స్టార్ హీరో నచ్చచెప్పినా పాట పాడటానికి నిరాకరించిన లతా మంగేష్కర్
ABN , First Publish Date - 2022-02-06T23:55:46+05:30 IST
స్టార్ హీరో నచ్చచెప్పినా పాట పాడటానికి నిరాకరించిన లతా మంగేష్కర్

లతా మంగేష్కర్ చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ సింగర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆమె తండ్రి మరణించడంతో తప్పనిసరై పాటలు పాడేందుకు చిత్ర పరిశ్రమలోకి రావాల్సి వచ్చిందని గతంలో ఎన్నో సార్లు చెప్పారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. లతాజీ ఓ మరాఠీ చిత్రంతో తొలిసారి నేపథ్య గాయనిగా మారారు. సినిమా ఎడిటింగ్‌లో భాగంగా ఆ పాటను తీసేశారు. కానీ, ఆ తర్వాత ఆమె ప్రస్థానం ఊహించని రీతిలో మలుపు తిరిగింది.
'అజీబ్ దస్తాన్ హై యే', 'ప్యార్ కియా తో డర్నా క్యా', 'తేరే లియే' వంటి అనేక గీతాలకు తన గాత్రంతో లతా మంగేష్కర్ ప్రాణం పోశారు. సంగీత దర్శకులు ఆమె కాల్షీట్ల కోసం పోటీ పడేవారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే స్వభావం ఆమెది. అందువల్లే కట్టుబాట్లు, సాంప్రదాయాలకు ఎంతో విలువిచ్చేవారు. సినిమాల్లో ద్వందర్థాలతో కూడిన పాటలను పాడేందుకు నిరాకరించేవారు. ఆమె పాడనని చెప్పడంతో ఎన్నో పాటల లిరిక్స్‌ని సైతం మార్చారు. ‘సంగం’ సినిమా కోసం 1964లో ఆమె ఓ పాట పాడాల్సి వచ్చింది. లతాజీకి 'మై క్యా కరూ రామ్ ముఝే బుడ్డా మిల్ గాయా' పాట విషయంలో స్టార్ హీరో రాజ్‌కపూర్‌తో గంటన్నరకు పైగా వాగ్వాదం జరిగింది. ఈ పాట పాడటానికి ఆమె నిరాకరించారట. పాటలో సాహిత్యం బాగుందని ఎంత నచ్చజెప్పినా ఆమె మాత్రం వినలేదట. దీంతో ఈ పాటను వేరే వాళ్లతో పాడించారట. అనూహ్యంగా ఈ పాట సూపర్‌హిట్‌గా నిలిచింది. కొసమెరుపు ఏంటంటే.. ఈ పాటను వినడం, సినిమాను చూడటం చేయలేదని లతా మంగేష్కర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.