సినిమా రివ్యూ: ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha Review)

ABN , First Publish Date - 2022-08-11T21:42:52+05:30 IST

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఓ సినిమా అంగీకరించారు అంటే దానిపై భారీ అంచనాలు ఉంటాయి. ‘దంగల్‌’ లాంటి బలమైన కథతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న ఆయన ఆ తర్వాత ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ చిత్రం చేశారు. ఇప్పుడు ‘లాల్‌ సింగ్‌ చడ్డా’తో

సినిమా రివ్యూ: ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha Review)

సినిమా: ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha)

విడుదల తేది: 11–08–2022

రన్‌ టైమ్‌: 163 నిమిషాలు

నటీనటులు: ఆమిర్‌ఖాన్‌, కరీనాకపూర్‌ ఖాన్‌, నాగచైతన్య, మోనా సింగ్‌, జ్యోతి దేశ్‌ పాండే, షారుఖ్‌ఖాన్‌(అతిథి పాత్ర), మానవ్‌ విజ్‌ తదితరులు. 

స్ర్కీన్‌ప్లే: ఎరిక్‌ రోత్‌ – అతుల్‌ కులకర్ణి

కెమెరా: సత్యజిత్‌ పాండే

ఎడిటింగ్‌: హేమంతి సర్కార్‌

సంగీతం: ప్రీతమ్‌

నేపథ్య సంగీతం: తనూజ్‌ టీకు

నిర్మాతలు: ఆమిర్‌ఖాన్‌, కిరణ్‌ రావ్‌, అజిత్ అంధారే

సమర్పణ: చిరంజీవి (తెలుగు)

దర్శకత్వం: అద్వైత్‌ చందన్‌ 


బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఓ సినిమా అంగీకరించారు అంటే దానిపై భారీ అంచనాలు ఉంటాయి. ‘దంగల్‌’ లాంటి బలమైన కథతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న ఆయన ఆ తర్వాత ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ చిత్రం చేశారు. ఇప్పుడు ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha)తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 28 సంవత్సరాల క్రితం హాలీవుడ్‌లో వచ్చిన ‘ఫారెస్ట్‌ గంప్‌’ చిత్రానికి రీమేక్‌ ఇది. 2018లో ఆమిర్‌ ఈ సినిమా హక్కుల్ని  సొంతం చేసుకున్నారు. చిన్నపాటి మార్పులతో దర్శకుడు అద్వైత్‌ చందన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్కినేని నాగచైతన్య ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్‌లో చైతన్య అడుగుపెట్టడం ఓ విషయమైతే, తెలుగు వెర్షన్‌కి మెగాస్టార్‌ చిరంజీవి (Mega Star Chiranjeevi) సమర్పకుడిగా వ్యవహరించడం మరో విశేషం. నాలుగేళ్ల తర్వాత ఆమిర్‌ నుంచి వస్తున్న చిత్రం కావడం, తొలిసారి చిరంజీవి పేరు సమర్పకుడిగా కనిపించడం ఈ సినిమాపై ఆసక్తిని, అంచనాలను పెంచాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం. 


కథ:

లాల్‌సింగ్‌ చెడ్డా (ఆమిర్‌ఖాన్‌ Aamir Khan) పుట్టుకతోనే వైకల్యం, అమాయకత్వంతో కూడిన వ్యక్తి. చెప్పిన విషయాన్ని గ్రహించడానికి అతనికి కొంత సమయం పడుతుంది. తల్లి (మోనా సింగ్‌ Mona singh) మాత్రం తన బిడ్డ ‘ఎందులోనూ తక్కువ కాదు. అందరిలాంటి కుర్రాడే’ అని భావిస్తూ అదే ధైరాన్ని లాల్‌కు కలిగిస్తుంది. స్కూల్‌లో చేరిన లాల్‌కు రూప డిసౌజా(కరీనాకపూర్‌ Kareena Kapoor) మంచి స్నేహితురాలు అవుతుంది. పేద కుటుంబంలో పుట్టిన రూప.. లాల్‌ సమస్యను అర్థం చేసుకుని అతనికి అండగా ఉంటుంది. లాల్‌ జీవితంలో రూప పాత్ర ఏంటి? తల్లి కోరిక మేరకు ఆర్మీలో చేరిన లాల్‌ సింగ్‌ చడ్దా.. ఆర్మీలో పరిచయమైన బాలరాజు బోడిపాలెం (నాగ చైతన్య Naga Chaitanya) కోసం ఏం చేశాడు? కార్గిల్‌ యుద్ధంలో లాల్‌ రక్షించిన మహ్మద్‌ భాయ్‌ (మానవ్‌ విజ్‌) ఎవరు? లాల్‌ జీవిత లక్ష్యం ఏమిటి? అన్నది మిగతా కథ. (Laal Singh Chaddha Review) 


విశ్లేషణ: 

అమాయకుడు, వైకల్యంతో పుట్టిన ఓ కుర్రాడి కథ ఇది. పరిస్థితులను బట్టి అతని జీవితం ఎలా సాగింది అన్నది దర్శకుడు చెప్పారు. హాలీవుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’కు రీమేక్‌గా రూపొందింది. మాతృకలో పాశ్చత్య సంస్కృతి, యుద్ధ వాతావరణంగా కథ సాగితే.. ఇక్కడ సిక్కు సంస్కృతి, భారతదేశంలో జరిగిన పలు ఘటనలకు లింక్‌ చేస్తూ హంగుల్ని జతచేశారు. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ వరల్డ్‌ కప్‌ విజయం, అమృత్‌సర్‌లో బ్లూ స్టార్‌ ఆపరేషన్‌, ఇందిరా గాంధీ హత్య వంటివి బ్రాక్‌గౌండ్‌లో నడిపించారు. మన నేటివిటీ మినహాయిస్తే.. ‘ఫారెస్ట్‌ గంప్‌’ చిత్రం బాటలోనే ఈ సినిమా నడిచింది. చారిత్రాత్మక అంశాలను ప్రస్తావిస్తూ కథను కాస్త ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లారు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌  వరకూ బాగానే సాగిన కథ అక్కడి నుంచి కాస్త నెమ్మదించి, సాదాసీదాగా సాగింది. దేశభక్తి, తల్లి కొడుకుల మధ్య అనుబంధం, మరో పక్క చిన్ననాటి స్నేహితురాలు.. ఇలా ఎన్నో బంధాలు తెరపైన కనిపిస్తున్నా.. భావోద్వేగాలు అనేవి మిస్సయిన భావన కలుగుతుంది. అలాగే సినిమాలో చాలా సీన్లు లాజిక్‌ మిస్‌ అయ్యాయి. ఆర్మీలో సైనికుడిగా అడుగుపెట్టాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. ఓ అమాయకుడు, శత్రువుకి, మిత్రుడికి తేడా తెలియని, అందరినీ ఒకే కోణంలో చూసే తత్వం ఉన్న వ్యక్తిని ఆర్మీలోకి తీసుకోవచ్చా? లేదా? అన్న పాయింట్‌ను దర్శకుడు అంతగా పట్టించుకోలేదనిపిస్తుంది. ఎందుకంటే చిత్రంలో మహ్మద్‌ శత్రు దేశానికి చెందిన వ్యక్తి. అతను ఎవరో కూడా తెలియకుండా లాల్‌ అతన్ని రక్షించడం అన్నది కరక్టేనా? అనేది దర్శకుడికే తెలియాలి. ఇక ఆర్టిస్ట్‌ల నటన విషయానికొస్తే... ఆమిర్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాత్ర కోసం ఆయన ఎలాంటి కసరత్తులు అయినా చేయగలడు. ఈ చిత్రంలో ఆయన నటన పేరు పెట్టేలా లేదు కానీ.. కొత్త ఆమిర్‌ ఖాన్‌ అయితే తెరపై కనిపించలేదు. ‘త్రీ ఇడియట్స్‌, పీకే’ చిత్రాల తరహాలోనే కనిపించారు. తొలిసారి బాలీవుడ్‌‌లోకి అడుగు పెట్టిన అక్కినేని నాగ చైతన్య భిన్నమైన పాత్ర పోషించారు. లవర్‌బాయ్‌ ఇమేజ్‌ ఉన్న ఆయన.. బాలరాజు బోడిపాలెం పాత్రలో కొత్తగా కనిపించారు. చడ్డీ.. బనియన్‌ వ్యాపారం అంటూ నవ్వులు పూయించారు. రూప పాత్రలో కరీనా కపూర్‌ ఖాన్‌ జీవించారు. ఆమిర్‌ తల్లిగా నటించిన మోనా సింగ్‌ అద్భుతంగా చేశారు. ఆమెకు నిడివి కూడా ఎక్కువే! మహ్మద్‌ భాయ్‌ క్యారెక్టర్‌లో మానవ్‌ విజ్‌ అలరించారు. అతిథి పాత్రలో షారుఖ్‌ఖాన్‌ మెరిశారు. ఆ ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. కెమెరా పనితనం బాగుంది. సినిమా లొకేషన్స్‌ రిచ్‌గా ఉన్నాయి. ప్రీతమ్‌ పాటలు, తనూజ్‌ టీకు నేపథ్య సంగీతం ఓకే అనిపించాయి. సెకెండాఫ్‌లో హీరో పరిగెత్తే సన్నివేశం, క్లైమాక్స్‌ పది నిమిషాల సన్నివేశాన్ని కాస్త కుదించి ఉంటే సినిమా ఇంకా క్రిస్ప్‌గా ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. (Laal Singh Chaddha Review) 


రీమేక్‌ సినిమా అంటే మాతృకతో పోల్చి చూస్తారు. హాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘ఫారెస్ట్‌ గంప్’ చిత్రాన్ని రీమేక్‌ చేసే సాహసం చేశారు మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌. ఆయన ఎన్నో ఏళ్ల కల ఈ సినిమా అని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా భావించి కథను ఎంతో ప్రేమించి ఈ సినిమా తీశారనిపిస్తుంది. అయితే ఇందులో ఆమిర్‌ తాలుకు కొత్తదనం కనిపించలేదు. దర్శకుడు లాజిక్కులు పక్కనెట్టి సినిమా తీశారనిపిస్తుంది. లాజిక్కుల వైపు ప్రేక్షకుడి దృష్టి వెళ్లకుండా ఉండాలంటే తెరపై ఏదో ఒక మ్యాజిక్‌ చేయాలి. అలాంటి ప్రయత్నం కూడా లేకపోవడంతో.. ఆమిర్‌ అభిమానులకు ఈ చిత్రం నిరాశే అని చెప్పొచ్చు. (Laal Singh Chaddha Review)


ట్యాగ్‌లైన్‌: చడ్డా... అభిమానులకు నిరాశే!

Updated Date - 2022-08-11T21:42:52+05:30 IST