భలే మంచి చౌక బేరము..

ABN , First Publish Date - 2021-07-03T05:01:58+05:30 IST

900 మంది సభ్యులున్న ‘మా’ ఎన్నికలపై ఎందుకింత రాద్ధాంతం? వదిలేస్తే వారి పని వారు చేసుకుంటారు కదా.. అని సినీ పరిశ్రమకు చెందిన కొందరి అభిప్రాయం. కానీ ప్రజలకు వినోదాన్ని పంచే కళాకారులకు సంబంధించిన....

భలే మంచి చౌక బేరము..

ఎక్కువకు కొన్నారు.. తక్కువకు అమ్మారు

‘మా’ కార్యాలయం కొనుగోలు విచిత్రం

పదవీకాలం ఊసేలేని బైలాస్‌


(చిత్రజ్యోతి)

900 మంది సభ్యులున్న ‘మా’ ఎన్నికలపై ఎందుకింత రాద్ధాంతం? వదిలేస్తే వారి పని వారు చేసుకుంటారు కదా.. అని సినీ పరిశ్రమకు చెందిన కొందరి అభిప్రాయం. కానీ ప్రజలకు వినోదాన్ని పంచే కళాకారులకు సంబంధించిన అసోసియేషన్‌ కాబట్టి సామాన్య ప్రజలకు కూడా దీనిపై ఆసక్తి ఉంటుంది. తాజాగా ‘మా’ ఎన్నికల వల్ల ప్రారంభమయిన ప్రకంపనలు అందరిలోను ఆసక్తి కలిగిస్తున్నాయి. అసలు ‘మా’ అసోసియేషన్‌కు ఎలాంటి నియమనిబంధనలు ఉన్నాయి.. గతంలో ఏవైనా అక్రమాలు జరిగాయా? ఎవరైనా సభ్యులు కోర్టుకు వెళ్లారా? లాంటి అంశాలను చిత్రజ్యోతి పరిశీలించినప్పుడు అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 


ఎవరైనా ఒక ప్లాట్‌ను ఎక్కువ ధరకు కొని తక్కువ ధరకు అమ్ముతారా? సామాన్య ప్రజలైతే అమ్మరు. కానీ ‘మా’ మాత్రం తన కోసం ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేసి.. దానిని కొనుగోలు ధర కన్నా ఎక్కువ డబ్బులు పెట్టి రిన్నోవేట్‌ చేయించి.. ఆ తర్వాత దానిని తక్కువ ధరకు విక్రయించింది. ఈ సారి ‘మా’ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రధాన ఎజెండాలో ఒక కార్యాలయాన్ని నిర్మించుకోవటం కూడా ఉంది. అయితే పాత రికార్డులను పరిశీలిస్తే- ‘మా’ కోసం ఒక ప్లాట్‌ను కొన్నట్లు దానిని మళ్లీ విక్రయించినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం-  మెగా బ్రదర్‌ నాగబాబు ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జూబ్లీహిల్స్‌లో ఒక ప్లాట్‌ను రూ. 45 లక్షలకు కొనుగోలు చేసి- రూ. 50 లక్షలు ఖర్చు పెట్టి ఇంటీరియర్స్‌ చేయించారు. ఈ ప్లాట్‌ను కొనుగోలు చేయడాన్ని సీనియర్‌ నటుడు మురళీమోహన్‌ తీవ్రంగా వ్యతిరేకించారని.. అయితే ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో నిర్ణయం తీసుకొని దానిని కొనుగోలు చేశారని సమాచారం. ఆ ప్లాట్‌ పక్కనే మురికికాలువ ఉండటం వల్ల సభ్యులు ఎవరూ అక్కడికి రావటానికి ఇష్టపడకపోవడంతో- దానిని నెలకు పదివేల రూపాయలకు అద్దెకు ఇచ్చారు.


ఈ ప్లాట్‌ వల్ల వచ్చే అద్దె కన్నా- దానిపై పెట్టే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని భావించి నటుడు శివాజీ రాజా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దీనిని రూ. 34 లక్షలకు విక్రయించారు. అంతే కాకుండా ఈ ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌కు అయిన ఖర్చు కూడా ‘మా’నే భరించింది. ఈ మొత్తం ఖర్చుకు అప్పటి ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోదం తెలియజేసిందని సమాచారం. దీనిని కొనుగోలు చేసింది కూడా ‘మా’కు డైరీలు ముద్రించే వ్యక్తేనని.. అందుకే తక్కువకు విక్రయించి ఉండవచ్చని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘‘సాధారణంగా ఏదైనా ఒక అసోసియేన్‌లో ఒక స్థిరాస్థిని కొనుగోలు చేయాలన్నా.. విక్రయించాలన్నా- రెండు పద్ధతులు ఉంటాయి. ఆస్థి విలువ ఎక్కువగా లేనప్పుడు- ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోదంతో దానిని విక్రయించవచ్చు. ఎక్కువ ఉంటే జనరల్‌ బాడీ అనుమతి కూడా ఉండాలి. అయితే ‘మా’ బైలా్‌సలో వీటికి సంబంధించిన ఎటువంటి ప్రస్తావన లేదు. అందువల్ల ఎగ్జిక్యూటివ్‌ కమిటీ నిర్ణయం సరిపోతుంది. చట్టరీత్యా ఈ వ్యవహారంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఎక్కువ విలువ ఉన్న ఆస్థిని తక్కువ విలువకు విక్రయించటం చాలా అరుదు’’ అని పేరు చెప్పటానికి ఇష్టపడని ఒక న్యాయవాది అభిప్రాయపడ్డారు. 


రంగుల ప్రపంచం.. 

‘‘హీరోలు ఒక రంగుల ప్రపంచంలో ఉంటారు. ఎక్కువ మంది అదే నిజమని కూడా నమ్ముతూ ఉంటారు. సినిమాల్లో చూపించినట్లు ఒకరి మాట మీదే సమస్యలు పరిష్కారమయిపోతాయని భావిస్తారు’’ అంటారు ‘మా’ వ్యవహారాలను గత రెండు దశాబ్దాలుగా దగ్గర నుంచి చూస్తున్న ఒక న్యాయవాది. ‘మా’ బైలా్‌సను చూస్తే ఇది నిజమేననిపిస్తుంది. ఫ్లాట్‌ ఓనర్స్‌ అసోసియేషన్స్‌ కూడా పకడ్బందిగా బైలా్‌సను రూపొందించుకుంటున్న ఈ రోజుల్లో- ‘మా’ బైలాస్‌ కేవలం మూడు పేజీలే ఉండడం గమనార్హం. అంతే కాదు. ఈ బైలా్‌సను తయారుచేసింది ఒక ఆడిటర్‌ కావడంతో న్యాయపరమైన చిక్కులను వేటిని దృష్టిలో పెట్టుకోకుండా రూపొందించారు. దీనిలో ఏ విషయంపైనా ఒక స్పష్టత ఉండదు.


ఈ బైలా్‌సను పరిపుష్టం చేయాలని గతంలో చాలా మంది సభ్యులు సూచించారు. అయినా అప్పటి పదాదికారులు తగిన శ్రద్ధ చూపించలేదు.  ఉదాహరణకు ‘మా’ బైలా్‌సలో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ పదవీ కాలం నిర్దేశించలేదు. రెండేళ్లు పదవీకాలం అనేది కేవలం సంప్రదాయంగా మాత్రమే వస్తోంది.  ‘‘బైలా్‌సలో పదవీకాలం గురించి ప్రస్థావన లేదు. అందువల్ల అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ చట్టాల ప్రకారం ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆరేళ్లు పదవిలో కొనసాగవచ్చు. ‘మా’లో గతంలో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేవి. అందువల్ల మొదట్లో ఎటువంటి సమస్యలు రాలేదు. ఆ తర్వాత రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు జరపటం సంప్రదాయంగా వస్తోంది. ఎవరైనా దీనిని అతిక్రమిస్తే కోర్టులు కూడా ఏమి చేయలేవు’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ప్రముఖ న్యాయవాది తెలిపారు. ‘మా’లోని వ్యవహారాలపై ఇప్పటికే కొందరు సభ్యులు కోర్టుల్లో కేసులు వేశారు. ప్రస్తుతం ఇలాంటివి దాదాపు డజను వరకు పెండింగ్‌లో ఉన్నాయి.

Updated Date - 2021-07-03T05:01:58+05:30 IST