ఓటు వేసేందుకు చెన్నై వెళుతోన్న మంచు విష్ణు
ABN , First Publish Date - 2021-12-11T23:24:08+05:30 IST
మంచు విష్ణు ఓటు వేసేందుకు చెన్నై వెళుతున్నాడనే.. అంతా ఆశ్చర్యపోవడం సహజమే. కానీ ఇక్కడ విషయం ఆయన రియల్ లైఫ్‌కి సంబంధించినది కాదు. రీల్ లైఫ్‌కి చెందినది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మంచు విష్ణు..

మంచు విష్ణు ఓటు వేసేందుకు చెన్నై వెళుతున్నాడనే.. అంతా ఆశ్చర్యపోవడం సహజమే. కానీ ఇక్కడ విషయం ఆయన రియల్ లైఫ్‌కి సంబంధించినది కాదు. రీల్ లైఫ్‌కి చెందినది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఓటర్’. తెలుగులో అనుకున్నంతగా విజయం సాధించలేకపోయిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తమిళంలోకి ‘కురల్ 388’ పేరుతో అనువదిస్తున్నారు. సురభి హీరోయిన్. రామా రీల్స్ బ్యానర్‌లో నిర్మాణం జరుపుకోగా.. జీఎస్ కార్తీక్ దర్శకత్వం వహించారు. తమన్ సంగీత స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, సంపత్‌రాజ్, జయప్రకాష్, నాజర్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. 2019లో ఈ చిత్రం టాలీవుడ్‌లో విడుదలైంది.
ఇప్పుడు తమిళంలోకి అనువదించగా.. రవిశంకర్ అనే పాత్రికేయుడు తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ రాశారు. అమెరికా, థాయ్‌లాండ్, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు యాక్షన్, ప్రేమ కలగలిపిన ఒక సామాజిక అంశంతో పక్కా కమర్షియల్ మూవీగా రూపొందించారు. ఈ చిత్ర కథ గురించి దర్శకుడు కార్తీక్ మాట్లాడుతూ.. ‘అమెరికాలో ఉండే హీరో ఓటు వేయడానికి సొంతూరుకు వస్తారు. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నట్టు గుర్తించడమే కాకుండా తన ప్రియురాలి ద్వారా మరికొన్ని సమస్యలను తెలుసుకుంటారు. ఈ సమస్యలను అనేక నాటకీయ పరిణామాల మధ్య పరిష్కరించేలా కథ సాగుతుంది’ అని వివరించారు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.