విష్ణు ‘మా’ అధ్యక్షుడు.. ఎన్నికల అధికారి ప్రకటన!

ఎంతో ఉత్కంఠగా సాగిన ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవిని మంచు విష్ణు కైవసం చేసుకున్నారు. 926మంది సభ్యులున్న ‘మా’లో 883 ఓటర్లు ఉన్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 603 ఓట్లు బ్యాలెట్‌ ద్వారా పోల్‌ కాగా, 52 పోస్టల్‌ బ్యాలెట్స్‌ వచ్చాయి. మొత్తం 655 ఓట్లు పోల్‌ అయ్యాయి. విష్ణు మంచు 381 ఓట్లు సాధించగా, ప్రకాశ్‌రాజ్‌ 274 ఓట్లను సొంతం చేసుకున్నారని ఎన్నికల అధికారి వి.కృష్ణ మోహన్‌ అధికారికంగా ప్రకటించారు. 106 ఓట్ల తేడాతో విష్ణు గెలుపొందారు. జనరల్‌ సెక్రటరీగా పోటీ చేసిన రఘుబాబు 340 ఓట్లు పొందగా, అదే పదవికి పోటీ చేసిన జీవితా రాజశేఖర్‌ 313 ఓట్లతో పరాజయం పాలయ్యారు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌ 375 ఓట్లతో గెలుపొందారు. 269 ఓట్లతో బాబుమోహన్‌ ఓటమిని చవిచూశారు.  విష్ణు ప్యానల్‌ నుంచి ట్రెజరర్‌గా శివబాలాజీ 359 ఓట్లతో గెలుపొందారు. వైస్‌ ప్రెసిడెంట్‌గగా మాదాల రవి విజయం సాధించారు. ఎన్నికల అధికారి విష్ణు ప్రెసిడెంట్‌ అని ప్రకటించగానే ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ప్రకాశ్‌రాజ్‌ను కౌగిలించుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ‘తెలుగు బిడ్డ గెలిచాడు’ అని ప్రకాశ్‌రాజ్‌ విష్ణుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రెండునెలలుగా పడిన కష్టానికి ప్రతిఫలంగా విష్ణు విజయం సాధించాడు. ‘మా’ మసకబారలేదు. మెరుగుపడింది అని తెలుస్తోంది. నేను వెళ్తూ ‘మా’కు మంచి వారసుడిని ఇస్తానని మాటిచ్చాను. మంచు విష్ణుని అధ్యక్షుడిగా ఇస్తున్నా’’ అని నరేశ్‌ వ్యాఖ్యానించారు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.