సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), నేహాశెట్టి(Neha shetty) జంటగా విమల్ కృష్ణ (Vimal Krishna) దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘డీజే టిల్లు’ (DJ Tillu). చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్, కిరీటి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamshi) ఈ సినిమాను నిర్మించారు. దీనికి సీక్వెల్ తీస్తున్నట్టు హీరో సిద్ధూ ఆ మధ్య అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రెండో భాగం విషయంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. హీరోగా సిద్ధూనే నటిస్తున్నప్పటికీ.. దర్శకుడు విమల్ కృష్ణ ప్లేస్‌లో వేరే దర్శకుడు మెగా ఫోన్ పట్టుకోనున్నాడని ఇదివరకే వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఆ దర్శకుడు ఎవరనే విషయం బైటికొచ్చింది.
తాజా సమాచారం ప్రకారం ‘డిజె టిల్లు 2’ చిత్రానికి ‘అద్భుతం’ (Adbhutham)ఫేమ్ మల్లిక్ రామ్ (Mallik Ram) దీనికి దర్శకుడని టాక్. తేజ సజ్జా (Teja Sajja) కథానాయకుడిగా నటించిన అద్భుతం మూవీ ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. టైమ్ లూప్ కథాంశంగా తెరక్కిన ఈ సినిమాకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో మల్లిక్ రామ్‌కు ‘డిజే టిల్లు 2’ (Dj Tillu 2) చిత్రాన్ని డైరెక్ట్ చేసే బాధ్యత అప్పగించారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. కథా చర్చల్లో మల్లిక్ రామ్ కూడా పాల్గొంటున్నాడు. ఈ సినిమాకి కూడా సిద్ధూ జొన్నలగడ్డనే కథ, మాటలు అందిస్తున్నాడు.
డిజె టిల్లు .. రాధిక అనే రేడీయో జాకీతో ప్రేమలో పడతాడు. ఒకరోజు అనుకోకుండా రాధిక ఒక హత్య చేస్తుంది. టిల్లు కూడా ఆ హత్యకేసులో ఇరుక్కుంటాడు. చివరికి టిల్లు తన తెలివితేటలతో ఈ కేసు నుంచి ఎలా బైటపడ్డాడు అన్నదే మిగతా కథ. సీక్వెల్ మొదటి భాగానికి కొనసాగింపుగా ఉంటుందని, ఇందులో అతిథి పాత్రలో రాధిక పాత్రధారి నేహాశెట్టి కూడా నటించబోతోందని వినికిడి. రెండో భాగానికి కూడా తమన్ (Thaman) సంగీతం అందిచబోతున్నట్టు టాక్. మరి ‘టిజె టిల్లు 2’ మొదటి భాగాన్ని మించి ఎంటర్ టైన్ చేస్తుందేమో చూడాలి.