మ్యూజిక్‌ ప్లగ్‌-ఇన్స్‌ తయారు చేస్తుంటా!

ABN , First Publish Date - 2021-10-07T05:59:21+05:30 IST

‘‘సంగీత దర్శకుడు కావడానికి ముందు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా కొన్ని రోజులు పని చేశా. నాకు సంగీతం కాకుండా టెక్నాలజీ అంటే... ఇష్టం. సంగీతానికి సంబంధించిన కొత్త టెక్నాలజీ ఏం వచ్చిందని తెలుసుకుంటా...

మ్యూజిక్‌ ప్లగ్‌-ఇన్స్‌ తయారు చేస్తుంటా!

‘‘సంగీత దర్శకుడు కావడానికి ముందు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా కొన్ని రోజులు పని చేశా. నాకు సంగీతం కాకుండా టెక్నాలజీ అంటే... ఇష్టం. సంగీతానికి సంబంధించిన కొత్త టెక్నాలజీ ఏం వచ్చిందని తెలుసుకుంటా! అప్పుడప్పుడూ మ్యూజిక్‌ ప్లగ్‌-ఇన్స్‌ తయారు చేస్తుంటా. అది నా ప్యాషన్‌’’ అని సంగీత దర్శకుడు చేతన్‌ భరద్వాజ్‌  అన్నారు. శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా నటించిన చిత్రం ‘మహాసముద్రం’. అజయ్‌ భూపతి దర్శకుడు. సుంకర రామబ్రహ్మం నిర్మాత. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. చేతన్‌ భరద్వాజ్‌ చెప్పిన సంగతులివీ...


‘‘దర్శకుడు అజయ్‌ భూపతితో ‘ఆర్స్‌ఎక్స్‌ 100’కు పని చేశా. ఆ సినిమా పాటలు, నేపథ్య సంగీతం నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. అజయ్‌ తన రెండో చిత్రానికీ నన్నే సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’లో ట్విస్ట్‌ ప్రేక్షకులకు షాక్‌, సర్‌ప్రైజ్‌ ఇచ్చాయి కదా! అటువంటి ట్విస్ట్‌లు ‘మహాసముద్రం’లో ఐదారు ఉంటాయి. ఇంత ఇంటెన్స్‌ సినిమా ఈమధ్య కాలంలో చూసి ఉండరు.


‘మహా సముద్రం’ ఓ భావోద్వేగభరిత సినిమా. మహా అనే అమ్మాయి జీవితంలో జరిగే సంఘటనలు ఆమె చుట్టూ మనుషులపై ఎటువంటి ప్రభావం చూపించాయనేది కథ. అన్ని పాత్రలకూ ప్రాముఖ్యం ఉంటుంది. అందరిలో ఓ అమాయకత్వం కనిపిస్తుంది. ఇలాంటి కథ, భావోద్వేగాలు ఉన్న చిత్రానికి సంగీతం అందించడం సవాల్‌. లైవ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఎక్కువ ఉపయోగించా. నేపథ్య సంగీతం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా.


‘చెప్పకే... చెప్పకే’ పాటకు ఎక్కువ సమయం తీసుకున్నా. అది అత్యంత కీలక సందర్భంలో వస్తుంది. ఇప్పటివరకూ నేను చేయని విధంగానూ... ప్రేక్షకులకు చేరువయ్యేలానూ... కథకు తగ్గట్టు కొత్త పాటలు ఇవ్వాలని ప్రయత్నిస్తా. ‘హే రంభ...’ అలా చేసిందే. దానిని నేనే పాడాను. భాస్కరభట్ల, చైతన్య ప్రసాద్‌, కిట్టు విస్సాప్రగడ చక్కటి సాహిత్యం అందించారు. అజయ్‌ కథను సవివరంగా చెప్పడంతో మా పని సులభమైంది. 


ప్రస్తుతం ఆనంద్‌ దేవరకొండ హీరోగా ఓ సినిమా చర్చల దశలో ఉంది. ఇప్పటివరకూ సంగీత దర్శకుడిగా నా ప్రయాణంతో సంతృప్తిగా ఉన్నా. ఇంకా కొత్త పాటలు చేయాలనుంది. పాటైనా, నేపథ్య సంగీతమైనా కథలోంచే వస్తుంది. కథకు తగ్గట్టు కొత్త సంగీతం ఇవ్వాలనుంది.

Updated Date - 2021-10-07T05:59:21+05:30 IST