Babli Bouncer Review: పేరు గొప్ప, వూరు దిబ్బ

ABN , First Publish Date - 2022-09-26T21:17:39+05:30 IST

బాగా ప్రాచుర్యం వున్న దర్శకుడు మాధుర్ బండార్కర్ (Madhur Bandarkar) 'బబ్లీ బౌన్సర్' (Babli Bouncer) అనే సినిమాను తమన్నా ని కథానాయికగా పెట్టి ఓటిటి కోసం తీసాడు.

Babli Bouncer Review: పేరు గొప్ప, వూరు దిబ్బ

సినిమా: బబ్లీ బౌన్సర్ 

నటీనటులు: తమన్నా భాటియా (Tamannah Bhatia), అభిషేక్ బజాజ్, సాహిద్ వైద్, సౌరబ్ శుక్ల తదితరులు 

దర్శకుడు: మాధుర్ బండార్కర్ (Madhur Bandarkar)

నిర్మాత: వినీత్ జైన్, అమ్రిత్ పాండే 

డిస్నీ హాట్ స్టార్ లో విడుదల (Disney Hotstar)


-సురేష్ కవిరాయని 

దక్షిణాదిన ఒక వెలుగు వెలుగుతున్న తమన్నా (Tamannah) ఇప్పుడు హిందీ సినిమాలు (Hindi Movies) కూడా బాగానే చేస్తోంది. బాగా ప్రాచుర్యం వున్న దర్శకుడు మాధుర్ బండార్కర్ (Madhur Bandarkar) 'బబ్లీ బౌన్సర్' (Babli Bouncer) అనే సినిమాను తమన్నా ని కథానాయికగా పెట్టి ఓటిటి కోసం తీసాడు. బండార్కర్ అనగానే అందరికి ఆసక్తికరంగం ఉంటుంది, ఎందుకంటే అతను చాలా పద్ధతిగా మంచి సినిమాలు తీసాడు, జాతీయ అవార్డులు (National Awards) కూడా తన సినిమాల ద్వారా గెలుచుకున్నాడు. ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో విడుదల చేసారు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. 

కథ: బబ్లీ తన్వార్ (తమన్నా) ఒక గ్రామంలో పెరిగిన పెంకి అమ్మాయి. ఆమెకి తల్లి దండ్రులు పెళ్లి చెయ్యాలని సంబంధాలు చూస్తూ వుంటారు, కానీ బబ్లీ, స్కూల్ టీచర్ కొడుకు అయిన విరాజ్ (అభిషేక్ బజాజ్) (Abhishek Bajaj) ని ఇష్టపడుతుంది. అందుకని వచ్చిన సంబంధాలు అన్నీ చెడగొడుతుంది. దగ్గర్లో వున్న సిటీలో వుండే ఒక పబ్ లో నైట్ టైం డ్యూటీ చేసే బౌన్సర్లు అందరూ బబ్లీ గ్రామానికి చెందిన వారే అవటం విశేషం. విరాజ్ ని కలవటం కోసం బబ్లీ కూడా జాబ్ చేస్తాను అని చెప్పి కుక్కు (షాహిద్ వైడ్) (Shahid Vaid) సహాయం తో బౌన్సర్ గా పబ్ లో జాయిన్ అవుతుంది. కుక్కు, బబ్లీ ని ప్రేమిస్తూ ఉంటాడు, వివాహం కూడా చేసుకోవాలని అనుకుంటాడు. బౌన్సర్ గా జాయిన్ ఆయిన బబ్లీ విరాజ్ ని కలిసిందా, ఎవరిని వివాహం చేసుకుంది, సిటీ లో ఏమైంది అన్నది మిగతా కథ.


విశ్లేషణ: మాధుర్ బండార్కర్ దర్శకత్వం లో సినిమా అనగానే మనం చాలా వూహించుకుంటాం. కానీ మాధుర్ కూడా ఈ ఓ టి టి వలలో పది, ఎదో ఒకటి తీసేస్తే చాలు అనుకున్నాడు ఏమో, అందుకనే బబ్లీ బౌన్సర్ ని చుట్టేశాడు. మామూలుగా రెగ్యులర్ సినిమా లలో వుండే నాణ్యత ఈ బబ్లీ బౌన్సర్ లో లోపించింది. అది మొదటి కారణం ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడానికి. ఇంకా రెండో కారణం సినిమాలో భావోద్వేగాలు లేకపోవటం. ఒక్క సన్నివేశం కూడా ఆకట్టుకునేట్టు తీయలేకపోవటం. ఈ సినిమా మాధుర్ బండార్కర్ తీసాడా లేక అతని అసిస్టెంట్ ఎవరయినా తీసారా అన్నట్టుగా వుంది ఈ సినిమా. అన్నిటిలోనూ నాణ్యత కొరవడింది. మాధుర్ బండార్కర్ పేరు వాడుకున్నట్టు కనపడుతోంది. ఏమయినా ఈ సినిమా వల్ల దర్శకుడిగా మాధుర్ బండార్కర్ కి చాల చెడ్డ పేరు వస్తుంది. అందులో సందేహం లేదు. ఒక్క సహజమయిన సన్నివేశం కూడా కనిపించలేదు. ఓట్ట్ లో కాబట్టి సరిపోయింది, ఎందుకంటే రిమోట్ తో బోర్ కొట్టే సన్నివేశాలు వచ్చినప్పుడు ముందుకు జరిపేయవచ్చు. కథ ఏమవుతుందో  తెలిసిపోతూ ఉంటుంది, అలాగే సన్నివేశాలు అన్నీ సాగదీసాడు. కథలో పట్టు లేదు. మొత్తంగా సినిమా అంతా నీరసంగా వెళుతూ ఉంటుంది. చెప్పే విధానం కూడా ఆసక్తికరంగా లేదు. 

తమన్నా గ్రామంలో పెరిగిన అల్లరి యువతిగా బాగానే చేసింది కానీ, అది అంతా నటన అని తెలిసేటట్టు చేసింది. సహజత్వం కొరవడింది. ఓటిటి కాబట్టి, ఆమె కూడా ఈ రోల్ చెయ్యడానికి అంత సీరియస్ గా తీసుకోలేదేమో అనిపిస్తుంది. సౌరబ్ శుక్ల తమన్నా తండ్రిగా బాగా చేసాడు. ఇంకా మిగతా  వాళ్ళందరూ మామూలుగా నటించారు. చెప్పుకోదగ్గ పని తీరు ఎవరూ కనిపించలేదు. సాంకేతికంగా కూడా సినిమా ఏమి బాగోలేదు. 

ఓటిటి సినిమా అంటే  ఎందుకని అంత చిన్న చూపు. ఇంగ్లీష్ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి ఎంత బాగా తీస్తున్నారో చూడండి. అలాగే కొన్ని కొన్ని హిందీ సినిమాలు కూడా నాణ్యతగా వున్నాయి. ఉదాహరణకి ది తర్స్ డే (The Thursday) అన్న సినిమా బాగుంటుంది. నాణ్యతగా తీశారు. మరి మాధుర్ బండార్కర్ కి ఏమయిందో కానీ ఇంటరెస్ట్ లేనట్టుగా తీసాడు. గొప్ప దర్శకుడు, పెద్ద దర్శకుడు పేరు ఉంటే ఎవరూ చూడరు, హర్షించరు ఏ  సినిమా అయినా.  ఏ  ప్లాట్ ఫార్మ్ లో  విడుదల అయినా సినిమాని సినిమాలాగా తీయాలి. అప్పుడే ఆ దర్శకుడిని, నటీనటులను మెచ్చుకుంటారు. లేకపోతే పేరు గొప్ప, వూరు దిబ్బ అన్న సామెతే గుర్తుంటుంది.

Updated Date - 2022-09-26T21:17:39+05:30 IST