కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanakaraj) సోషల్ మీడియాకి కొంతకాలం దూరం కాబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా తెలిపారు. లోకేష్ కనగరాజ్ ఇటీవల సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) ప్రధాన పాత్రలో సూర్య (Surya), విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహాద్ ఫాజిల్ (Fahad Fasil) ఇతర కీలక పాత్రల్లో విక్రమ్ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిదే. ఈ మూవీ భారీ సక్సెస్ సాధించింది. గత కొన్నేళ్ళుగా కమల్ మూవీ రిలీజ్ సమయంలో ఎన్నో వివాదాలు తలెత్తాయి.
ఈ సారి మాత్రం లోకేష్ ఆ వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా విక్రమ్ చిత్రాన్ని తీసి కమల్ కి భారీ హిట్ ఇచ్చారు. ఇక తెరపై కనిపించింది కొద్దిసేపే అయినా రోలెక్స్ పాత్రలో సూర్యను అద్భుతంగా చూపించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇదే ఊపులో లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టారు. తన నెక్స్ట్ మూవీ స్టార్ హీరో విజయ్‌తో చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్‌లో బిజీగా ఉన్నారు.
అయితే, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ఖాతాలకు కొంతకాలం లోకేష్ కనగరాజ్ దూరంగా ఉండబోతున్నట్టుగా వెల్లడించారు. మళ్ళీ తన నెక్ట్ మూవీతో త్వరలోనే తిరిగి వస్తాను అని ఆయన పెట్టిన పోస్ట్‌లో రాసుకొచ్చారు. దీనిపై ఆయన ఫ్యాన్స్ కొంత నిరాశ చెందుతున్నప్పటికీ, పూర్తిగా విజయ్ మూవీ మీద దృష్టి పెట్టేందుకే ఇలా చిన్న బ్రేక్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఇంతకముందు లోకేష్.. కార్తితో ఖైదీ, విజయ్‌తో మాస్టర్ చిత్రాలను రూపొందించి భారీ హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే.