‘మా’ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం మాంచి వేడిగా ఉంది. రోజుకో ఆసక్తికర బయటకొస్తుంది. ఇప్పటికే మా అధ్యక్ష పదవికి ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హూమ బరిలో దిగారు. తాజాగా మరో సీనియర్ నటుడు రంగంలో దిగారు. సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు కూడా ‘మా’ బరిలో ఉన్నానని, స్వతంత్ర అభ్యర్ధిగా పోటీకి దిగుతున్నట్లు ఆదివారం ప్రకటించారు. దీనితో నాలుగు స్తంభాలాటగా ఉన్న పోరు ఐదు స్తంభాలాటగా మారింది. ఇప్పుడు ‘మా’ రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది.
అయితే ఎలక్షన్లు జరగడానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది. ఈలోపు ఏమైనా జరగొచ్చు. ఇప్పుడు బరిలో ఉన్నవారు చివరి వరకూ ఉండకపోవచ్చు. కాంప్రమైజ్‌లు జరగొచ్చు. ఇది విశ్లేకుల మాట. అయితే ఎంతమంది బరిలో ఉన్నా వార్ మాత్రం ప్రకాష్ రాజ్, విష్ణు, జీవితల మధ్యే ఉంటుంది. జీవిత అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ప్రకటించారు కానీ.. ప్యానల్‌కు సంబంధించి, తన వెనక ఎవరెవరు ఉంటారు అన్నది వెల్లడించలేదు. జీవిత ఇంకా ఆలోచనలో ఉన్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ఈక్వేషన్లు ఏమీ మారకుండా ఉండి, హేమ పోటీలో ఉంటే జీవిత ఓట్ బ్యాంక్ చీలిపోయే అవకాశం ఉంది.
గతంలో ఇలా ఉండేది...
పాతికేళ్ల క్రితం ‘మా’ అసోసియేషన్ ప్రారంభించినప్పుడు సినీ పెద్దలంతా ప్యానల్లో ఎవరున్నా లేకపోయినా అఽధ్యక్ష పదవి మాత్రం ఏకగ్రీవం అవ్వాలనే ఒప్పందం ఉండేది. దీనికి సంబంధించి ఎక్కడా లిఖితపూర్వకంగా లేదు కానీ పెద్ద మనుషుల మాట మీద నడిచిపోయేది. చాలాకాలం ఈ పద్దతి కొనసాగింది. మురళీమోహన్ నుంచి చాలామంది ఏకగ్రీవంగా ఎన్నికైనవారే! ఇలా జరగడానికి దర్శకరత్న దాసరి నారాయణరావు కారణం. ఆయన మాటే శాసనంగా నడిచేది. ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఏకగ్రీవం అనే మాట దాదాపు కనుమరుగు అయినట్లే కనిపిస్తోంది. గత రెండు టర్మ్‌లుగా ‘మా’ ఎన్నికలు, రాజకీయ ఎన్నికల్లా మారిపోయాయి. మాటల తూటాలు, వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు, ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం, అసోసియేషన్‌లో జరుగుతున్న లోసుగులను బయటపెట్టుకోవడంతో నాలుగేళ్లగా ‘మా’ పరువును రోడ్డున పడింది. ఒకప్పుడు ‘మా’కు ఉన్న గౌరవం ఇప్పుడు లేదు. మరి ఇప్పుడు ఎలక్షన్లు ఎలా ఉండబోతున్నాయో చూడాలి!