథానాయికగా పరిచయం అవుతున్నారు. రష్మిక ఓ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా కథని మలుపు తిప్పే పాత్రలో కనిపించబోతున్నాడట. ఆగస్టులో విడుదల అవుతున్నవన్నీ మాస్ సినిమాలే. ‘సీతారామం’ తప్ప... ఇదో క్లాస్ లవ్ స్టోరీ.
ఆగస్టు 12న.. రెండు చిత్రాలు రాబోతున్నాయి. వాటిలో ‘మాచర్ల నియోజకవర్గం’ ఒకటి. నితిన్ కథానాయకుడిగా నటించారు. కృతిశెట్టి కథానాయిక. అంజలి ఓ ప్రత్యేక గీతంలో మెరిశారు. నితిన్ చేసిన ఫుల్ మాస్, యాక్షన్ సినిమా ఇది. పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇందులో నితిన్ ఐఏఎస్ అధికారిగా కనిపించబోతున్నాడు. ఈ తరహా పాత్ర చేయడం నితిన్‌కి ఇదే తొలిసారి. పాటలు, ప్రచార చిత్రాలూ మాసీగా ఉన్నాయి. అదే రోజున ‘కార్తికేయ 2’ విడుదల అవుతోంది. నిఖిల్ - చందూ మొండేటి కాంబినేషన్‌లో రూపొందిన ‘కార్తికేయ’ ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. దానికి సీక్వెల్ ఇది. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నిఖిల్ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమా ఇది. గ్రాఫిక్స్‌కి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే ఆగస్టు 25న వస్తున్న ‘లైగర్’ మరో ఎత్తు. విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందించిన చిత్రమిది. ఇందులో విజయ్... ఓ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం విజయ్ మారిన విధానం ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత బాక్సింగ్ క్రీడాకారుడు మైక్ టైసన్ ఓ కీలక పాత్ర పోషించడం విశేషం. హిందీతో పాటుగా అన్ని దక్షిణాది భాషల్లోనూ విడుదల అవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా దాదాపుగా రూ.200 కోట్ల మార్కెట్ చేయబోతోందని టాక్. డిజిటల్ రైట్స్ రూపంలో ఇప్పటికే రూ.100 కోట్లు వచ్చినట్టు సమాచారం. ‘ఆగస్టు 25న ఇండియా షేకైపోతుంది’ అని విజయ్ దేవరకొండ ముందే.. అంచనాలు పెంచేశాడు. ‘కేజీఎఫ్ 2’ తరవాత పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవతున్న పెద్ద సినిమా ఇది. ‘లైగర్’ విజయవంతమైతే... సౌత్ సినిమా మార్కెట్ మరింతగా వృద్ధిలోకి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వీటితో పాటుగా మరో అరడజను చిన్న సినిమాలు ఆగస్టులో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి వీటి జాతకం ఎలా ఉందో చూడాలి.