అవకాశం వస్తే ‘ఐష్’ బయోపిక్‌లో నటించాలని ఉంది: సౌత్ యంగ్ హీరోయిన్
ABN , First Publish Date - 2022-03-10T03:15:57+05:30 IST
తనకంటూ అవకాశం వస్తే మాత్రం బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బయోపిక్‌లో నటించాలనే కోరిక ఉందని మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్ వెల్లడించింది. హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ చిత్రం తర్వాత తన లైఫ్ ఛేంజ్ అయిందని, ధనుష్ నుంచి

తనకంటూ అవకాశం వస్తే మాత్రం బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బయోపిక్‌లో నటించాలనే కోరిక ఉందని మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్ వెల్లడించింది. హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ చిత్రం తర్వాత తన లైఫ్ ఛేంజ్ అయిందని, ధనుష్ నుంచి చాలా నేర్చుకున్నట్టు ఆమె పేర్కొంది. ధనుష్ నటించిన తాజా చిత్రం ‘మారన్’లో మాళవిక హీరోయిన్. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించగా సత్యజ్యోతి బ్యానరుపై సీనియర్ నిర్మాత టీజీ త్యాగరాజన్ సమర్పణలో రూపుదిద్దుకుంది. ఈ నెల 11 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, మాళవికా మోహనన్ తాజాగా విలేకరులతో ముచ్చటించింది.
ఆమె మాట్లాడుతూ.. ‘‘మారన్ చిత్రంలో నటించే అవకాశం రావడానికి హీరో ధనుష్ ప్రధాన కారణం. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధనుష్‌తో నటించాలని ఉందని చెప్పాను. బహుశా ఆ ఇంటర్వ్యూ ధనుష్ చూసి నా పేరు సిఫార్సు చేసివుంటారని భావిస్తున్నాను. సినిమా కథలో బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ప్రధాన బలం. ఇందులో రొమాన్స్, కామెడీ, డ్రామా, సెంటిమెంట్, భావోద్వేగం ఇలా అన్ని అంశాలు కలిసివున్నాయి. నా పాత్ర పేరు తార. ఫొటో జర్నలిస్టు. దీనికి ధనుష్ అన్ని విధాలుగా సహకరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ధనుష్ ఓ ‘మాస్టర్ పీస్’. ‘మారన్’ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. అయితే, ఓటీటీలో విడుదల కావడమే ఒకింత నిరుత్సాహం. ఇక విజయ్‌తో నటించిన ‘మాస్టర్’ చిత్రంతో నా లైఫ్ ఛేంజ్ అయింది. ఎక్కడకు వెళ్ళిన ‘మాస్టర్’ హీరోయిన్ అంటూ గుర్తుపడుతున్నారు. కరోనా తర్వాత విడుదలైన తొలి భారీ బడ్జెట్ చిత్రం. తమిళంలో మూడు చిత్రాల్లో నటించాను. ఈ మూడింటిలోనూ డిఫరెంట్ రోల్స్. మళ్ళీ అవకాశమంటూ వస్తే సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటిస్తాను. ‘పేట’లో చిన్నరోల్. ‘మాస్టర్’లో కాలేజీ లెక్చరర్. ‘మారన్’లో ఫొటో జర్నలిస్ట్. ఇప్పటివరకు సరైన డ్యూయట్ సాంగ్ లేకపోవడం నిరుత్సాహంగా ఉంది. సోషల్ మీడియా వేదికగా ఒక వ్యక్తి ఎత్తు, రంగు, వెంట్రుకలు, శరీరం ఇలా ప్రతి కోణంలోనూ విమర్శలు చేస్తున్నారు. కరోనా ఆంక్షలు తొలగించడం వల్లే మాల్దీవులకు విహార యాత్రకు వెళ్ళాను. తమిళంలో మరికొన్ని ప్రాజెక్టుల కోసం చర్చలు జరుగుతున్నాయి. హిందీ, తెలుగు భాషల్లో రెండు చిత్రాలకు కమిట్ అయ్యాను. త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తాను’’ అని మాళవికా మోహనన్ వివరించింది.
