గాన ‘లత’ తెగిపోయింది

Twitter IconWatsapp IconFacebook Icon
గాన లత తెగిపోయింది

తొమ్మిది దశాబ్దాల జీవితం... 

ఏడున్నర దశాబ్దాల పాటు స్వరగాన యజ్ఞం

36 భాషల్లో.. వేల పాటలు

నైటింగేల్‌ ఆప్‌ ఇండియా.. క్వీన్‌ ఆఫ్‌ మెలోడీ బిరుదులు

దేశంలోని అత్యున్నత పురస్కారాలన్నీ ఆమె ఒడిలోనే!! 


ఇలా చెబుతూ పోతే గాన కోకిల లతా మంగేష్కర్‌ గురించి చాలానే ఉంది. ఆమె గొప్ప గాయని. కానీ ఆ గొప్పను ఆమె అస్సలు అంగీకరించరు. చాలా పర్ఫెక్షనిస్ట్‌.. ఈ విషయాన్ని మాత్రం వంద శాతం అంగీకరిస్తారు. ఎందుకంటే దేశంలోనే అద్భుతమైన సింగర్‌గా ఆమె గుర్తింపు పొందారంటే పని పట్ల ఆమెకున్న అంకితభావం, పర్‌ఫెక్షన్‌ కారణమని ఆమె చెబుతుండేవారు. ఒక పాట అనుకున్నట్లు రావాలంటే ఆమె ఎన్నిసార్లైనా సాధన చేస్తారట... చేసేవారట. 

అరవైఏళ్ల వయసులో కూడా కాజోల్‌, మాధురీ దీక్షిత్‌లతోపాటు ఈతరం నాయికల గొంతుకు సూట్‌ అయ్యేలా పాటలు పాడేవారంటేనే ఆమె ఎంత పర్ఫెక్షనిస్ట్‌ అనేది అర్థమవుతుంది. ఇప్పుడా గాన కోకిల మన మధ్యలేరు. గాన ‘లత’లను తెంచేసి సంగీత ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయారు. జనవరిలో కరోనా బారిన పడిన లతా మంగేష్కర్‌ కొద్దిరోజులకు కోలుకున్నారు. తాజాగా మరోసారి అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. మూడు రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు.  


గాన లత తెగిపోయింది


లతా మంగేష్కర్‌ జీవితంలో కొన్ని ఆసక్తికర అంశాలు:


తండ్రి దగ్గరే సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నా లతా ఐదేళ్ల వయసులోనే పాటలు పాడటం ప్రారంభించారు.

లతా స్కూల్‌కి వెళ్లలేదు. తన సోదరి ఆశా భోంస్లేను ఓసారి స్కూల్‌కి తీసుకెళ్లగా ఆమెను అనుమతించలేదు. అదే ఆమె పాఠశాలకు వెళ్లిన మొదటి, చివరి రోజు.
 
ఆ తర్వాత తండ్రి మరణంతో కుటుంబ బాధ్యత తనపై వేసుకున్న లతా నటిగా మారారు. నటిస్తూనే గాయనిగా పాటలూ పాడుతుండేవారు.

ఓ మరాఠీ సినిమాతో గాయనిగా మారారు లత. అయితే ఆ పాట సినిమాలో తీసేశారు. నిడివి సమస్యతో ఆ పాట ఎడిటింగ్‌లో పోయింది.

తర్వాత ముంబై చేరుకుని హిందూస్థానీ క్లాసికల్‌ మ్యూజిక్‌ నేర్చుకుని గాయనిగా స్ధిరపడ్డారు. అక్కడి నుంచి ఆమె 36 భాషల్లో వేల పాటలు పాడారు. విదేశీ భాషల్లోనూ ఆమె పాడారు.

గాన లత తెగిపోయింది


కెరీర్‌ బిగినింగ్‌లో యాక్టర్‌ దిలీప్‌ కుమార్‌ ఆమె పాడే విధానాన్ని విమర్శించడంతో ఉర్దూ టీచర్‌ను పెట్టుకుని మరీ హిందీ పాటలు పాడారు. దక్షిణాదిలో లతా పక్కన ఎంతోమంది సింగర్స్‌ పాడిన ‘వాహ్‌ శెభాష్‌’ అనిపించుకున్న ఏకైక సింగర్‌ ఎస్‌పి.బాలు. ఉచ్ఛారణ విషయంలో ఇద్దరూ నిబద్ధులే! వీరిద్దరి కాంబినేషన్‌లో దేశమంతా పాడుకునే పాటలొచ్చాయి.


లతా మంగేష్కర్‌ పక్కన రఫీ, కిశోర్‌, హేమంత్‌, తలత్‌, మన్నాడే వంటి ఉద్దండులు పాడారు. కానీ బాలు పక్కన పాడేప్పుడు మాత్రం ఆమె ఫుల్‌ ఎనర్జీ, జోష్‌తో పాడడం గమనించొచ్చని చాలామంది సంగీత దర్శకుడు చెబుతుండేవారు.

గతంలో బాలు తన గొంతుకు సర్జరీ చేయించుకుంటున్నప్పుడు.. అది గాత్రానికే ప్రమాదం అని తెలుసుకుని లతా చాలా కంగారు పడి ‘వద్దు నాన్నా..’ అంటూ వారించారని చాలా సందర్భాల్లో ఎస్‌.పి.బాలు చెప్పారు. అంటే బాలు గానంపై ఆమెకు ఎంత విశ్వాసమో తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఘంటసాల విగ్రహ ప్రతిష్ట సందర్భంగా బాలు ఆహ్వానం మేరకు లతా మంగేష్కర్‌ హైదరాబాద్‌ వచ్చారు.

గాన లత తెగిపోయింది


‘మైనే ప్యార్‌ కియా’ చిత్రంలో సల్మాన్‌కు బాలు, భాగ్యశ్రీకి లతా గొంతునిచ్చారు. రామ్‌లక్ష్మణ్‌ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ప్రతి పాట సూపర్‌హిట్‌ అయిన సంగతి తెలిసిందే! యువత ఈ పాటలకు ఫిదా అయిపోయారు. ఆయనతో పాడిన పాటల్లో నాకు ‘ఆజా షామ్‌ హోనే ఆయీ ఇష్టం’ అని లతా చెప్పారు. లతాతో కలిసి బాలు పాడిన ‘దీదీ తేరా దేవర్‌ దివానా’ పాట ప్రతి పెళ్లి మంటపాల్లో వినిపించేది.‘హమ్‌ ఆప్‌ కే హై కౌన్‌’ పాటల రికార్డింగ్‌ సమయంలో బాలు, లతాల అల్లరి బాగా ఉండేవట. హమ్‌ ఆప్‌ కే హై కౌన్‌ అని లతా  పాడగానే తర్వాతి లైన్‌ పాడకుండా ‘మై ఆప్‌ కా బేటా హూ’ అని ఎస్‌పీబీ అల్లరి చేేసవాడట. ఆమె పాడడం మానేసి  ‘చూడండి బాలు నన్ను డాడనివ్వడం లేదు’’ అని ముద్దుగా కోప్పడేవారట. ఆ చనువుతోనే ఆమె.. ఆ ముద్దుల కొడుకుని బాలాజీ అని పిలిచేవారట.

లతా గాయనిగానే కాకుండా సంగీత దర్శకురాలిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 1955 ‘రామ్‌రామ్‌ పహ్వానా’ చిత్రంతో సంగీత దర్శకురాలిగా పరిచయమయ్యారు. మొత్తం ఐదు చిత్రాలకు ఆమె సంగీతం అందించారు. అలాగే నిర్మాతగానూ వ్యవహరించారు. మరాఠీ, హిందీ భాషల్లో ఆమె నాలుగు చిత్రాలు నిర్మించారు.

దక్షిణాది నుంచి ఏసుదాస్‌తో లతా కొన్ని పాటలు పాడినా అవి అంతగా గుర్తింపు పొందలేదు. కానీ బాలుతో పాడిన పాటలు అలా కాదు. తెలుగులో ‘ఆఖరి పోరాటం’ కోసం లతా ‘తెల్లచీరకు తకథిమి’ పాట పాడినప్పుడు బాలునే లతాకు భాష నేర్పించారట.


పద్మా అవార్డులతోపాటు ఎన్నో పురస్కారాలను అందుకున్న ఆమెను 1990లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. అలాగే ఎం.ఎస్‌ సుబ్బలక్ష్మి తర్వాత భారతరత్న అందుకున్న రెండో గాయని లతా మంగేష్కరే! గాన లత తెగిపోయింది


1963 రిపబ్లిక్‌ డే వేడుకను ఢిల్లీలో నిర్వహిస్తున్న వేడుకల్లో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌, ప్రధానమంత్రి నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరాగాంధీ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. వేదికపైకి వచ్చిన ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్‌ ‘అల్లా తేరే నామ్‌’ భజన్‌ను నటుడు దిలీప్‌ కుమార్‌ కోరిక మేరకు పాడారు. అనంతరం ‘ఏ మేరే వతన్‌ కీ లోగోం’ గీతాన్ని ఆలపించారు. 1962లో భారత్‌– చైనా మధ్య జరిగిన యుద్ధంలో అశువులు బాసిన భారత జవాన్లకు నివాళి ఆ గీతం. ఆ సందర్భంగా జరిగిన ఒక సంఘటనను ఓ సందర్భంలో లత పంచుకున్నారు.

‘‘పాటలు పాడడం అయిపోగానే పెద్ద బరువు దిగిపోయినట్టనిపించింది. రెండు పాటలూ పూర్తయ్యాక వేదిక వెనక్కి చేరుకున్నాను. కాఫీ తాగుతూ రిలాక్స్‌ అవుతున్నాను. నా పాట సృష్టించిన ప్రభావం ఏమిటన్నది నాకు తెలీదు. హఠాత్తుగా దర్శక– నిర్మాత మెహబూబ్‌ఖాన్‌ నన్ను పిలిచారు. నా చెయ్యి పట్టుకొని పైకి లేపుతూ ‘‘పద! పండిట్‌జీ (నెహ్రూ) నిన్ను పిలుచుకురమ్మన్నారు’’ అన్నారు. ‘నన్ను నెహ్రూగారు ఎందుకు పిలుస్తున్నారా’ అనే ఆశ్చర్యం కలిగింది నాకు. వేదికపైకి వెళ్ళేసరికి నెహ్రూ, ఇందిరా, రాష్ట్రపతి రాధాకృష్ణన్‌తో సహా ప్రతి ఒక్కరూ గౌరవసూచకంగా నన్ను పలకరించారు. ‘‘ఈవిడే మా లత. ఈమె ప్రదర్శన ఎలా ఉంది?’’ అని మెహబూబ్‌ ఖాన్‌ అడిగారు. ‘‘అద్భుతం. ఆమె పాట నాకు కన్నీరు తెప్పించింది’’ అన్నారు నెహ్రూ. 


ఎంపీగా ఉన్న సమయంలో ఒక్క రూపాయి జీతం తీసుకోని ఎంపీగా ఆమెకు గుర్తింపు ఉంది. 


లతా మంగేష్కర్‌కు క్రికెట్‌ అంటే ఇష్టం. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె క్రికెట్‌ మ్యాచ్‌ల గురించి ట్వీట్లు చేస్తుండేవారు. 


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.