అలనాటి వెండితెర పాలవెల్లి... పుష్పవల్లి!

పుష్పవల్లి అనగానే ఎవరన్నది వెంటనే బుర్రలో వెలగకపోవచ్చు. బాలీవుడ్ వెండితెర మీద ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖ తల్లి- పుష్పవల్లి అని చెబితే తెలుస్తుందేమో. అలనాటి ఆ అందాల పాలవెల్లి పుష్పవల్లి పుట్టినరోజు ఈ రోజు (జనవరి 3). 


“పెళ్లైన వాడు ప్రేమలో పడితే అది పెళ్లికి పరీక్షో... ప్రేమకు పరీక్షో! ఇది నిజం సావిత్రి, నా గతం నిజం, నా ప్రేమ నిజం,” అంటాడు జెమినీ గణేషన్, సావిత్రితో (మహానటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’ సినిమాలో)

“మనసులో నువ్వే ఉన్నావు అమ్మాడి. పెళ్లి నాకు కావాలనుకొని జరగలేదు, ప్రేమ నేను ఆపాలనుకున్నా కుదరలేదు. ఇంకో జన్మలో ఒకటౌతామని హామీ ఇస్తే నేను ఇప్పుడే సంతోషంగా చచ్చి... మళ్లీ పుడతా”నంటాడు జెమినీ. 'మనలాంటి ప్రేమ అందరికీ దొరకదు...' అని తెలుగులో చెబుతాడు రీల్ లో; రియల్ గా ఏ భాషలో ఏమిచెప్పాడో గానీ, సావిత్రిని 1952లో పెళ్లి చేసుకున్నాడు జెమిని. కానీ, అప్పటికే పుష్పవల్లితో రిలేషన్ లో ఉన్నాడు.


ఎవరీ పుష్పవల్లి? జెమినీకి ఎప్పుడో పెళ్లయ్యిందని తెలిసి కూడా అతనితో ఎలా సహజీవనం చేసింది? సావిత్రితో  పెళ్లయ్యాక జెమినితో పిల్లలు కూడా ఎలా కన్నది? ఎవరైనా పూనుకొని తీస్తే పుష్పవల్లి జీవితం కూడా ప్రేమ- తెగువ- త్యాగాల మయమే.

పుష్పవల్లిగా ప్రసిద్ధమైన కందాళ వెంకట పుష్పవల్లి తాయారు - తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న పెంటపాడు గ్రామంలో 1926, జనవరి 3వ తేదీన కందాళ తాతాచారి, రామకోటమ్మ దంపతులకు జన్మించింది. చదివింది ఐదవ తరగతి వరకే అయినా, చిన్న వయసు నుంచే అభినయం, నాట్యం, ఇంకా సినిమాల మీద ఇష్టం ఉండేది. తన పన్నెండవ యేట కుటుంబ సన్నిహితుడు అచ్యుతరామయ్య ప్రోద్బలంతో మొట్టమొదటి సారి ‘సంపూర్ణరామాయణం’ సినిమాలో సీత వేషం వేసిందామె. తరువాత ‘దశావతారములు’ సినిమాలో మోహిని, మాయ శశిరేఖ పాత్రలు వేసింది. ఆ తర్వాత  ఆమెకు అవకాశాలు పెరిగాయి. జెమిని సంస్థలో పర్మనెంటు ఆర్టిస్టుగా నెలకు 200 రూపాయల జీతంతో చేరి 18 ఏళ్ళపాటు ఆ సంస్థ నిర్మించిన తమిళ, తెలుగు, హిందీ సినిమాలలో విరివిగా నటించింది.


చెల్లెలు సూర్యప్రభ కూడా సినిమా నటిగా రాణించింది. ప్రముఖ దర్శకుడు వేదాంతం రాఘవయ్యను సూర్యప్రభ వివాహం చేసుకుంది.  జెమినీ గణేశన్ ను ప్రేమించడానికి ముందు పుష్పవల్లికి రంగాచారి అనే వ్యక్తితో వివాహం అయ్యింది. అతనితో విడిపోయాక, జెమినీతో సహజీవనం చేసి, జెమినీ సావిత్రిని పెళ్లి చేసుకున్నాక కూడా పిల్లల్ని కన్నది. పిల్లల ఆలనాపాలనా జెమినీ పట్టించుకోకపోయినా, ఐదుగురు సంతానం -   బాబ్జీ, భానురేఖ (బాలీవుడ్ నిన్నటి తరాల హీరోయిన్ రేఖ), రమ, రాధ, ధనలక్ష్మిలను తీర్చిదిద్దింది. ప్రేమకోసం సినిమా కెరీర్ ని, పిల్లల కోసం జీవితాన్ని ఫణంగా పెట్టిన ఆ అమృతవల్లి - పుష్పవల్లి 1992 మే 11న, తన  66 వ ఏట కన్నుమూసింది.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.