సినిమా రివ్యూ : ‘మాచర్ల నియోజకవర్గం’ (Macharla Niyojakavargam)

ABN , First Publish Date - 2022-08-12T20:11:25+05:30 IST

వరుస పరాజయాలతో రేసులో వెనుకబడ్డ నితిన్.. ఎలాగైనా తిరిగి ఫామ్‌లోకి రావాలనే పట్టుదలతో పక్కా కమర్షి్యల్ కథాంశమైన ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతో ఈ రోజే (శుక్రవారం) థియేటర్స్‌లోకి వచ్చాడు. విడుదలకు ముందు టీజర్, సింగిల్స్, ట్రైలర్‌తో భారీ అంచనాల్ని నెలకొల్పిన ఈ సినిమా.. ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది? ఈ చిత్రంతో నితిన్ హిట్టందుకుంటాడా అనే విషయాలు రివ్యూలో చూద్దాం.

సినిమా రివ్యూ : ‘మాచర్ల నియోజకవర్గం’ (Macharla Niyojakavargam)

చిత్రం : మాచర్ల నియోజకవర్గం

విడుదల తేదీ : ఆగస్ట్ 12, 2022

నటీనటులు : నితిన్, కృతి శెట్టి, సముద్రఖని, జయప్రకాశ్, మురళీశర్మ, ఇంద్రజ, శుభలేఖ సుధాకర్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, శ్యామల, కోటేశ్వరరావు, బ్రహ్మాజీ, షేకింగ్ శేషు తదితరులు

సంగీతం : మహతి స్వరసాగర్

సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ళ

నిర్మాణం : సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి

కథ- దర్శకత్వం : యం.యస్. రాజశేఖర్ రెడ్డి

వరుస పరాజయాలతో రేసులో వెనుకబడ్డ నితిన్.. ఎలాగైనా తిరిగి ఫామ్‌లోకి రావాలనే పట్టుదలతో పక్కా కమర్షి్యల్ కథాంశమైన ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతో ఈ రోజే (శుక్రవారం) థియేటర్స్‌లోకి వచ్చాడు. విడుదలకు ముందు టీజర్, సింగిల్స్, ట్రైలర్‌తో భారీ అంచనాల్ని నెలకొల్పిన ఈ సినిమా.. ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది? ఈ చిత్రంతో నితిన్ హిట్టందుకుంటాడా అనే విషయాలు రివ్యూలో చూద్దాం. (Macharla Niyojakavargam movie review) 


కథ

మాచర్లలో రాజప్ప (సముద్రఖని) గీసిందే గీత. చేసిందే చట్టం. ఆయనదే రాజ్యం. ముప్పైఏళ్లుగా మాచర్ల నియోజక వర్గంలో ఎన్నికలు అన్నవే జరగనివ్వకుండా ఏకగ్రీవంగా యం.ఎల్.ఏ అవుతుంటాడు. ఎన్నికలు జరపాలని వచ్చిన కలెక్టర్‌ను చంపేస్తాడు. ఆ తర్వాత గుంటూరు జిల్లాకి కలెక్టర్‌గా సిద్ధార్ధ్ రెడ్డి (నితిన్) వస్తాడు. పోస్టింగ్ రాకముందే ప్రేమించిన అమ్మాయి స్వాతిని వెతుక్కుంటూ మాచర్లలో అడుగుపెడతాడు. రాజప్ప కొడుకు (సముద్రఖని)ను కొడతాడు. జిల్లా కలెక్టర్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత సిద్ధార్ధ్ రెడ్డి ఏం చేస్తాడు? మాచర్లలో ఎన్నికలు జరగాలని అతడు చేసిన ప్రయత్నం ఫలిస్తుందా? దానికి రాజప్ప ఎలా అడ్డపడ్డాడు?  ఈకథలో హైదరాబాద్ లో సిద్ధూ పక్కింట్లో ఉండే గురు (వెన్నెల కిషోర్),  అతడ్ని పెళ్ళిచేసుకోవాలని ప్రయత్నించే మినిస్టర్ కుమార్తె నిధి (కేథరిన్ ట్రెస్సా) పాత్రలు ఏంటి?  (Macharla Niyojakavargam movie review) 


విశ్లేషణ :

హీరో జిల్లా కలెక్టర్ అవడం తప్పేమీ కాదు, కానీ జిల్లా కలెక్టర్‌కు కమర్షియల్ హీరోగా బిల్డప్పులు, ఎలివేషన్స్ ఇవ్వడం, ఆ పాత్రచేత పాటల్లో చిందులేయించడం, చిల్లరగా ఫైట్స్ చేయించడం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. రవితేజ ‘రామారావు ఆన్‌డ్యూటీ’ సినిమా కోసం కొత్త దర్శకుడు శరత్ మండవ ఇలాంటి ఫీట్స్ చేసి దెబ్బతిన్నాడు. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం చిత్రం కోసం కొత్త దర్శకుడు యం.యస్. రాజశేఖర్ రెడ్డి కూడా అతడి బాటలోనే పయనించి.. నితిన్ తోనూ అలాంటి చిందులే వేయించాడు. మాచర్లలో రౌడీలాంటి రాజప్ప.. అరాచకాలు చేస్తూ, అడ్డొచ్చినవారిని చంపుకుంటూ పోతుంటే... ఒక జిల్లా కలెక్టర్ అతడితో నువ్వా నేనా అంటూ తలపడి అతడి మనుషుల్ని తుక్కు రేగ్గొడుతూ ఉంటాడు.  హీరో కలెక్టర్ అవడం అనే ఒక్క పాయింట్ తప్ప.. ఇలాంటి మూస కథాంశాల్ని ఎన్నో సినిమాల్లో ఎందరో హీరోలు చేసేశారు. ఇందులో నితిన్ కొత్తగా చేయడానికి ఏముంది? అనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా.. హీరో హీరోయిన్‌తో ప్రేమలో పడడం, వెన్నెల కిషోర్ కామెడీ సీన్లతో కాలక్షేపం చేసి కథను నడిపించాడు దర్శకుడు. అందులో చాలా సీన్స్ బోర్ కొట్టిస్తాయి. ఇంట్రవెల్ సన్నివేశంలో కథ అసలు టర్న్ తీసుకుంటుంది. హీరోకు గుంటూరులో జిల్లా కలెక్టర్ గా పోస్టింగ్ వస్తుంది. 


సెకండాఫ్ నుంచి హీరోకి, విలన్‌కు వార్ బిగిన్. అది కూడా ఆసక్తికరంగా సాగిందా అంటే .. అదీ లేదు. రాజప్ప పాత్రకు మొదట్లో ఇచ్చిన వెయిట్, బిల్డప్ ఆ తర్వాత కంటిన్యూ అవలేదు. పైగా సముద్రఖని పాత్ర తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం అసలేమాత్రం అతకలేదు. అసలు ఆ రెండు పాత్రలూ మాట్లాడుకోవడమే చాలా తక్కువ.  అసలు  ఆ పాత్రకు డ్యూయల్ రోల్స్ ఎందుకో అసలు అర్ధం కాదు. ఎలక్షన్స్ జరగేలా చేస్తానని హీరో, ఎలా జరుగుతాయో నేనూ చూస్తానని విలన్. ఇదే సినిమాకి మెయిన్ కాన్ఫ్లిక్ట్. అలాంటి ఛాలెంజింగ్ టాస్క్ ఎంతో ఆసక్తికరంగా ఉండాలి. విలన్ ఎత్తుకు హీరో పై ఎత్తులు వేస్తూ ప్రేక్షకుల్ని కుర్చీలకు కట్టేసేలా సన్నివేశాలు సాగాలి. అలాంటివేమీ లేకుండా.. ప్రేక్షకుల బుర్రలకు అసలు పనిపెట్టకుండా.. ముందుగా జరగబోయేది ఈజీగా తెలిసిపోయేలా కథనం సాగుతుంది. సినిమా చూస్తున్నంత సేపూ పాత సినిమాల్లోని సన్నివేశాల్ని  కొత్తగా తీసినట్టు అనిపిస్తుంది కానీ.. కొత్తదనం మచ్చుకైనా కనిపించదు.  తన అన్నను చంపినవారిని జైలుకు పంపాలనే కసితో మాచర్ల నుంచి హైదరాబాద్ వచ్చి తన ప్రయత్నాలు సాగించే కథానాయిక. మళ్ళీ మాచర్ల వచ్చినప్పుడు అసలు దాని గురించి పట్టించుకున్నదే లేదు. అలాగే ఫస్టాఫ్ లో ఉన్న కొన్ని పాత్రలు .. సెకండాఫ్ లో కనిపించి.. అర్ధంతరంగా మాయమైపోతాయి. ఎడిటింగ్ లో ఆ సన్నివేశాలకు కోత విధించారనిపిస్తుంది. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి స్వతహాగా ఎడిటర్ అవడం వల్లనో ఏమో.. గతంలో తన ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు వచ్చిన పలు సినిమాల్లోని సన్నివేశాల ఆధారంగా కథ రాసుకొని.. సినిమా తీసినట్టు అనిపిస్తుంది. కొత్త దనం ఏ కోశైనా లేకుండా.. ప్రేక్షకులకు పాతతరం కథాకథనాల్ని అందించి.. రొటీన్ సినిమాతోనే దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు యం.యస్. రాజశేఖర్ రెడ్డి. మొత్తానికి మాచర్ల నియోజకవర్గం ... సాదా సీదా సినిమానే అనిపిస్తుంది. 


సిద్ధార్ధ్ రెడ్డిగా నితిన్ ఎంతో ఈజ్ తో తన బాణీలో తాను చేసుకంటూ పోయాడు. పాటలు, ఫైట్స్ లో తన మార్క్ చూపించాడు. అలాగే కృతి శెట్టి మరీ అంత గ్లామరస్ గా కాకుండా.. కాస్త పద్ధతిగానే కనిపించింది. స్వాతి పాత్రలో బాగానే ఒదిగిపోయింది. తండ్రీకొడుకులుగా సముద్రఖని విలనిజం పర్వాలేదనిపిస్తుంది. అందులో కొత్తదనమేమీ లేదు. అలాగే.. రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, పాత్రలు నవ్వించే ప్రయత్నం చేశాయి. గుంతలకిడి గురునాథం.. ఇగో కా బాప్ గా వెన్నెల కిషోర్ కామెడీ సినిమా స్టార్టింగ్‌లో పర్వాలేదనిపిస్తుంది. కానీ రాను రాను బోరింగ్ అనిపిస్తుంది. మహతి స్వరసాగర్ సంగీతం వీనుల విందుగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఛాయాగ్రహణం మెప్పిస్తుంది. యాక్షన్ సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు మాచర్ల నియోజకవర్గం బెటర్ ఆప్షన్.  (Macharla Niyojakavargam movie review) 

ట్యాగ్ లైన్ : రొటీన్ కా బాప్ 

Updated Date - 2022-08-12T20:11:25+05:30 IST