టాలీవుడ్‌లోని నలుగురు సీనియర్ హీరోస్ లో చిరంజీవి, బాలయ్య ఇద్దరూ 100 సినిమాలకు పైగానే చేశారు. ఇంకా నాగార్జున, వెంకటేశ్ మిగిలిపోయారు. వారిలో వెంకీ ఇంకా డబ్బైల్లోనే ఉన్నారు. నాగార్జున అన్ని భాషలతో కలుపుకొని ఇప్పటికి 99 సినిమాల్లో నటించారు. మరో సినిమా చేస్తే సెంచరీ పూర్తవుతుంది. ప్రస్తుతం నాగ్ 100వ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుంది? దానికి దర్శకుడు ఎవరు? అనే విషయంలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నాగ్ 100వ చిత్రానికి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై చిత్రం నిర్మాణం జరుపుకోనుందని సమాచారం.
తన వందో సినిమా కోసం నాగార్జున పలువురు దర్శకుల్ని సంప్రదించినప్పటికీ.. ఫైనల్ గా మోహన్ రాజా చెప్పిన కథ ఆయనకి బాగా నచ్చి.. అతడితోనే సినిమాను సెట్ చేయాలనుకుంటున్నారట. ఇందులో అఖిల్ కూడా నటిస్తున్నట్టు వినికిడి. కాకపోతే అతడు కేమియో రోల్ చేయబోతున్నాడట. ఆల్రెడీ నాగార్జునతో అఖిల్ చిన్నప్పుడు ‘సిసింద్రీ’ లోనూ, ‘మనం’ చిత్రంలోనూ కలిసి నటించాడు. అయితే ‘మనం’ లో ఒక సన్నివేశంలో మెరుపులా వచ్చి మాయమవుతాడు. తన తండ్రి 100వ చిత్రంలో తాను కూడా ఒక భాగం అవుతున్నందుకు అఖిల్ ఎంతో ఎగ్జైట్ అవుతున్నాడట.
ప్రస్తుతం నాగ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ అనే మూవీలో నటిస్తున్నారు. అఖిల్ సైతం ఏజెంట్ స్పై థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. దర్శకుడు మోహన్ రాజా మెగాస్టార్ చిరంజీవితో ‘గాడ్‌ఫాదర్’ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలన్నీ పూర్తయ్యాకా నాగ్, మోహన్ రాజా కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్టు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజానిజాలంటో తెలియాలంటే.. మరికొద్దిరోజులు ఆగాల్సిందే.