Mahesh Babu bday : సరిలేరు.. నీకెవ్వరు !

Twitter IconWatsapp IconFacebook Icon
Mahesh Babu bday : సరిలేరు.. నీకెవ్వరు !

అందమైన రూపం.. ఆకర్షించే కళ్ళు.. ఆకట్టుకొనే అభినయం.. అబ్బుర పరిచే ఆహార్యం.. వెరసి మహేశ్ బాబు. ఎవడు కొడితే బాక్సాఫీస్ దిమ్మతిరిగి కలెక్షన్స్ కుంభవృష్టి కురుస్తుందో అతడే సూపర్ స్టార్. ‘ఒక్కడు.. పోకిరి.. దూకుడు. శ్రీమంతుడు’.. లాంటి ఇండస్ట్రీ హిట్స్ సాధించి.. అభిమానుల గుండెల్లో పండుగాడయ్యాడు. అమ్మాయిల కలల రాజకుమారుడయ్యాడు. తండ్రి వేలు పట్టుకొని చిన్ననాటే ఎలాంటి బెరుకు లేకుండా.. కెమేరా ముందుకొచ్చిన యువరాజు అతడు. నాలుగు పదుల వయసులోనూ పాలుగారే పసితనపు పసిమిఛాయతో మెరిసిపోతున్న అతడ్ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. తండ్రి సూపర్ స్టార్ డమ్ ను, ఆయన లెగసీని కొనసాగిస్తోన్న ఆ ప్రిన్స్ పుట్టినరోజు నేడు (ఆగస్ట్ 9). ఈ సందర్బంగా మహేశ్ బాబు టాలీవుడ్ జెర్నీని ఒక్కసారి మననం చేసుకుందాం...

మహేశ్ బాబు (Mahesh Babu) 1975, ఆగస్ట్ 9న మద్రాస్ లో జన్మించాడు. అప్పటికే తండ్రి క‌ృష్ణ (Krishna) శత చిత్రాలు పూర్తి చేసి ఇండస్ట్రీలో హీరోగా జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. చిన్నప్పటి నుంచి తండ్రితో తిరిగి సినిమా వాతావరణం చూసిన మహేశ్.. అన్న రమేశ్ బాబుతో కలిసి ‘నీడ’ (Needa) చిత్రంతో వెండితెరపై మొదటిసారిగా కనిపించాడు. ఆ తర్వాత తండ్రి నటించిన ‘పోరాటం’ (Poratam) చిత్రంతో బాలనటుడిగా సినీ రంగప్రవేశం చేశాడు. తొలి చిత్రంతోనే శభాష్ అనిపించుకున్నాడు మహేశ్ బాబు. ఆ తర్వాత బాలనటుడిగా, తండ్రితో కలసి పలు చిత్రాల్లో నటించి.. నటనలోని మెళకువల్ని ఆ వయసులోనే ఒడిసిపట్టాడు. కొడుకు దిద్దిన కాపురం, గూఢచారి 117, శంఖారావం, బాలచంద్రుడు, అన్నతమ్ముడు, ముగ్గురు కొడుకులు లాంటి చిత్రాల్లో నటించి అభిమానుల్ని మెప్పించాడు. అతడి చదువు పాడవకూడదనే ఉద్దేశంతో కొంతకాలం మహేశ్ బాబును కెమేరా ముందుకు రానివ్వలేదు కృష్ణ. 

1999 లో ‘రాజకుమారుడు’ (Rajakumarudu) చిత్రంతో మహేశ్ బాబు హీరోగా సినీరంగ ప్రవేశం చేశాడు. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కైవసం చేసుకున్నాడు. మహేశ్ కెరీర్‌ను అద్భుతమైన మలుపు తిప్పిన చిత్రం ‘మురారి’ (Murari). అందులోని వైవిధ్యమైన అతడి నటనకు అభిమానులు మురిసిపోయారు. ఇక అతడికి యాక్షన్ హీరోగా మంచి బ్రేక్‌నిచ్చిన చిత్రం ‘ఒక్కడు’ (Okkadu). ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసి.. తిరుగులేని స్టార్ అయ్యాడు మహేశ్. కొన్ని విషయాల్లో తండ్రిని అనుసరించిన మహేశ్.. మరికొన్ని చోట్ల తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు.  ‘నిజం’ చిత్రంతో ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్న మహేశ్ బాబు.. ఆ తర్వాత ‘అతడు, దూకుడు, శ్రీమంతుడు’ చిత్రాలకుగాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి చిత్రాలు సిల్వర్ జూబిలీ జరుపుకున్నాయి. ‘శ్రీమంతుడు’ (Srimanthudu) రజతోత్సవం చేసుకుంది. 

తండ్రి లాగానే మహేశ్ బాబు నిర్మాతగా మారాడు. ఆయన నిర్మాణ భాగస్వామిగా జీయమ్బీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ‘శ్రీమంతుడు’ చిత్రం సూపర్ హిట్టయింది. ఆ తర్వాత ‘బ్రహ్మోత్సవం, సరిలేరు నీకెవ్వురు, సర్కారువారి పాట’ లాంటి సినిమాలతోనూ నిర్మాణ భాగస్వామి అయ్యాడు. అడివి శేష్ హీరోగా మేజర్  (Major) నిర్మించగా అది అద్భుతమైన రీతిలో ప్రేక్షకాదరణను పొందింది. ఇక మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9న ప్రపంచ వ్యాప్తంగా 175 స్ర్కీన్స్ లో 4K ఫార్మేట్ లో ‘పోకిరి’ (Pokiri) చిత్రం మరోసారి అభిమానుల ముందుకొచ్చింది. దీనికి అద్భుతమైన స్పందన లభించింది. రాబోయే చిత్రాలతో మహేశ్ బాబు ఇంకే స్థాయిలో తన స్టార్ డమ్ ను కొనసాగిస్తాడో చూడాలి.  


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.