సినిమా రివ్యూ : ‘లక్ష్య’

చిత్రం : లక్ష్య

విడుదల తేదీ : డిసెంబర్ 10, 2021

నటీనటులు : నాగశౌర్య, కేతికా శర్మ, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, శత్రు, రవి ప్రకాశ్, భరత్ రెడ్డి, కిరీటి, వైవా హర్ష, ప్రజ్ఞ, జబర్దస్త్ రాము తదితరులు

ఛాయాగ్రహణం: రామ్ 

ఎడిటింగ్ : జునైద్ సిద్ధిఖి

సంగీతం: కాలభైరవ 

మాటలు : సృజనమణి

నిర్మాతలు : నారాయణ దాస్ నారంగ్, పున్కూర్ రామ్మోహనరావు, శరత్ మరార్

కథ- స్ర్కీన్‌ప్లే- దర్శకత్వం : ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి 

కబడ్డి, కిక్ బాక్సింగ్, బాక్సింగ్, క్రికెట్.. ఇలా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో టాలీవుడ్‌లో పలు విజయవంతమైన చిత్రాలొచ్చాయి. కానీ ఆర్చరీ నేపథ్యంలోని కథాంశాన్ని ఇంతవరకూ ఎవరూ టచ్ చేయలేదు. అయితే కొత్త దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఆర్చరీ అంటే ఏంటి? అందులోని రూల్స్ ఎలా ఉంటాయి? ఆ విద్యకి క్వాలిఫికేషన్ ఏంటి?  అనే ఆసక్తికరమైన విషయాల్ని ప్రేక్షకులకి తెలియజెప్పే ప్రయత్నమే ‘లక్ష్య’. ఈ సినిమా ఈరోజే (శుక్రవారం) థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ మూవీతో నాగశౌర్య ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించాడు? విజయ లక్ష్యాన్ని ఛేదించాడా? అనే విషయాలు రివ్యూలో చూద్దాం.

కథ 

వాసు (రవిప్రకాశ్) ఆర్చరీ క్రీడాకారుడు. వరల్డ్ ఛాంపియన్ కావాలన్నదే అతడి లక్ష్యం. పోటీలకు వెళుతుండగా.. కార్ యాక్సిడెంట్‌లో మరణిస్తాడు. వాసు తనయుడు పార్ధు (నాగశౌర్య)లో చిన్నతనం నుంచే ఆర్చరీలోని మెళకువలు ఒంటబడతాయి. అది తాతయ్య రఘురామయ్య (సచిన్ ఖేడేకర్ ) గుర్తిస్తాడు. అతడ్ని ఎలాగైనా వరల్డ్ ఛాంపియన్‌ను చేసి కొడుకు కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ఊరినుంచి సిటీకి మకాం మారుస్తాడు. ఆస్తులన్నిటినీ అమ్మి మనవణ్ణి సిటీలో పెద్ద కోచింగ్ అకాడమిలో చేర్పిస్తాడు. పార్థు కష్టపడి స్టేట్ ఛాంపియన్ అవుతాడు. ఆపై వరల్డ్ ఛాంపియన్ పోటీలకు రెడీ అవుతుండగా.. తాతయ్య రఘురామయ్య చనిపోతాడు. ఆ బాధతో ఆటలో గెలుపుకోసం డ్రగ్స్ అలవాటు చేసుకుంటాడు. దాంతో అకాడమి అతడ్ని సస్పెండ్ చేస్తుంది. అసలు పార్థు డ్రగ్స్ కు బానిసఅవడానికి కారణమేంటి? దానికి వెనుక ఎవరున్నారు?  ఆత్మహత్య చేసుకోవాలనున్నప్పుడు  అతడ్ని కాపాడిన సారథి (జగపతిబాబు)కి, అతడికి రిలేషన్ ఏంటి? అతడి జీవితంలోకి వచ్చిన రితిక (కేతికా శర్మ) పాత్ర ఏంటి? పార్థు చివరికి వరల్డ్ ఛాంపియన్ టైటిల్ ఎలా గెలుచుకున్నాడు? అన్నదే మిగతా కథ. 

విశ్లేషణ

స్పో్ర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథలకు.. చక్కటి డ్రామా, ఎమోషన్సే ప్రధానాంశాలు. వాటితోనే ‘లక్ష్య’ సినిమాని నడిపించాలని చూశాడు దర్శకుడు సంతోష్. అయితే అందులో పూర్తిగా కాకపోయినా కొంతవరకూ సక్సెస్ అయ్యాడు. చిన్నతనం నుంచి పార్థుని మంచి విలుకాడుగా ఎలివేట్ చేయడం, యువకుడైన తర్వాత అతడిలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం, ఆ లక్ష్యానికి అతడి బలహీనతని అడ్డంకిగా మార్చడం.. ఇంట్రవెల్ కి ఒక ఆసక్తికరమైన ట్వి్స్ట్ ఇవ్వడం వరకూ పెర్ఫెక్ట్ గానే కుదిరింది  కానీ.. ఇంకొంచెం ఎఫెర్ట్ పెట్టి ఉంటే.. మరింత బలమైన స్ర్కీన్ ప్లే అయుండేది. అలాగే కొన్ని సన్నివేశాల్ని ప్రేక్షకులు ముందుగానే ఊహిస్తారు. తాతయ్య, మనవడి మధ్య చక్కటి డ్రామా పండింది.


సెకండాఫ్ నుంచి కథనం పరుగులు తీస్తుంది. హీరో మత్తు మందుకు బానిసై మళ్ళీ పైకి లేచినప్పుడు వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. జగపతి బాబు అతడి కోచ్ గా మారి.. అతడ్ని మళ్ళీ ఆర్చరీ వైపుకు సాగేలా చేసే డ్రామా, ట్విస్ట్ మెప్పిస్తాయి. అలాగే.. హీరో, హీరోయిన్ ల మధ్య ప్రేమ సన్నివేశాలు కూడా మెప్పి్స్తాయి. అయితే క్లైమాక్స్ విషయంలో మరింతగా కసరత్తు చేసి ఉంటే బాగుండేది . వరల్డ్ ఛాంపియన్ పోటీల్లోని ఫైనల్స్ అనగానే ఆ సన్నివేశాలపై ప్రేక్షకుల్లో టెన్షన్, ఎమోషన్స్ బలంగా ఉండాలి. ఈ విషయంలో దర్శకుడు ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. ఇక ఈ సినిమాకి నిర్మాణ విలువలు బాగున్నాయి, సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. కాలభైరవ సంగీతం పర్వాలేదనిపిస్తుంది. పార్థుగా నాగశౌర్య పెర్ఫార్మెన్స్, మేకోవర్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమా కోసం జిమ్‌లో గంటల తరబడి కసరత్తులు చేసి.. ఎయిట్ ప్యాక్ బిల్డ్ చేసి ప్రేక్షకుల్ని మెప్పించాడు. అలాగే ఆర్చరీలో బాగా శిక్షణ తీసుకొని కష్టతరమైన పాత్రను పోషించడం అభినందించదగ్గ విషయం. హీరోయిన్ కేతికా శర్మ గ్లామర్ పరంగానూ, అభినయం పరంగానూ ఆకట్టుకుంటుంది. తాతయ్య గా సచిన్ ఖేడేకర్, పార్ధసారథిగా జగపతిబాబు నటన మెప్పిస్తాయి. ఇక ఇందులో వినోదానికి అంతగా చోటులేదు. అందుకే ఈ విషయంలో ప్రేక్షకులకు నిరాశ తప్పదు. మొత్తంగా చెప్పాలంటే.. ‘లక్ష్య’ సినిమా కథావస్తువు కొత్తదే అయినప్పటికీ.. కథాకథనాలు సాధారణంగానే అనిపిస్తాయి. స్పోర్ట్స్ మూవీస్‌పై ఆసక్తి ఉన్నవారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. 

ట్యాగ్‌లైన్ :  గురి కుదిరింది

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.