నన్ను ఒంటరిగా వదిలేయండి!
ABN , First Publish Date - 2021-10-09T07:08:43+05:30 IST
నాగచైతన్య నుంచి విడాకులు తీసుకోవడం, అనంతర పరిణామాలపై సామాజిక మాధ్యమాల్లో సమంత తొలిసారి స్పందించారు. పరస్పర అంగీకారంతో విడిపోయినప్పటికీ...
నాకు ఎవరితోనూ ఎఫైర్స్ లేవు!
నేను అబార్షన్ చేయించుకోలేదు!
పురుషుల్ని ఎందుకు ప్రశ్నించరు?
నాగచైతన్య నుంచి విడాకులు తీసుకోవడం, అనంతర పరిణామాలపై సామాజిక మాధ్యమాల్లో సమంత తొలిసారి స్పందించారు. పరస్పర అంగీకారంతో విడిపోయినప్పటికీ... ఎన్నో వదంతులు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా సమంతదే తప్పు అన్నట్టు కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వదంతులకు ఫుల్‌స్టాప్ పెట్టారు. ‘‘నా వ్యక్తిగత జీవితంలో సంక్షోభం తలెత్తినప్పుడు మీరు అందించిన నైతిక మద్దతుకు నా మనసు ఉప్పొంగింది. నాకు వ్యతిరేకంగా వ్యాప్తి చేస్తున్న తప్పుడు కథనాలను ఖండిస్తూ... నాకు అండగా నిలబడుతూ... మీరు చూపిస్తున్న సానుభూతికి కృతజ్ఞతలు. నాకు ఎఫైర్లు ఉన్నాయని, నేను పిల్లల్ని వద్దనుకున్నానని, అవకాశవాదినని, అబార్షన్స్ చేయించుకున్నానని చెబుతున్నారు. విడాకులు తీసుకోవడమనేది ఎంతో బాధతో కూడుకున్న వ్యవహారం. ఆ గాయం మానడానికి, దాన్నుంచి కోలుకోవడానికి నన్ను ఒంటరిగా వదిలేయండి. నాపై వ్యక్తిగతంగా దాడి చేయడం దారుణం. ఒక్క ప్రామిస్ చేస్తున్నా... నన్నెంత బాధపెట్టినా వారు అనుకున్న విధంగా చేయను’’ అని సమంత పేర్కొన్నారు. ఈ వివరణ ఇవ్వడానికి ముందు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రచయిత్రి ఫరిదా చెప్పిన మాటల్ని ఆమె పోస్ట్ చేశారు.
మహిళలు ఏం చేసినా ప్రశ్నలే!
‘‘మహిళలు చేసే పనులు ఎప్పుడూ నైతికంగా ప్రశ్నార్థకం అవుతున్నప్పుడు... పురుషుల్ని ఎందుకు ప్రశ్నించరు? అవే పనులు పురుషులు చేస్తే అస్సలు ప్రశ్నించరు. ప్రాథమికంగా ఎటువంటి విలువలు లేని ఈ సమాజాన్ని మనమే నిర్మించుకున్నాం’’ అని ఫరిదా .డి చెప్పిన మాటల్ని సమంత షేర్ చేశారు.