వెండితెర శివుడు

Twitter IconWatsapp IconFacebook Icon
వెండితెర శివుడు

ఓ ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లండి. శివరాత్రి వస్తోందంటే చాలు.. టీవీల ముందు కదలకుండా కూర్చునేవాళ్లు. ఎందుకంటే అందులో ప్రసారమయ్యే శివరాత్రి మహత్యం వంటి సినిమాలను చూస్తే కానీ జాగారం పూర్తయ్యింది అనిపించేది కాదు. శివుడి సినిమాలను చూస్తే.. దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నంత భక్తి కలిగేది. ఇప్పుడా పరిస్థితి లేకపోయినా శివయ్య సినిమాలను నేటికీ చూస్తున్నారు ప్రేక్షకులు. తెలుగు సినీ చరిత్రలో ఆ మహాశివుడి పాత్రను వేయడానికి ఎంతోమంది నటులు పోటీపడేవాళ్లు. వైవిధ్యమైన కథలతో దర్శకులు సైతం నీలకంఠున్ని తెరమీద చూపించాలనే జీవితలక్ష్యంతో సినిమాలను తీసేవాళ్లు. ఆ శివ మహత్యంతో వచ్చిన తెలుగు సినిమాలను ఈ శివరాత్రి సందర్భంగా మరోసారి తరచి చూద్దాం...


ప్రపంచ చలనచిత్ర చరిత్రలో అత్యధిక పౌరాణిక చిత్రాలను నిర్మించిన ఘనత ఖచ్చితంగా తెలుగు వారిదే. మన పురాణగాథ అయిన హరిశ్చంద్రుడి కథతో తొలి భారతీయ చిత్రం ‘రాజా హరిశ్చంద్ర’ (1913)ను దాదాసాహెబ్‌ ఫాల్కే నిర్మించారు. అంతెందుకు తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ (1932) కూడా పౌరాణిక కథతోనే రూపొందింది. ప్రజలు ఎరుగని ఇతివృత్తాలతో సినిమాలు తీయడం ఆ రోజుల్లో కష్టం. అందుకే జనంలో బాగా పాపులర్‌ అయిన పౌరాణిక నాటకాలను సినిమాలుగా తీసి జనంలోకి తీసికెళ్లారు. బైబిల్‌ కథల ఆధారంగా హాలీవుడ్‌ సినిమాలు తీసినట్లే.. రామాయణ, భారత, భాగవతాల్లోని కథలు, సంఘటనలతో ఊరూరా ప్రదర్శించే నాటకాలను దర్శక నిర్మాతలు సినిమాలుగా తీసేవారు. కాలగమనంలో పౌరాణిక చిత్రాలు నాటకాల ప్రభావం నుండి బయట పడి అస్థిత్వాన్ని ఏర్పరచుకున్నాయి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడి కథలతో పాటు పరమశివుడు ప్రధాన పాత్రధారిగా, సత్రధారిగా తెలుగులో కొన్ని పౌరాణిక సినిమాలు వచ్చాయి. ఇవన్నీ మనకు ప్రత్యేకమైనవి.

వెండితెర శివుడు

‘సతీ అనసూయ’తో.. 

సినిమాల్లో శివుడి పాత్ర తొలిసారిగా కనిపించింది ‘సతీ అనసూయ’ (1935)చిత్రంలో అని చెప్పాలి. తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళ... దాసరి కోటిరత్నం నిర్మాతగా మారి తీసిన చిత్రం ఇది. అరోరా ఫిల్మ్‌ కార్పొరేషన్‌తో ఆమె ఈ సినిమా తీశారు. అహిన్‌ చౌదరి దర్శకుడు. సినిమాలో టైటిల్‌ రోల్‌ ఆమే పోషించారు. ఈ చిత్రంలో శివుడి పాత్ర పోషించిన నటుడి వివరాలు లభ్యం కాలేదు. ‘సతీ అనసూయ’ చిత్రంతో తెలుగు సినీ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైందని చెప్పాలి. ఆ తర్వాత 1936లో పూర్తిగా బాలనటీనటులతో దర్శకుడు సి.పుల్లయ్య ‘సతీ అనసూయ’ చిత్రాన్ని తీశారు. తదనంతర కాలంలోనే హీరోయిన్‌ కావడమే కాకుండా నిర్మాతగా మారి, ఎన్టీఆర్‌ను చిత్రరంగానికి పరిచయం చేసిన కృష్ణవేణికి ఇదే తొలి సినిమా. ‘సతీ అనసూయ’ పేరుతోనే మరో రెండు చిత్రాలు వచ్చాయి. 1957లో విడుదలైన ‘సతీ అనసూయ’లో అంజలీదేవి అనసూయగా నటించారు. ఇందులో అమరనాథ్‌ ఈశ్వరుడిగా చేశారు. 1971లో మరోసారి వచ్చిన ‘సతీ అనసూయ’లో జమున టైటిల్‌ పాత్ర పోషించారు. ఇందులో ప్రభాకరరెడ్డి శివుడి పాత్రతో భక్తిని వెదజల్లారు.

వెండితెర శివుడు

ఆ చిత్రాల్లో శివుడే హీరో

పరమశివుడు కథానాయకుడిగా కొన్ని సినిమాలు వచ్చాయి. వాటిలో తొలి సినిమా ‘పార్వతీకల్యాణం’. ప్రతిభా సంస్థను నెలకొల్పి ఘంటసాల బలరామయ్య నిర్మించిన తొలి చిత్రం ఇది. ఉత్తరాదికి చెందిన ప్రభాత సంస్థ అన్నా, అది నిర్మించే చిత్రాలన్నా బలరామయ్యకు ఎంతో అభిమానం. తమ సంస్థకు కూడా అటువంటి పేరే ఉండాలని భావించి, ‘ప్రతిభ’ అనే పేరు పెట్టారు. సంస్థ లోగో కూడా ప్రభాత లోగోని పోలి ఉంటుంది. ‘సీతారామజననం’ చిత్రంతో అక్కినేని నాగేశ్వరరావును హీరోగా పరిచయం చేసింది బలరామయ్యే. చిత్రానికి ఆయనే దర్శకుడు. 1941లో వచ్చిన ‘పార్వతీకల్యాణం’లో బలరామయ్య అన్నయ్య రాధాకృష్ణయ్య శివుడిగా, తమ్ముడు శేషాచలం నారదుడిగా నటించారు. శాంతకుమారి పార్వతిగా నటించారు. మద్రాసులోని వేల్‌ పిక్చర్స్‌ స్టూడియోలో ఈ చిత్రనిర్మాణం జరిగింది. 1962లో ‘పార్వతీకల్యాణం’ పేరుతో మరో చిత్రం వచ్చింది. ఇందులో బాలయ్య శివుడిగా నటించారు. నిజమైన పామునే మెడలో వేసుకుని నటించారాయన. పార్వతిగా కృష్ణకుమారి ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. ఆమెకు పాములంటే భయం. పాముకి నోరు కుట్టేయడం వల్ల భయపడాల్సిన పని లేదని దర్శకుడు ఎంత చెప్పినా ఆమెకు ఆ భయం పోలేదు. మెత్తగా ఉండే పాముని పట్టుకోవడం తన వల్ల కాదనేశారు. చేసేదేమీ లేక ఆమె పాముని పట్టుకొనే సన్నివేశాలను బొమ్మ పాముతో, మిగిలిన సన్నివేశాలను నిజమైన పాముతో చిత్రీకరించారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రం తయారైంది.

 

ఎన్టీఆర్‌తో దక్షయజ్ఞం

పరమేశ్వరుని శక్తిసామర్ధ్యాలను, భార్య పట్ల ఆయనకున్న అభిమానాన్ని నిరూపించే చిత్రాలు ఒకే టైటిల్‌తో రెండుసార్లు వచ్చాయి. 1941లో తొలిసారిగా వచ్చిన ‘దక్షయజ్ఞం’ చిత్రంలో శివుడిగా సదాశివరావు, దాక్షాయణిగా కృష్ణవేణి నటించారు. ఆమె భర్త మీర్జాపురం రాజా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తీయడం విశేషం. 1962లో ‘దక్షయజ్ఞం’ పేరుతోనే మరో చిత్రం వచ్చింది. అప్పటికే అనేక పౌరాణిక పాత్రలు పోషించిన ఎన్టీఆర్‌ తొలిసారిగా శివుడి పాత్ర ధరించారు. దాక్షాయణిగా దేవిక, దక్షుడిగా ఎస్వీ రంగారావు పోటీపడి నటించారు. ఈ సినిమాలో ఘంటసాల పాటలు లేకపోవడం ఆ రోజుల్లో చర్చనీయాంశం అయింది. 1962 మే 10న ‘దక్షయజ్ఞం’ చిత్రం విడుదలైంది. సరిగ్గా 15 రోజుల తర్వాత ఎన్టీఆర్‌ పెద్ద కుమారుడు రామకృష్ణ ఆకస్మికంగా మరణించారు. ‘దక్షయజ్ఞం’లో లయకారుడైన శివుడి వేషం వేయడం వల్లే ఇలా జరిగిందని ఆ రోజుల్లో చాలామంది చెప్పుకున్నారు. దాంతో ఈ సంఘటన తర్వాత ఎన్టీఆర్‌ మళ్లీ శివుడి పాత్ర జోలికి వెళ్లలేదు. అయితే తన గురువు కెవి రెడ్డి రూపొందించిన ‘ఉమాచండీగౌరీ శంకరుల కథ’ చిత్రంలో మాత్రం కేవీ అభ్యర్థన మేరకు మరోసారి శివుడి పాత్ర పోషించారు ఎన్టీఆర్‌. ఒకప్పటి స్టార్‌ హీరో చదలవాడ నారాయణరావు శివుడి పాత్ర పోషించిన చిత్రం ‘గంగా గౌరీ సంవాదం’. నిజజీవితంలో అక్కాచెల్లెళ్లయిన జానకి, కృష్ణకుమారి ఇందులో సవతులుగా నటించారు. నారాయణరావు ఒళ్లంతా సెంటు పూసుకుని మెళ్లో పాము వేసుకుని నటించేవారు. కాంతారావు తొలిసారిగా నారదుడి పాత్ర పోషించింది ఈ చిత్రంలోనే. 1958 ఫిబ్రవరి 16న విడుదలైన ‘గంగాగౌరీ సంవాదం’ చిత్రానికి ఛాయగ్రాహకుడు వి.ఎస్‌.రెడ్డి దర్శకత్వం వహించారు. 

వెండితెర శివుడు

షూటింగ్‌లో భక్తి విశ్వాసం.. 

పౌరాణిక చిత్రాలు తీసేటప్పుడు, ఆయా పాత్రలు పోషించేటప్పుడు నియమనిష్టలు తప్పనిసరి. షూటింగే కదాని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. 1940లో వచ్చిన ‘భూకైలాస్‌’ చిత్రం విషయంలో ఇలాగే జరిగింది. సుందర్‌రావ్‌ నడకర్ణి దర్శకత్వంలో ఏవీఎం చెట్టియర్‌ ఈ చిత్రం నిర్మించారు. శివాలయం సెట్‌ వేసి అందులో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. సినిమా సెట్టే కదా, మనం పెట్టిన శివలింగమే కదా అని ఆ సెట్‌లో షూటింగ్‌ జరిగినన్ని రోజులు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు చెప్పులు వేసుకుని సెట్‌లో తిరగడం, సిగరెట్లు కాల్చడం వంటివి చేశారు. ఆ సెట్‌లో చిత్రీకరించిన సన్నివేశాలను ల్యాబ్‌కు వెళ్లిన తర్వాత చూస్తే సాంకేతిక సమస్య ఎదురై ఎందుకూ పనికిరాకుండా పోయాయి. శివుడు ఆగ్రహించాడని గ్రహించి, అపచారం జరిగిందని అందరూ చెంపలేసుకుని ఈసారి నియమ నిష్టలతో సన్నివేశాలు మళ్లీ చిత్రీకరించారు. అప్పుడు మంచి ఫలితం వచ్చింది. ఇక నాటి నుండి పౌరాణిక సినిమా అనగానే పవిత్ర వాతావరణంలో నిర్మాణం చేయడం మొదలైంది. 


విగ్గును లాగేసిన పాము

నారదుడి పాత్ర అనగానే గుర్తుకు వచ్చే నటుడు కాంతారావు. ఆ పాత్ర పోషించడంలో తనకు సాటి ఎవరూ లేరని ఆయన నిరూపించారు. శివుడి పాత్రను ఆయన మూడు చిత్రాల్లో పోషించారు. ఎన్టీఆర్‌, జూనియర్‌ శ్రీరంజని జంటగా నటింన ‘శ్రీ గౌరీ మహాత్మ్యం’ (1956) చిత్రంలో కాంతారావు తొలిసారిగా శివుడి పాత్ర పోషించారు. నిజమైన పాముని మెడలో వేసుకుని నటించడానికి ఆయన మొదట భయపడ్డారు. దర్శకుడు ధైర్యం చెప్పడంతో ఒప్పుకోక తప్పలేదు. మెడలో ఉన్న పాము కదలకుండా ఒక చోట ఉండదు కదా! ఒకరోజు అది పడగ విప్పి కాంతారావు విగ్గు లాగేసింది. దాంతో షూటింగ్‌ ఆగిపోయింది. ఆ తర్వాత కాంతారావుకు మళ్లీ విగ్గు పెట్టి మొదలుపెట్టారు. పాము తోక చంకలో ఇరికించుకుంటే ఇక అది అటు ఇటు కదలదని పాములవాడు కాంతారావుకు సలహా ఇచ్చాడు. అతని సలహా పాటించి, షూటింగ్‌ పూర్తి చేశారు కాంతారావు. ఆ తర్వాత ‘భక్త మార్కండేయ’ (1956), ‘శ్రీరామాంజనేయ యుద్ధం’ (1958) చిత్రాల్లో శివుడి పాత్రలు పోషించారు కాంతారావు. ‘శ్రీరామాంజనేయ యుద్ధం’ చిత్రానికి సంబంధించి కాంతారావుకు ఓ చేదు అనుభవం ఉంది. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే ఆయన కుమారుడు సుబ్రహ్మణ్యం సరైన వైద్య సాయం అందక చిన్న వయసులోనే కన్ను మశారు. కాంతారావు ఆర్టిస్టుగా ఎదుగుతున్న దశ. సినిమాల్లో నటిస్తున్నా ఆదాయం అంతంత మాత్రమే. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే సంసారాన్ని లాక్కొచ్చేవారు. తనయుడికి వైద్యం చేయించడానికి చేతిలో డబ్బు లేకపోవడంతో ‘శ్రీరామాంజనేయ యుద్ధం’ చిత్రంలో రాముడిగా నటిస్తున్న అమరనాథ్‌ను కలిసి సాయం చేయమని అడిగారు కాంతారావు. ఈ చిత్రంలో శివుడి వేషం ఉందనీ, అది అతిథి పాత్ర కనుక మూడు గంటల పని ఉంటుందనీ, రూ.300 ఇస్తారనీ అమరనాథ్‌ చెప్పడంతో సరేనని ఒప్పుకొని ఆ వేషం వేశారు కాంతారావు. తీరా షూటింగ్‌ ముగించుకుని ఇంటికి వెళ్లేసరికే ఆయన తనయుడు కన్నుమూశాడు.

వెండితెర శివుడు

యక్షగానంతో..

తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ విజయం సాధించిన ‘లవకుశ’ చిత్రం తర్వాత నిర్మాత శంకరరెడ్డి అక్కినేని కథానాయకుడిగా ‘రహస్యం’ చిత్రాన్ని నిర్మించారు. రూ.30 లక్షల వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కాంతారావు, ఎస్వీ రంగారావు, గుమ్మడి, హరనాథ్‌, రేలంగి, రాజనాల వంటి హేమాహేమీలు ఉన్నారు. ఈ సినిమాకు ఘంటసాల సంగీతం హైలైట్‌. ‘లవకుశ’ చిత్రాన్ని మించిన పాటలు ఇవ్వాలనే తపనతో ఘంటసాల బాగా కష్టపడ్డారు. ఆయన స్వరపరిచిన ‘గిరిజా కల్యాణం’ యక్షగానం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిత్ర దర్శకుడు వేదాంతం రాఘవయ్య కూచిపూడి నృత్యంలో నిష్ణాతుడు కావడంతో అద్భుతంగా ఈ యక్షగానాన్ని చిత్రీకరించారు. ‘అంబా పరాకు దేవీ పరాకు .. మమ్మేలు మా శారదాంబ పరాకు’ అంటూ ప్రారంభమయ్యే ఈ యక్షగానం 15 నిముషాల నిడివితో ఉంటుంది. సినిమాలో ఉన్నా తర్వాత వీడియో రూపంలోకి వచ్చేసరికి యక్షగానాన్ని బాగా కుదించి, ఒక్క నిమిషం మాత్రమే వచ్చేలా చేశారు. మల్లాది రామకృష్ణశాస్త్రి రాసిన ఈ యక్షగానాన్ని ఘంటసాల, సుశీల, మల్లిక్‌, ఏపీ కోమల, వైదేహి పాడారు. అక్కినేని నాగేశ్వరరావు కూడా ‘మూగమనసులు’లో శివుని వేషం వేశారు.

వెండితెర శివుడు

ఆ పాటకు 10 కోట్ల వ్యూస్‌..

తెలుగు సినీ ప్రయాణంలో శివయ్యకు తిరుగులేదు. ఆయన పాత్రను ప్రతితరం పోషిస్తూనే ఉంది. నాలుగు దశాబ్దాల తన నట జీవితంలో మూడుసార్లు శివుడి పాత్ర పోషించే అవకాశం చిరంజీవికి లభించింది. 1981లో వచ్చిన ‘పార్వతీ పరమేశ్వరులు’ చిత్రంలో తొలిసారిగా ఆయన శివుడి గెటప్‌లో కనిపించారు. హీరోయిన్‌ ప్రభతో కలిసి పాట పాడే సన్నివేశంలో ఆయనలా కనిపించారు. అలాగే కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న ‘ఆపద్బాంధవుడు’ చిత్రంలో కూడా ఒక నృత్య సన్నివేశంలో ఆయన శివుడిగా నటించారు. చిరంజీవి పూర్తి స్థాయిలో శివుడి పాత్ర పోషించిన చిత్రం ‘శ్రీమంజునాథ’. రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకేంద్రుని సినిమాల్లో పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇందులో శంకర్‌మహదేవన్‌ పాడిన ‘ఓం మహప్రాణదీపం శివమ్‌ శివమ్‌’ అనే పాటను తమిళనటుడు అర్జున్‌ పాత్రకు పెట్టారు. ఆ పాట ఇప్పటికీ యూట్యూబ్‌లో దూసుకెళుతోంది. ఈ ఒక్క పాటకే సుమారు పదికోట్ల వ్యూస్‌ రావడం ఒక అద్భుతమేనని చెప్పాలి. త్రిమూర్తుల్లో ఒకరైన భోళా శంకరుని మహత్యాలకు ఆది అంతం లేదు. శివుడి పాత్రతో ఎన్ని తెలుగు సినిమాలు వచ్చినా ఆ గరళకంఠుని రూపం ఎప్పుడూ కొత్తగా ఆసక్తిగా అద్భుతంగా కనిపిస్తూనే ఉంటుంది. శివతత్వం విశ్వమంత విశాలమైనది.. అదెప్పటికీ ‘తెర’ మరుగవ్వదు.

వెండితెర శివుడు

మా ఊళ్లో మహాశివుడు

సాంఘిక చిత్రాల్లో యముడు, చిత్రగుప్తుడు కనిపించడం సాధారణమే! అయితే మహాశివుడు భూలోకానికి వచ్చి తన భక్తుడిని పరీక్షించడం, దుష్టులకు బుద్ధి చెప్పడం వంటి ఆసక్తికరమైన ఇతివృత్తంతో 1979లో ‘మా ఊళ్లో మహాశివుడు’ చిత్రం వచ్చింది. విలన్‌ పాత్రలను పోషించడంలో తమకు సాటి లేరనిపించుకున్న రావు గోపాలరావు ఇందులో శివుడిగా, సత్యనారాయణ ఆయన భక్తుడిగా నటించారు. గీతా సినీ ఎంటర్‌ప్రైజెస్‌ బేనర్‌ పై దాసరి సత్యనారాయణమూర్తి, వేగి వీర్రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లు అరవింద్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌. రాజాచంద్ర దర్శకుడు. మురళీమోహన్‌, సుభాషిణి యువ నటులుగా నటించిన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు.


ఆ వేషానికి రూ.1500 

అందాల నటుడు శోభన్‌బాబు రెండు చిత్రాల్లో శివుడి పాత్రలు పోషించారు. ‘సోమవార వ్రత మహాత్మ్యం’ చిత్రంలో తొలిసారిగా శివుడిగా కనిపించారు. నటుడిగా తొలి అడుగులు వేస్తున్న తరుణం అది. అవకాశాలు అంతంత మాత్రంగా వస్తుండడంతో రోజులు గడవడం కష్టంగా ఉండేది. అటువంటి తరుణంలో ‘సోమవార వ్రత మహాత్మ్యం’లో గెస్ట్‌గా శివుడి పాత్రలో ఆయన నటించారు. ఆయనకు ఇచ్చిన పారితోషికం రూ.1500. ఆ తర్వాత ఎన్టీఆర్‌ నటించిన ‘పరమానందయ్య శిష్యుల కథ’ చిత్రంలో కూడా శివుడిగా గెస్ట్‌ వేషం వేశారు శోభన్‌బాబు.


విలన్లు సైతం..

విలన్‌ పాత్రలతో ప్రేక్షకుల్ని భయపెట్టిన నటులు కూడా శివుడి పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం విశేషం. విలనీతో కామెడీని కలగలిపి నటించే నాగభూషణం ‘నాగులచవితి’, ‘భూకైలాస్‌’ తదితర చిత్రాల్లో శివుడిగా నటించారు. కైకాల సత్యనారాయణ కూడా రెండు చిత్రాల్లో శివుడి పాత్ర పోషించారు. 1962లో విడుదలైన ‘స్వర్ణగౌరీ’, ‘భీష్మ’ చిత్రాల్లో ఆయన శివుడిగా నటించగా, మరో ప్రముఖ విలన్‌ రాజనాల ‘ఉషా పరిణయం’ చిత్రంలో ముక్కంటిగా నటించారు. మరో విలన్‌ త్యాగరాజు ‘బాలనాగమ్మ’లో శివుడిగా వేశారు కానీ ఆ సినిమా విడుదల కాలేదు.


శివయ్య అంటే నాటి బాలయ్యే!

అత్యధిక చిత్రాల్లో శివుని పాత్ర పోషించిన ఘనత పాతతరం నటుడు బాలయ్యదే! ‘పార్వతీ కల్యాణం’ చిత్రంతో ప్రారంభించి, దాదాపు పది చిత్రాల్లో ఆయన ఆ పాత్ర పోషించారు. నారదుడు పాత్ర అంటే కాంతారావు ఎలా గుర్తుకు వస్తారో శివుడి పాత్ర పేరు చెప్పగానే బాలయ్య స్పురణకు వస్తారు. ఇన్ని చిత్రాల్లో ఆ పాత్రను పోషించిన మరో నటుడు లేడు.


బాలకృష్ణ కూడా..

ఎన్టీఆర్‌ నట వారసుడు బాలకృష్ణ ‘సీతారామకల్యాణం’ చిత్రంలో ఒక పాటలో శివుడిగా కనిపించారు. ఇటీవలే వచ్చిన ‘అఖండ’ చిత్రంలో శివుడి పాత్ర కాకపోయినా శివుడు పేరుతో అద్భుతమైన పాత్ర పోషించారు. శివ భక్తుడైన అఘోరా పాత్రలో బాలకృష్ణ నటన ప్రేక్షకులను మెప్పించింది.


సదా ‘శివుడు’

పాత రోజుల్లో సదాశివరావు అనే నటుడు ఉండేవారు. సినిమాలో శివుడి వేషం ఉంటే ఆయన్నే పిలిచేవారు. ‘దక్షయజ్ఞం’ (1941)తో ప్రారంభించి, చాలా చిత్రాల్లో శివుడి పాత్ర పోషించడంతో సార్థకనామధేయుడు అనేవారు అందరూ. ఒక సినిమాలో ఇలా శివుడి పాత్ర పోషిస్తున్నప్పుడు ప్రమాదం జరిగి సదాశివరావు కన్నుమూయడం విషాదకరం.

శివానందలహరి..

1. ‘శ్రీశైలా మల్లయ్య దైవమే నీవయ్యా శ్రీ భ్రమరాంబతో వెలసిన జంగమయ్యా’- చిత్రం: కృష్ణవేణి, గానం : పి.సుశీల

2. ‘భవహరణా శుభ చరణా నాగాభరణా గౌరీరమణా’- చిత్రం: మల్లమ్మ కథ, గానం: పి.సుశీల

3. ‘జగదీశ్వర పాహి పరమేశ్వర.. దేవా పురసంహారా.. ధీరా నటశేఖరా’-చిత్రం: సువర్ణసుందరి, గానం: పి.సుశీల

4. ‘కానరార కైలాస నివాస బాలేందు ధరా జఠాధరా హర’- చిత్రం: సీతారామకల్యాణం, గానం: ఘంటసాల

5. ‘దేవదేవ ధవళాచల మందిర గంగా ధర హర నమో నమో దైవతలోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో’- చిత్రం: భూకైలాస్‌, గానం: ఘంటసాల

6. ‘శివ శివ శంకరా భక్తవశంకరా శంభో హరహర నమోనమో’- చిత్రం: భక్త కన్నప్ప, గానం: వి.రామకృష్ణ

7. ‘నమో భూతనాథ.. నమో దేవదేవ నమో భక్తపాల.. నమో దివ్యతేజా’- చిత్రం: సత్య హరిశ్చంద్ర, గానం: ఘంటసాల, ఎస్‌.వరలక్ష్మి

8. ‘జయమహాదేవ శంభో.. గిరిజారమణా శివపరాత్పరా’ - చిత్రం: ఉషా పరిణయం, గానం: మాధవపెద్ది, లీల, జమునా రాణి

9. ‘ఆదిభిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది’ - చిత్రం: సిరివెన్నెల, గానం: బాలు

10. ‘నీలకంధరా దేవా దీనబాంధవా రారా నన్ను గావరా సత్యసుందరా స్వామి నిత్యనిర్మలాపాహి’ చిత్రం: భూకైలాస్‌, గానం: ఘంటసాల 

(ఇవన్నీ శివుడి స్మరణతో వచ్చిన తెలుగు సినిమాల్లోని హిట్‌సాంగ్స్‌)

- వినాయకరావు

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

మీకు తెలుసా !..Latest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.