కాంతారావుకు కలసిరాని చిత్ర నిర్మాణం!

‘ఎన్టీఆర్‌, ఏయన్నార్‌.. తెలుగు సినీ కళామతల్లికి రెండు కళ్లయితే, ఆ రెంటి మధ్య ఉండే తిలకం .. కాంతారావు’ అని ఓ  సందర్భంలో దర్శకరత్న డాక్డర్‌ దాసరి నారాయణరావు ప్రశంసించారు. సాంఘికం, జానపదం, పౌరాణికం, చారిత్రాత్మకం... ఏ తరహా చిత్రమైనా, ఎటువంటి పాత్రయినా అది కాంతారావు పోషిస్తే దానికి ఓ ప్రత్యేకత ఉండేది. ఇక జానపద చిత్రాల కథానాయకుడిగా, ‘కత్తివీరుడు కాంతారావు’గా  ఆయనది చెరగని ముద్ర. అలాగే నారదుని పాత్ర పోషించడంలో తనకు సాటి మరెవరూ లేరని కాంతారావు నిరూపించుకొన్నారు. హీరోగా బాగా పాపులర్‌ అయినప్పటికీ 1960ల చివరికి వచ్చేటప్పటికి కాంతారావుకు మిగిలిన హీరోల నుంచి పోటీ ఎక్కువైంది. దాంతో సొంతంగా సినిమాలు తీసి, తనని తాను నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ సినిమాలే తన వృత్తిజీవితాన్ని అతలాకుతలం చేస్తాయని కాంతారావు ఊహించలేదు. తన భార్య పేరిట హేమా ఫిల్మ్స్‌ సంస్థను ఏర్పాటు చేసి 1969లో తొలిసారిగా ‘సప్తస్వరాలు’ చిత్రం నిర్మించారు. వేదాంతం రాఘవయ్య దర్శకుడు. తొలి సినిమా కనుక నిర్మాణపరంగా ఎక్కడా రాజీపడలేదు కాంతారావు. వేదాంతం రాఘవయ్య కూడా రాజీపడని వ్యక్తి కావడంతో బడ్జెట్‌ బాగా పెరిగింది. ఎలాగోలా పూర్తి చేసి సినిమాను విడుదల చేయాలనుకొనే సమయానికి కొత్త సమస్య ఎదురైంది. 


రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం మొదలైంది. దానికి మద్దతుగా మర్రి చెన్నారెడ్డి, వ్యతిరేకంగా కాసు బ్రహ్మానందరెడ్డి కత్తులు దూసుకుంటున్నారు. తెలంగాణ అంతటా అల్లర్లు. ఆ జిల్లాలు అట్టుడికి పోతున్నాయి. రాజకీయాలతో తనకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా కాంతారావు తనకు తెలియకుండానే అందులో ఇరుక్కుపోయారు. అదెలాగంటే తనకు సన్నిహితుడు, శ్రేయోభిలాషి అనుకొంటున్న నిర్మాత ఎస్‌. భావనారాయణ ‘సప్తస్వరాలు’ చిత్రానికి పోటీగా తను నిర్మించిన ‘లవ్‌ ఇన్‌ ఆంధ్రా’ (కృష్ణ హీరో) చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ వేశారు. ఒక సినిమాకు పోటీగా మరో సినిమా రావడం సర్వసాధారణమే. కానీ ఈ పోటీ రాజకీయ రంగు పులుముకుంది. తెలంగాణకు చెందిన కాంతారావు ‘సప్తస్వరాలు’ కావాలా లేక ‘లవ్‌ ఇన్‌ ఆంధ్రా’ సినిమా చూస్తారా అనే ప్రచారం మొదలైంది. తెలంగాణ ప్రాంతంలో ఆనాడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా రాత్రి ఆటలు రద్దు చేశారు. ఒకటీ రెండు రోజులు కాదు.. దాదాపు నెల రోజులు. దాని వల్ల చాలా నష్టపోయారు కాంతారావు. 


ఇక ఆంధ్రాలో వ్యతిరేక ప్రచారం వల్ల ‘సప్తస్వరాలు’ చిత్రం చూడటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇలా తనకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా రాజకీయాల వల్ల రెండు విధాలుగా కాంతారావు నష్టపోవాల్సి వచ్చింది. లాభం మాట అటుంచితే ‘సప్తస్వరాలు’ ఆయనకు రూ. ఆరు లక్షలు నష్టం మిగిల్చింది. ఆ తర్వాత నిర్మించిన ‘గండరగండడు’ చిత్రం మాత్రం కాంతారావుకు ఆర్థిక సంతృప్తి కలిగించింది. అయితే ఆ తర్వాత నిర్మించిన ‘ప్రేమజీవులు’, ‘గుండెలు తీసిన మొనగాడు’, ‘స్వాతిచినుకులు’ చిత్రాలు ప్లాప్‌ అయ్యాయి. సొంత సినిమాల కోసం చేసిన అప్పులు తీర్చడానికి కాంతారావు ఇల్లు అమ్మేసి వీధిన పడ్డారు.

-వినాయకరావు


TAGS: Kantha Rao
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.