మహర్షి మా నమ్మకం

ABN , First Publish Date - 2021-10-31T05:30:00+05:30 IST

వీకెండ్‌ వ్యవసాయం అంటూ వెండి తెరపై కొత్త పాఠాలు నేర్పాడు ‘మహర్షి’. ఆ ప్రయత్నం బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించింది. విమర్శకుల మెచ్చుకోళ్లతో పాటు అవార్డులూ అందించింది. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ఈ ‘మహర్షి’

మహర్షి మా నమ్మకం

వీకెండ్‌ వ్యవసాయం అంటూ వెండి తెరపై కొత్త పాఠాలు నేర్పాడు ‘మహర్షి’. ఆ ప్రయత్నం బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించింది. విమర్శకుల మెచ్చుకోళ్లతో పాటు అవార్డులూ అందించింది. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్న  ఈ ‘మహర్షి’ వెనుక ఇద్దరు రుషులున్నారు. ఒకరు దర్శకుడు వంశీ పైడిపల్లి... మరొకరు నిర్మాత దిల్‌ రాజు. ఈ ఇద్దరినీ ‘నవ్య’ పలకరించింది.


‘మహర్షి’తో జాతీయ అవార్డు అందుకున్న మీ యూనిట్‌ అందరికీ శుభాకాంక్షలు. ఈ సినిమాతో మీకున్న అనుబంధం, అనుభవం ఒకసారి గుర్తు చేసుకుంటే...? 


వంశీ:  2019లో ఈ సినిమా విడుదలైంది. కమర్షియల్‌గా మంచి విజయం సాధించి, ఇండస్ట్రీలో మంచి వాతావరణాన్ని క్రియేట్‌ చేసింది. ఉపరాష్ట్రపతిగారు కూడా సినిమాపై ట్వీట్‌ చేశారు. వాస్తవానికి ఒక సినిమా పూర్తయి, విడుదలైన తర్వాత.. ఆ సినిమాకి సంబంధించి సక్సెస్‌, ఫ్లాఫ్‌ వంటిది ఏదైనా ఒక నెల వరకే ఉంటుంది. కానీ మాహర్షి మాకు ఇప్పటికీ కిక్‌ ఇస్తూనే ఉంది. జాతీయ అవార్డుల గురించి మేము మరచిపోయాం. ఎందుకంటే 2019లో ఈ సినిమా వచ్చింది. 2020లో ప్రకటిస్తారనుకున్నాం.. కానీ కొవిడ్‌ ప్రభావంతో అది జరగలేదు. ఈ అవార్డు వస్తుందని.. మేము అసలు ఊహించలేదు. సినిమా తీస్తున్నప్పుడు ఒక మంచి సినిమా తీస్తున్నామని తెలుసు కానీ.. జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని మాత్రం ఊహించలేదు. ఈ సినిమాకి ఏం కావాలో దానిని సమకూర్చాం అంతే. ‘మహర్షి ప్రత్యేక చిత్రంగా మిగిలిపోతుంది’ అని మహే్‌ష అంటుండేవారు. ఆయన మాటలు నిజమయ్యాయి. అందులోనూ మహే్‌షకి ఇది 25వ చిత్రం. ఆయనకి కూడా ఈ సినిమా ఎంతో ప్రత్యేకమైనది.   


దిల్‌ రాజు:  ఈ సినిమా చేసేటప్పుడు మా బ్రదర్‌ నరసింహారెడ్డి అంటుండేవారు.. ‘ఈ సినిమాతో మరోసారి మనం జాతీయ అవార్డు అందుకోబోతున్నాం’ అని. మూవీ విడుదలడం, సక్సెస్‌ అవడం.. ఇలా మేమంతా ఎంజాయ్‌ చేస్తూ వచ్చాం. సడెన్‌గా జాతీయ అవార్డులు ప్రకటించగానే మేమంతా సర్‌పైజ్ర్‌ అయ్యాం. ఏ సినిమాకైనా నిర్మాత, దర్శకుడి మధ్య సమన్వయం కుదరాలని అంతా అంటారు. మరి మీ కెమిస్ట్రీ గురించి ఏం చెప్తారు?


వంశీ: మా ఇద్దరి మధ్య దర్శకుడు, నిర్మాత అని ఏం ఉండదు. మేమిద్దరం ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయిపోతాం. నేను ఆయనని అంకుల్‌ అని పిలుస్తుంటాను కానీ.. మేమిద్దరం అన్నదమ్ముళ్లా ఉంటాం. ప్రతి విషయాన్ని డిస్కస్‌ చేసుకుంటాం. వ్యక్తిగత సమస్యలు ఎదురైనప్పుడు కూడా వాటి గురించి మాట్లాడుకుంటాం.  ‘మీరు రాజుగారితో తప్ప ఎవరితో సినిమాలు చేయరా?’ అని అందరూ అడుగుతుంటారు. అంత కంఫర్ట్‌ ఇచ్చి సినిమా చేస్తున్నప్పుడు అంతకంటే ఏం కావాలి.  ఇప్పుడొచ్చిన జాతీయ అవార్డు మా బంధాన్ని మరింత ధృడం చేసింది. జీవితకాలం గుర్తుంచుకునే క్షణమిది. సినిమాలు వస్తుంటాయి... పోతుంటాయి.. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే, ఈ మధురమైన క్షణాలు మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంటాయి.  మేం చేసింది హీరోయిజం చూపించే సినిమా కాదు హీరో, విలన్‌ సినిమా కాదు.. అదొక వ్యక్తిత్వానికి సంబంధించిన సినిమా. ఇంటర్వెల్‌ ఫైట్‌, క్లైమాక్స్‌ ఫైట్‌ ఇలా ఆలోచించి చేసిన సినిమా కాదది.. క్యారెక్టర్‌ రెవల్యూషన్‌కి సంబంధించిన సినిమా. రాజుగారైతే ముందే నా విజన్‌ని చూసేశారు. ‘వంశీ చెప్పింది చెప్పినట్టు చేస్తాడు’ అని ఆయన నమ్ముతారు. ఆయన నాపై చూపే నమ్మకాన్ని భయంగా, భక్తితో చూస్తుంటాను. నా మొదటి సినిమా ఆడినా, ఆడకపోయినా.. మళ్లీ నన్ను ఆయన ఎంకరేజ్‌ చేశారు. చాలా తక్కువ మందికి మాత్రమే ఇటువంటి నమ్మకం ఉంటుంది.  


 ‘మహర్షి’ ప్రయాణంలో మీరు మరిచిపోలేని మూమెంట్‌ ఏమైనా ఉందా?

వంశీ:  చాలా ఉన్నాయి. ‘మహర్షి’ సాధారణమైన చిత్రం కాదు. యుఎ్‌సలో చిత్రీకరించాం. కాలేజీలో మహేష్‌ పై  తెరకెక్కించిన  సన్నివేశాలు, ద్వితియార్థంలో వ్యవసాయం గురించి చెప్పిన తీరు.. ఇవన్నీ నచ్చాయి. మహే్‌షతో పనిచేసిన ప్రతీ రోజూ అపురూపమే.


దిల్‌ రాజు: ఒక స్టార్‌ ఫిల్మ్‌కి జాతీయ అవార్డు రావాలంటే.. అందులో ఎక్సట్రార్డనరీ కంటెంట్‌ ఉంటేనే వస్తుంది. ఇందులో వంశీ తీసుకున్న పాయింట్‌ చాలా గొప్పది.. నేడు వ్యవసాయ తీరు మారిపోయింది. పంటలు పండించే రైతులు పల్లెటూరు వదిలి రకరకాల ప్రదేశాలకు వెళ్లిపోతున్నారు. రాబోయే తరానికి వ్యవసాయం అంటే పుస్తకాల్లో చదివి, యూట్యూబ్‌లలో చూసి తెలుసుకునేదిగా మారిపోతుంది. వంశీ ఈ పాయింట్‌ని తీసుకోవడం వల్ల.. ఈరోజు సమాజంలో వీకెండ్‌ వ్యవసాయం అనేది మొదలెట్టారు. సినిమా వచ్చాక చాలా మంది దీనికి కనెక్ట్‌ అయ్యారు. ఇది మేము సాధించిన గొప్ప విజయం.ఒక స్టార్‌ సినిమా ద్వారా ఎంతో మందిలో స్ఫూర్తినింపాం. ఎకానమీ పరంగా మంచి విజయం పొందడం, ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రభుత్వం గుర్తించడం.. ఒక్క సినిమాకి ఇవన్నీ రావడం చాలా అరుదు. అది మేం సాధించాం.


వంశీ:  మేము అవార్డుల కోసం ఈ సినిమా చేయలేదు. మనసా, వాచా, కర్మణా ఆ సినిమాకి ఏం అవసరమో.. అదే చేశాం. ఇప్పుడు  ఆ ఇన్నింగ్స్‌ అయిపోయింది. మరో ఇన్నింగ్స్‌ మొదలైంది.  విజయ్‌తో చేస్తున్న చిత్రంపై నేను, రాజుగారు దృష్టిపెట్టాం.  ఆ సినిమాకి కూడా మా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ ప్రతీది నమ్మకంపైనే నడుస్తుంది. దానికంటే హై మూమెంట్‌ ఇంకేది ఉండదు. 


సినిమా అంటే వేడుక. మనం రామాయణం, మహాభారతం చదివినప్పటి నుంచీకూడా తెలిసింది ఏమిటంటే.. కథలో ఒక హీరో ఉంటాడు. ఆ హీరో అనేవాడు ఏమైనా చేయగలడు. అతను ప్రపంచాన్ని కాపాడతాడా? దేశాన్ని కాపాడతాడా? లేదంటే రాజ్యాన్ని కాపాడతాడా? అనే థీమ్‌ చూస్తూ పెరిగాం. నేను స్వతహాగా కమర్షియల్‌ సినిమాలు చూసి పెరిగాను. ‘క్రియేటివ్‌ ఈజ్‌ ఆల్‌ వేస్‌ రెలిటివ్‌’.. నాకు ఒక తరహా చిత్రం నచ్చవచ్చు. మరొకరికి ఇంకో తరహా చిత్రం నచ్చవచ్చు. అలా రెలిటివ్‌గా ఉన్నప్పుడు నాకున్న బలం ఏంటి? నేను చేస్తున్న సినిమాలో నేను చెప్పాలనుకున్న పాయింట్‌ ఏంటి? అనేది చూసుకుని కథ రాసుకుంటాను. ‘మహర్షి’ చూసిన తర్వాత హీరో సూర్యగారు ఫోన్‌ చేసి ఓ మంచి మాట చెప్పారు. ‘‘మన జీవితంలో మన పేరేంట్స్‌ కొంత నేర్పిస్తారు. స్కూల్‌లో టీచర్స్‌ కొన్ని నేర్పిస్తారు. కాలేజీలలో కొంత. పెరిగేకొద్ది ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. అయితే దీనిలో నేర్చుకున్నది కొంత మంది ఎక్కించుకుంటారు. మరికొందరు ఎక్కించుకోలేరు. కానీ సినిమా ద్వారా ఒక మంచి విషయం కనుక చెబితే.. ప్రతి ఏజ్‌ గ్రూపుకి అది కనీసం 50 శాతం తగిలినా మనం విజయం సాధించినట్లే’’ అన్నారు. అదే ‘మహర్షి’ విషయంలో జరిగింది. సినిమాలో ఎకనామిక్స్‌, బిజినెస్‌ అనేవి మిళితమై ఉంటుంది. నిర్మాతలు సినిమాని డబ్బులు రావాలనే చేస్తారు. ఆ డబ్బుని నిర్మాతలకు తీసుకురావడంతో పాటు, నా క్రియేటివిటీతో నేను కొత్తగా ఏం చూపించగలను అనేది నా పరిధిలో ఉంటుంది. ఒకరకంగా ఇది ఛాలెంజ్‌తో కూడుకున్నది. కమర్షియల్‌ సినిమా తీయడం అంటే అంత ఈజీకాదు. ఎందుకంటే దానిపై ఎన్నో అంచనాలు ఉంటాయి. ప్రేక్షకులు ఎన్నో ఆశిస్తారు. వారి అంచనాలను అందుకోలేకపోతే ఒక వారం కాదు.. విడుదలైన మొదటి ఆట తర్వాత నుండే థియేటర్లలో ప్రేక్షకులు ఉండరు.


- వంశీ పైడిపల్లి



ఈ సినిమా చేసేటప్పుడు మా బ్రదర్‌ నరసింహారెడ్డి అంటుండేవారు.. ‘ఈ సినిమాతో మరోసారి మనం జాతీయ అవార్డు అందుకోబోతున్నాం’ అని. మూవీ విడుదలడం, సక్సెస్‌ అవడం.. ఇలా మేమంతా ఎంజాయ్‌ చేస్తూ వచ్చాం. సడెన్‌గా జాతీయ అవార్డులు ప్రకటించగానే మేమంతా సర్‌పైజ్ర్‌ అయ్యాం. 

- దిల్‌ రాజు


దిల్‌ రాజు:  వంశీ తన తొలి సినిమా మా సంస్థలోనే చేశాడు. అంతకు ముందే తనతో మంచి అనుబంధం ఉంది. ‘మున్నా’ చేసినపప్పటి నుంచీ ఇద్దరం ప్యాషనేట్‌గా మారిపోయాం. సినిమా అంటే ప్యాషన్‌ ఉండాలి. నేను అలాగే ఇంప్రూవ్‌ అయ్యాను. వంశీ కూడా మొదటి సినిమా నుంచి అదే కసితో  పనిచేస్తున్నాడు. ‘మున్నా’ మేం అనుకున్నంతగా విజయం సాధించకపోయినా, ‘బృందావనం’తో మా అంచనాలను అందుకున్నాడు. ఆ సినిమాలో కుటుంబ విలువలు చూపించిన విధానం, ఎన్టీఆర్‌ని తెరపై ఆవిష్కరించిన పద్ధతీ... రెండూ  ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత సినిమా సినిమాకి అతని ఆలోచనలు కొత్తగా మారిపోయాయి. అందులో నుంచి పుట్టిందే ‘ఊపిరి’. ఆ సినిమాలో ఓ ఆత్మ ఉంది. ‘మహర్షి’ కథ చెప్పినప్పుడు కూడా నేను అదే ఫీల్‌ అయ్యాను. సామాజిక బాధ్యత, కుటుంబ విలువలు అవన్నీ మాకు సింక్‌ అవుతాయి. మేమిద్దరం వ్యక్తిగతంగా కూడా కుటుంబ విలువల గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. ఎంత కమర్షియల్‌గా సినిమా తీసినా.. కుటుంబం, పిల్లలు అందరూ సినిమా చూడాలనేలా ఆలోచిస్తుంటాం. వ్యక్తిగతంగా మా ఇద్దరికి కుటుంబ విలువలు తెలుసు.  

Updated Date - 2021-10-31T05:30:00+05:30 IST