మహేశ్‌బాబుకు మాతృ వియోగం

ABN , First Publish Date - 2022-09-29T05:45:38+05:30 IST

ఘట్టమనేని వంశంలో మరో విషాదం చోటు చేసుకుంది. హీరో మహేశ్‌బాబుకు మాతృ వియోగం కలిగింది. సీనియర్‌ హీరో కృష్ణ సతీమణి ఇందిరా దేవి (70) కన్నుమూశారు....

మహేశ్‌బాబుకు మాతృ వియోగం

ఘట్టమనేని వంశంలో మరో విషాదం చోటు చేసుకుంది. హీరో మహేశ్‌బాబుకు మాతృ వియోగం కలిగింది. సీనియర్‌ హీరో కృష్ణ సతీమణి ఇందిరా దేవి (70) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంగా బాధ పడుతున్న ఆమె బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని నివాసంలో కన్నుమూశారు. ఇందిరా దేవి తన చిన్నకుమార్తె ప్రియదర్శిని, అల్లుడు సుధీర్‌బాబుల దగ్గర ఉంటున్నారు. కృష్ణ, ఇందిరా దేవి దంపతుల పెద్ద కుమారుడు రమేశ్‌బాబు అనారోగ్యంతో ఈ ఏడాది జనవరి నెలలో కన్నుమూసిన సంగతి విదితమే. ఆ విషాద సంఘటన జరిగిన ఎనిమిది నెలలకే ఇందిరా దేవి కన్నుమూయడంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు.


తెలంగాణ అల్లుడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని ముసలిమడుగు ఇందిరాదేవి పుట్టిన ఊరు. 1962 నవంబర్‌ ఒకటిన కృష్ణతో ఆమె వివాహం జరిగింది. అందుకే ఇప్పటికీ కృష్ణను ‘తెలంగాణ అల్లుడు’ అని ఆ ప్రాంత ప్రజలు మురిసి పోతూ చెప్పుకుంటారు. ఆ గ్రామంలో ఇందిరాదేవి ఇల్లు శిధిలావస్థలో ఇప్పటికీ అలాగే ఉంది. ఇందిరాదేవి దంపతులకు రమేశ్‌బాబు, మహేశ్‌బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని సంతానం. 


పిల్లలే ఆమె ప్రపంచం

భర్త సూపర్‌ స్టార్‌, ఇద్దరు కొడుకులు హీరోలు అయినప్పటికీ ఇందిరాదేవి ఏనాడూ సినిమా ఫంక్షన్స్‌లో పాల్గొని ఎరుగరు. కుటుంబ సభ్యుల వేడుకల్లో ఆమె చురుకుగా పాల్గొనేవారు. పిల్లలే తన ప్రపంచంగా ఆమె భావించేవారు. పబ్లిసిటీకి దూరంగా ఉంటూ పిల్లలతో కాలం గడిపేవారు. 


అమ్మ చేతి కాఫీ తాగితే.. 

మహేశ్‌కు అమ్మ ఇందిరమ్మ అన్నా, అమ్మమ్మ దుర్గమ్మ అన్నా ఎంతో ఇష్టం. నమ్రతతో పెళ్లి జరిగే వరకూ  తల్లి చాటునే ఆయన పెరిగారు. తన సినిమా ఏది విడుదలైనా మొదట అమ్మ దగ్గరకు వెళ్లి కాపీ తాగడం మహేశ్‌కు అలవాటు. ‘ఆ కాఫీ తాగితే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్లు ఉంటుంది. ఆవిడ ఆశీస్సులు నాకెప్పుడూ ముఖ్యం. ఆవిడ ఆశీస్పుల వల్లే నాకు ఈ విజయం వచ్చింది.’ అని ‘మహర్షి’ చిత్ర విజయోత్సవ వేడుకలో తన తల్లి ఇందిర గురించి చెప్పారు మహేశ్‌. తన తల్లి పుట్టిన రోజైన ఏప్రిల్‌ 20 తనకు ఎంతో ప్రత్యేకం అని మహేశ్‌ చాలా సందర్బాల్లో చెప్పారు. ఇందిరాదేవికి కూడా చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం. 



అన్నయ్యను కోల్పోయిన బాధ నుంచి ఇంకా తేరుకోక ముందే , తల్లి దూరం కావడం మహేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టింది. 

వెక్కి వెక్కి ఏడ్చిన సితార

నాయనమ్మతో మహేశ్‌బాబు కుమార్తె సితారకు అనుబంధం ఎక్కువ. ఈ మనవరాలితో చాలా సరదాగా గడిపేవారు ఇందిరాదేవి. అందుకే ఆవిడ పార్ధివ దేహాన్ని చూసి తట్టుకోలేక పోయిన సితార తండ్రి ఒడిలో కూర్చుని కన్నీళ్ల పర్యంతం అయింది. తండ్రి ఓదార్చినా ఆమె ఏడుపును ఆపుకోలేక పోయింది. 

మహా ప్రస్థానంలో అంత్యక్రియలు

కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శనార్ధం పద్మాలయా స్టూడియోలో బుధవారం మధ్యాహ్నం వరకూ ఇందిరా దేవి పార్దివ దేహాన్ని ఉంచారు. ఆ తర్వాత జూబ్లీ హిల్స్‌లోని మహా ప్రస్థానంలో ఆవిడ అంత్యక్రియలు జరిగాయి. 

Updated Date - 2022-09-29T05:45:38+05:30 IST