దర్శక ధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా నటించారు. అజయ్ దేవగణ్ (Ajay Devgan), ఆలియా భట్ (Alia Bhatt), ఒలివియా మోరిస్(Olivia Morris) కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మార్చి 25న విడుదలైంది. రూ.1200కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్ మే 20నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఈ సినిమాను విదేశీ ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు. హాలీవుడ్ దర్శకులు కూడా ఈ చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు. తాజాగా ఓ హాలీవుడ్ డైరెక్టర్ మాత్రం జేమ్స్ బాండ్ పాత్రకు రామ్ చరణ్ సరిగ్గా సరిపోతాడని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
మార్వెల్స్ నుంచి వచ్చిన టెలివిజన్ సిరీస్ ‘ల్యూక్ కేజ్’ (Luke Cage). ఈ టెలిజన్ సిరీస్‌కు రైటర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, క్రియేటర్‌గా పని చేసిన వ్యక్తి చెయో హోదారి కోకర్ (Cheo Hodari Coker). అతడు తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ ను వీక్షించాడు. అనంతరం జేమ్స్ బాండ్ పాత్రను గుర్తుకు తెచ్చుకుంటే రామ్ చరణ్ తన మదిలోకి వచ్చాడని తెలిపాడు. జేమ్స్ బాండ్ పాత్రను ప్రస్తుతం డేనియల్ క్రెగ్ పోషిస్తున్నాడు. అతడి అనంతరం ఈ పాత్రను ఎవరు చేస్తారనే విషయంలో సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెయో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం గమనార్హం. ‘‘తర్వాతి జేమ్స్ బాండ్ ఎవరనగానే ‘గ్యాంగ్స్ ఆఫ్ లండన్’లో సోప్, ‘ది ఆఫర్’ లో జీ.మాథ్యూ, ‘స్నోఫాల్’ లో డ్యామ్‌సన్, ‘ఆర్ఆర్ఆర్’ లో రామ్ చరణ్ వెంటనే నాకు గుర్తుకొచ్చారు’’ అని చెయో చెప్పాడు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రామ్ చరణ్ అభిమానులందరు తెగ షేర్ చేయడం మొదలుపెట్టారు. జేమ్స్ గన్, స్కాట్ డెరిక్సన్, రుస్సో బ్రదర్స్ వంటి హాలీవుడ్ డైరెక్టర్స్ ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ ను ప్రశంసించిన సంగతి తెలిసిందే.