మాధురి మళ్లీ వచ్చింది!

Twitter IconWatsapp IconFacebook Icon
మాధురి మళ్లీ వచ్చింది!

మాధురి దీక్షిత్‌... ముప్పై రెండేళ్ల కిందట ‘ఏక్‌ దో తీన్‌’ అంటూ దేశాన్నంతా ఊపేసింది. మాధురి నృత్యం కోసమే సినిమాలకు వెళ్లిన వాళ్లూ ఉన్నారు. ఆ నృత్యాన్నే తన అడ్రస్‌గా మార్చుకుంది. 206 దేశాలలో నేడు ఆన్‌లైన్‌ డ్యాన్స్‌ క్లాసులను నిర్వహిస్తోంది. ఇప్పుడు తాజాగా వెబ్‌ సిరీస్‌లలోకీ ఎంటరవుతోంది. ఈ సందర్భంగా మాధురీ  దీక్షిత్‌ జీవితం గురించి మరోసారి తెలుసుకుందాం.. 


‘మాధురి దీక్షిత్‌ దగ్గర నృత్యం నేర్చుకోవాలనేది నా బకెట్‌ లిస్ట్‌’- రాధికా ఆప్టే.

‘యాడ్‌ లేదా ఫిల్మ్‌ ఏ మాధ్యమమైనా సరే మాధురి వెలిగిపోతుంది.’- సోహా అలీ ఖాన్‌

‘రూపలావణ్యాలు ఇలాగే ఉంటాయని మాధురిని చూసిన ప్రతిసారీ అన్పిస్తుంది’- విద్యాబాలన్‌

నేటి తరం హీరోయిన్లు మాధురి దీక్షిత్‌ గురించి గొప్పగా చెప్పిన ట్వీట్లు ఇవి. 


కొరియోగ్రాఫర్ల డిలైట్‌

ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారులు ఎంఎఫ్‌ హుస్సేన్‌ ‘భూమ్మీది అత్యంత అందాల రాశి’గా మాధురిని అభివర్ణించారు. కథక్‌ గురువు బిర్జు మహారాజ్‌ బాలీవుడ్‌లో ‘బెస్ట్‌ డాన్సర్‌’గా మాధురికి కితాబునిచ్చారు. ఇక సరోజ్‌ఖాన్‌ ‘కొరియోగ్రాఫర్ల డిలైట్‌’ అని మాధురిని పొగిడారు. ముంబయిలో ఓ సాధారణ మధ్యతరగతి మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన మాధురి మూడేళ్ల నుంచే కథక్‌ను నేర్చుకోవడం ప్రారంభించింది. స్కూల్లో ఎన్నో ప్రైజ్‌లూ కొట్టేసింది. నాటకాల్లో పేరు తెచ్చుకుంది. మోడలింగ్‌లూ చేసింది. నటనపై ఏర్పడిన మక్కువతో సినిమాల్లో ప్రయత్నించింది. తొలిసినిమా ‘అబోధ్‌’. కానీ పెద్దగా పేరు రాలేదు. అయినా నిరుత్సాహ పడలేదు. నాలుగేళ్లకు విజయం ఆమె తలుపు తట్టింది ‘తేజాబ్‌’ రూపంలో 1988లో. ఇక అప్పటి నుంచి బిజీ స్టార్‌గా మారిపోయింది. ఆమె వల్లే ‘దిల్‌’ బాగా ఆడి ఆమిర్‌ కెరీర్‌ను నిలబెట్టింది. ‘హమ్‌ ఆప్‌ కే హై కౌన్‌’ లో సల్మాన్‌ ఖాన్‌ కంటే మాధురే ఎక్కువ రెమ్యునరేషన్‌ తీసుకుంది. సగటు గృహిణిగా...

అలవోకగా అసాధారణంగా ఆమె చేసేనృత్యమే స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. శ్రీదేవి తరవాత హిందీ సినీ పరిశ్రమలో ప్రఖ్యాతిగాంచిన లేడీ స్టార్‌ మాధురే. కామెడీ, రొమాన్స్‌, యాక్షన్‌, థిల్లర్‌ ఏ జోనర్‌ అయినా అవలీలగా చేసేది. హావభావాలు ఒలికించడంలో దిట్ట. వయో అంతరాలు, భాషా బేధం లేకుండా అమెకు అభిమానులు ఏర్పడ్డారు. తన పని తాను చేసుకుపోయేది. మృదుస్వభావి అన్న మంచి పేరు తెచ్చుకుంది. ఇటు కుర్ర హీరోలతో అటు సీనియర్‌ నటులతో నటిస్తూ పదేళ్ల పాటు బాలీవుడ్‌ను ఏలింది. ‘దిల్‌ తో పాగల్‌ హై’ లాంటి బ్లాక్‌బస్టర్‌తో కెరీర్‌ మంచి ఊపులో ఉన్నప్పుడు 1999లో అమెరికాలో పనిచేస్తున్న వైద్యుడు శ్రీరామ్‌ను పెళ్లిచేసుకుంది. చేతిలో ఉన్న సినిమాలని త్వరత్వరగా పూర్తిచేసి అమెరికా వెళ్లిపోయింది అక్కడే ఉండిపోవాలని. ఇండియాలో తనకున్న క్రేజ్‌ను, పాపులారిటీ అన్నిటినీ మర్చిపోయి ఓ గృహిణిలా మారింది. ఆ రోజుల్ని గుర్తుచేసుకుంటూ ‘శ్రీరామ్‌కు సర్జరీలు ఉన్న సమయంలో అయిదున్నరకే లేచి అతడికి బ్రేక్‌ఫాస్ట్‌ చేసిచ్చేదాన్ని. తను ఆస్పత్రికి వెళ్లిపోగానే, కాసేపు నిద్రపోయేదాన్ని. సగటు గృహిణిగా ప్రతి క్షణం ఆస్వాదించాన’ని గర్వంగా చెబుతుంది.


ఆరేళ్ల తరవాత ఇండియా తిరిగి వచ్చింది కుటుంబంతో సహా. అప్పుడప్పుడు నచ్చిన సినిమాలు చేస్తోంది. డాన్స్‌ అకాడమీని స్థాపించింది. తనకు తెలిసిన కళను నలుగురికీ నేర్పిస్తూ ఆనందం పొందుతోంది. ‘టీవీ షోలలో నా పాటలకి ఎవరైనా నృత్యం చేస్తుంటే మనసు ఎంతగానో ఉప్పొంగుతుంది. కొందరికైనా ఇన్‌స్పైరింగ్‌గా నిలిచామనే తృప్తి కలుగుతుందని’ అంటుంది మాధురి. సొంత నిర్మాణ సంస్థనూ నెలక్పొంది. నేపథ్య గాయనిగా నిరూపించుకుంది. రియాలిటీ డాన్స్‌ షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది. సోషల్‌ మీడియాలో చురుకుగా ఉంటోంది. ఇద్దరు టీనేజీ కొడుకుల ఆలనా పాలనా చూస్తూ, భర్తకు చేదోడుగా ఇంటిని చక్కదిద్దుకుంటూనే మాధురి ప్రస్తుతం ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తోంది. యాభై మూడేళ్ల వయసులో కూడా నృత్యాన్ని ప్రాక్టీస్‌ చేయడం ఆపలేదు. పైగా తల్లితో కలసి సంగీతాన్ని రియాజ్‌ చేస్తోంది. ఏది చేసినా సంపూర్ణంగా మనసుతో చేయడం తనకు అలవాటు. అదే నేటికీ మాధురీ దీక్షిత్‌ను అపురూప లావణ్యరాశిగా నిలిపింది.


డ్యాన్స్‌ విత్‌ మాధురి

కరోనా కాలం మాధురికి బాగా కలిసొచ్చింది. 2013 లో స్థాపించిన ‘డాన్స్‌ విత్‌ మాధురి (డీడబ్ల్యుఎం)’ సంస్థ ఈ లాక్‌డౌన్‌ కారణంగా అయిదింతలు వృద్ధిని సాధించింది. 206 దేశాల నుంచి అభ్యర్థులు నృత్యం నేర్చుకోవడానికి ఎన్‌రోల్‌ అయ్యారు. చుట్టూ ఉన్న భయానక పరిస్థితుల నుంచి బయటపడడానికి, మానసికంగా ఆలోచనలను మరలించడానికి చాలామంది ఆన్‌లైన్‌ నృత్యాన్ని ఓ మార్గంగా ఎంచుకున్నారు. ‘డాన్సింగ్‌ క్వీన్‌’ మాధురి దగ్గరే స్వయంగా నేర్చుకున్నామనే సంతృప్తి మిగులుతుంది. మాధురితో పాటు 86 మంది ప్రసిద్ధ కొరియోగ్రాఫర్లు ఈ ప్లాట్‌ ఫామ్‌ ద్వారా నృత్య పాఠాలను అందిస్తున్నారు. టాటా స్కై, ఎయిర్‌ టెల్‌ డిజిటల్‌, డిష్‌ టీవీ తదితరాల ద్వారా మూడు లక్షల సబ్‌స్కైబర్స్‌ ఉన్నారు. యాప్‌, వెబ్‌సైట్‌ల ద్వారా కూడా డీడబ్ల్యుఎం తన పరిధిని మరింత పెంచుకుంది. సంగీతం, క్రికెట్‌, నటన, వంటలు తదితర రంగాలకూ దీనిని విస్తృతపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సంస్థకు శ్రీరామ్‌ కోఫౌండర్‌గా ఉంటూ భార్యకు సహాయసహకారాలు అందించడం విశేషం.మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌

శ్రీరామ్‌ నెనే, మాధురి దీక్షిత్‌ల జంటను చూడగానే అందరూ చెప్పే మాట మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌. వీళ్లది పెద్దలు కుదిర్చిన వివాహం. శ్రీరామ్‌ అమెరికాలో ప్రసిద్ధ హృద్రోగ వైద్యుడు. అమెరికాలోనే పెళ్లి జరిగింది. ఆ తరవాత ముంబయిలో రిసెప్షన్‌ ఇచ్చారు. అప్పటి వరకూ మాధురి సినిమాలను శ్రీరామ్‌ చూడనే లేదట. పెద్దల మాట ప్రకారం అమెరికాలో ఇద్దరూ కలుసుకున్నారు. ‘తొలిసారి రామ్‌ను చూడగానే అతడితో జీవితాంతం ఉండిపోవాలని అన్పించింద’ని మాధురి చెబుతుంది. ఈ జంటకు ఇద్దరు కొడుకులు ఆరిన్‌.. రేయాన్‌. ఇద్దరూ హైస్కూల్‌ చదువుల్లో ఉన్నారు. ‘ఆర్‌ఎన్‌ఎం’ పేరుతో మాధురి ఓ నిర్మాణ సంస్థనూ ఏర్పాటు చేసింది. ఆ పాటలూ... డ్యాన్సులూ...

మాధురి దీక్షిత్‌ అనగానే బాలీవుడ్‌ డాన్స్‌ పాటలెన్నో కళ్ల ముుందు మెదలుతాయి. ఒక్కో పాటకీ ఓ కథ రాయొచ్చు. వాటి గురించి మాధురిని అడిగినప్పుడు.. 


తేజాబ్‌లో ‘ఏక్‌ దో తీన్‌’ చిత్రిస్తున్నప్పుడు ‘భారతీయ నృత్యాన్ని చేస్తున్నావ్‌. మనకు అవసరమైంది బాలీవుడ్‌ డాన్స్‌’ అని సరోజ్‌ ఖాన్‌ చెప్పారు. నేను కాళ్ల కదలికలపైనే దృష్టిపెట్టి భావాలను పట్టించుకోవడం లేదని నాకప్పుడు అర్థం అయింది. 


‘దేవదాస్‌’ చిత్రంలో డోలా రే డోలా పాటకి ‘జువెల్‌ థీఫ్‌’ హోంటో పే ఎయిసీ బాత్‌ పాటే ప్రేరణ. దేవదాసులోని ‘మార్‌ డాలా’ పాటని సాయంత్రం ఆరున్నర నుంచి ఉదయం ఆరున్నర వరకూ చిత్రించారు. 


‘ఏక్‌ దో తీన్‌’, ‘ఛోలీ కే ఫీచే(ఖల్‌ నాయక్‌) పాటలని చిత్రించడానకి పన్నెండు రోజులు పట్టింది.


‘థానేదార్‌’ చిత్రంలో తమ్మా తమ్మా పాటకి నేనూ, సంజయ్‌దత్‌ నలభై టేకులు తీసుకున్నాం. 


‘పుకార్‌’లో ‘కే సెరా సెరా’ పాట ఇప్పటికీ చాలా కష్టమైందిగా భావిస్తాను. ప్రభుదేవా  కొరియోగ్రఫీ అనగానే భయం వేసింది. కానీ తన ప్రోద్బలంతో ఆ పాటను చేశా.

మాధురి మళ్లీ వచ్చింది!


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.