సరిలేరు... మీకెవ్వరూ!

ABN , First Publish Date - 2020-07-05T17:43:05+05:30 IST

మంజుల ఘట్టమనేని... ఓ సూపర్‌స్టార్‌ కూతురు... ఇంకో సూపర్‌ స్టార్‌కి అక్క. అంతేనా? తను యాక్టర్‌, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌. అంతేనా? సెలబ్రిటీలందరూ ‘కుకింగ్‌ స్టోరీలతో’ యూట్యూబ్‌లో పలకరిస్తుంటే మంజుల మాత్రం ‘సెల్ఫ్‌ డెవలప్‌మెంట్‌’...

సరిలేరు... మీకెవ్వరూ!

మంజుల ఘట్టమనేని... ఓ సూపర్‌స్టార్‌ కూతురు... ఇంకో సూపర్‌ స్టార్‌కి అక్క. అంతేనా? తను యాక్టర్‌, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌. అంతేనా? సెలబ్రిటీలందరూ ‘కుకింగ్‌ స్టోరీలతో’ యూట్యూబ్‌లో పలకరిస్తుంటే మంజుల మాత్రం ‘సెల్ఫ్‌ డెవలప్‌మెంట్‌’ అంటూ లేటెస్ట్‌ మంత్రాతో ఆశ్చర్యపరుస్తోంది. ఓ కూతురుగా, అక్కగా, భార్యగా, అమ్మగా, ఇల్లాలిగా అన్నిట్లోనూ ప్రత్యేకతను సంపాదించుకున్న మంజుల ఆధునిక మహిళకు కేరాఫ్‌ ఎడ్రస్‌. నేనే కాదు మీరూ ‘ది బెస్ట్‌’ గా మారొచ్చు అంటూ అనేక విషయాలను పంచుకుంటోంది..


‘కృష్ణగారి అమ్మాయి...’ ఎంత ప్రివిలేజ్‌గా అన్పించిందో అంతే సమస్యగా మారింది నేను సినిమాల్లోకి రావాలని అనుకున్నప్పుడు. నా తెరంగేట్రానికి అభిమానులు అస్సలు ఒప్పుకోలేదు. వెండితెర కలల్లో విహరిస్తున్న నా జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. నిస్తేజం ఆవహించింది. కుంగుబాటులోకి కూరుకుపోయే స్థితికి వచ్చా. అప్పుడే మెడిటేషన్‌ నాకో దారి చూపించింది. నాలోకి నేను ప్రయాణించేలా చేసింది. 


పది వేల గంటల ధ్యానం...

ఏ యాత్ర అయినా చక్కగా ప్లాన్‌ చేసుకుంటే వారమో, నెల రోజుల్లోనో కంప్లీట్‌ చేసుకోవచ్చు. కాకపోతే మనలోకి మనం అనే ఆధ్యాత్మిక ప్రయాణం చాలా పెద్దది. నిర్దిష్ట దారులు ఉండవు. కేవలం సాధనతో చేయగలం. అసలు నేనెవరు, జీవిత లక్ష్యం ఏమిటి అని తెలుసుకోవడంలో జీవితాలు కూడా పండిపోతాయి. పదిహేడేళ్లప్పుడే ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ కోర్సు చేశా. యోగా, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజులు చేసేదాన్ని. కాకపోతే నేను అనుకున్నది చేయలేకపోతున్నాననే అసహాయస్థితి, జీవితం ఎందుకింత ఆట ఆడుతోంది. నాకే ఎందుకిలా అనే ప్రశ్నల్లో రోజులు... నెలలూ, సంవత్సరాలూ గడిచిపోయాయి. కొన్నేళ్లకు ప్రశ్నల స్థానంలో మనసు స్వాంతన పొందడం మొదలుపెట్టింది. ఓ చక్కటి క్షణంలో అనంతమైన శాంతి మనస్సును ఆవహించింది. అప్పుడు అన్పించింది క్రమపద్ధతిలో యోగసాధన చేయాలని. ఉపాసన, క్రియ యోగా లాంటివి చేశా. అనేక ‘సైలెంట్‌ రిట్రీట్‌’లకు వెళ్లి సాధన చేయడం మొదలుపెట్టా. అక్కడ షార్ట్‌, లాంగ్‌ టర్మ్‌ కోర్సుల్లో చేరా. ఉదయం నాలుగు గంటలకు నిద్రలేవాలి. అప్పటి నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు ఎవరితో మాట్లాడకూడదు. తల కిందకి దించి నేలను చూస్తూ నడవాలి. ఇంట్లో వాళ్లతో ఫోనులో కూడా మాట్లాడకూడదు. ఇలాంటి కోర్సులు పదిరోజులవైతే నలభై దాకా చేసుంటా. నెల రోజుల కోర్సులు రెండు చేశా. ఇవన్నీ నన్ను నాకే కొత్తగా పరిచయం చేశాయి. హీరోయిన్‌ అయితే ఏమయ్యేది తళుకుబెళుకు ప్రపంచం.. కానీ నిజమైన లైఫ్‌ మనల్ని మనం తెలుసుకోవడమే కదా అన్పించింది. అలా పది వేల గంటల యోగసాధన చేశా. 


బ్లాగుతో ప్రారంభం

మనస్సులో ఎంతో తదాత్మ్యత. ప్రశాంతత. నాకుగా నేను తెలుసుకున్నదంతా ప్రపంచానికి తెలియజేయాలనే ఆలోచన మూడేళ్ల క్రితం మొదలైంది. అనేక విధాలుగా ఆలోచించి ఇటీవలే మంజుల ఘట్టమనేని పేరుతో ఓ బ్లాగ్‌ను మొదలుపెట్టా. ‘వెల్‌నెస్‌’కు సంబంధించి ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ఆగస్టు 15న ప్రారంభిస్తున్నాను. ఇందులో హెల్త్‌, మైండ్‌, స్పిరిట్‌ ఈ మూడింటిపై దృష్టిసారించే అనేక అంశాలు ఉంటాయి. ఈ మూడు చక్కటి సమన్వయంతో ఉంటేనే జీవితం సాఫీగా ఉంటుంది. భయాందోళనలు దరిచేరకుండా, మంచి ఆలోచనలు, చక్కటి కుటుంబ సంబంధాలతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగేలా ఈ ఛానల్‌ ఉపయోగపడాలన్నది నా ఆకాంక్ష. ఈ ఇరవై ఏళ్లలో నేను నేర్చుకుంది, అనుభవించింది... ప్రతిదీ మనసులోంచి చెప్పాలనుకుంటున్నా. సమాజానికి ఈ విధంగా కంట్రిబ్యూట్‌ చేయాలని భావిస్తున్నా. దాన్నుంచి ఒకరు మోటివేట్‌ అయినా నేను విజయం సాధించినట్టే. ఎదురుగా పెద్ద గోడ అడ్డంగా ఉందనే అనుకుంటాం కానీ దానికి ఎక్కడో ఓ చోట తలుపు ఉంటుందని తెలుసుకోవడానికి ప్రయత్నించం. 


మనసుకు నచ్చితేనే..

అతి తక్కువ మందే తమ మనస్సుకు నచ్చిన పనులు చేయగల అదృష్టవంతులు. చాలా మంది ఇష్టంలేని ఉద్యోగాలు చేస్తూ అసంతృప్తితో రగిలిపోతుంటారు. దాన్ని సన్నిహితులపై చూపిస్తారు. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒక్కటే. మీ మనసు చెప్పే ఊసుల్ని వినండి. తను ఏం చేయాలనుకుంటుందో దృష్టిపెట్టండి. పక్కవాళ్లను చూసి వ్యామోహాలకు లోనుకాకండి. ప్రతి మనిషీ యూనిక్‌. అతడి లాంటి వాడు వేరే ఉండడు. సరిలేరు మీకెవ్వరు. అందుకే మీరేమిటో, ఏం చేయదలచుకుంటే అమితమైన ఆనందం వస్తుందో తెలుసుకుని ఆ దిశగా అడుగులు వేస్తే మీరు ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు. దాని వల్ల మీ చుట్టుపక్కల వాళ్లు, మొత్తం ప్రపంచమంతా హ్యాపీగా ఉంటుంది.


ఒకరికి ఒకరం

నేడు పిల్లల్ని పెంచడం చాలా పెద్ద పని. పేరెంటింగ్‌కి సంబంధించి నేను చేయని మెడిటేషన్‌ లేదు. చదవని పుస్తకం లేదు. చిన్నప్పుడు మా అమ్మమ్మను బాగా సతాయించేదాన్ని. ఇదేమిటి, అదెందుకు అని రకరకాల ప్రశ్నలతో వేధించేదాన్ని. ఈకాలం పిల్లలు జెట్‌ స్పీడ్‌. మనకన్నా వాళ్లకే ఎక్కువగా తెలుసు. మా పాప జాహ్నవి తొమ్మిదో తరగతి చదువుతోంది. హైపర్‌ యాక్టివ్‌. ఏది చేసినా చాలా క్లారిటీతో చేస్తుంది. పిల్లల్ని పెంచడానికి ఒక్క రూల్‌ అంటూ లేదు. ఈ స్మార్ట్‌ఫోన్ల యుగంలో పిల్లల్ని అనునిత్యం ఫాలో అవుతూనే ఉండాలి. వాళ్లు ఏం చేస్తున్నారు, ఆలోచనలు ఏమిటి అనేవి తెలుసుకుంటూనే ఉండాలి. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు వాళ్లతో రోజూ ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. ఇక నా ఈ ప్రయాణంలో నా వెన్నంటే ఉన్నారు సంజయ్‌ స్వరూప్‌. 


నా మంత్రా ఇదే..

నేడు మహిళలు లేని రంగాలు లేవు. మహిళలకు చెప్పేది ఒకటే. మిమ్మల్ని మీరు ప్రేమించండి. మీ గురించి కాస్త కేర్‌ తీసుకోండి. ఇది నా అభ్యర్థన. ఎందుకంటే ఇంటికి కేంద్ర బిందువు స్త్రీ. ఇల్లు, భర్త, పిల్లలు, అత్తమామల్ని చూడాల్సిన బాధ్యత స్త్రీదే. ఆ మహిళే గట్టిగా లేకపోతే ఇంటిని ఎలా రక్షించుకోగలుగుతుంది. ఏదీ ఆశించకుండా ఇరవై నాలుగు గంటలూ ఎన్ని పనులైనా చేయగలిగేది ఒక్క మహిళ మాత్రమే. దేవుడు సృష్టించిన అద్భుతం స్త్రీ. కాకపోతే మన ఆరోగ్యం బాగుంటేనే ఇతరులకు సేవ చేయగలం. అందుకే మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకోకండి. రోజూ ఓ అరగంట కుదరకపోతే ఓ పది నిమిషాలు మీతో మీరు స్పెండ్‌ చేయండి. తేలికపాటి ఎక్సర్‌సైజులో, నడకో చేయండి. కాసేపు ధ్యానంలో కూర్చోండి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఓ షెడ్యూల్‌ వేసుకోండి. ఆ ప్రణాళిక ప్రకారం వెళ్లండి. ఇంట్లో మిగిలిపోయిన ఆహారాన్ని తింటూ అనారోగ్యాన్ని  తెచ్చుకోవద్దు. మీ భర్తనూ, పిల్లల్నే కాదు మిమ్మల్ని కూడా మీరు ప్రేమించాలి. పర్వతం నిండుగా ఉంటేనే దాని మీది నుంచి జలపాతాలు జాలువారతాయి. అలా మిమ్మల్ని మీరు సంపూర్ణంగా మలచుకోండి. ఆ ప్రేమను కుటుంబానికి పంచండి.


సూర్యుడే ప్రత్యక్ష దైవం

తిరుపతి వెంకటేశ్వరస్వామిని బాగా నమ్ముతాను. ఎంతో కష్టపడి క్యూలో నిలుచుని ఏడుకొండల వాణ్ని దర్శించుకుంటాం. కానీ రోజూ మన ఇంటికి వచ్చి పలుకరించే శక్తివంతమైన సూర్యభగవానుడుని పట్టించుకోం.  నేను సూర్యోదయాన్ని మిస్‌ కాను. ఉదయమే మెడిటేషన్‌, యోగా, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌, వాకింగ్‌ చేస్తా.  సాయంత్రం సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తాను. మనకు అవగాహన లేదు కానీ సిర్కాడియన్‌ రిథమ్స్‌ అని మన శరీరం సూర్యుడితో అనుసంధానమై ఉంటుంది. ఆ రెండు సమయాల్లో వచ్చే శక్తివంతమైన కిరణాలు మన జీవితాల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి.


- డి.పి.అనురాధ



Updated Date - 2020-07-05T17:43:05+05:30 IST