రజనీకాంత్‌లో ఇప్పటికీ అదే ఎనర్జీ: ఖుష్బూ

మాస్‌ డైరెక్టర్‌ చిరుత్తై శివ - సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘అన్నాత్త’. ఈ చిత్రంలో సీనియర్‌ నటి ఖుష్బూ ఓ కీలక పాత్రను పోషించారు. ఈ సందర్భంగా ఈ చిత్రం షూటింగ్‌ అనుభవాలతో పాటు రజనీకాంత్‌ ఎనర్జీ గురించి ఆమె వివరించారు. ‘‘రజనీకాంత్‌లో గత 1990 దశకంలో ‘అరుణాచలం’, ‘అన్నామలై’, ‘పడయప్పా’ వంటి చిత్రాల్లో నటించినపుడు ఉన్న అదే ఎనర్జీ, టెంపర్‌.. ‘అన్నాత్త’ చిత్రం షూటింగ్‌ సమయంలోనూ గమనించాను. అప్పటికీ ఇప్పటికీ రవ్వంత కూడా ఆయనలో వేగం తగ్గలేదు. రజనీతో కలిసి ‘ధర్మత్తిన్‌ తలైవన్‌’, ‘అన్నామలై’, ‘మణ్ణన్‌’ వంటి చిత్రాల్లో నటించాను. అప్పుడు షూటింగులకు కాస్త ఆలస్యంగా వస్తే ప్రతి ఒక్కరికీ రజనీ సారీ చెప్పేవారు. ఇప్పుడు కూడా అదే విధంగా నడుచుకుంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనలో ఎలాంటి మార్పు కనిపించకపోవడం నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. ఇకపోతే, ‘అన్నాత్త’ చిత్రంలో నా పాత్ర వివరాలను వెల్లడించలేను. నవంబరు 4వ తేదీ వరకు ఈ సస్పెన్స్‌ కొనసాగాలి’’ అని ఆమె పేర్కొన్నారు. 

కాగా, ‘అన్నాత్త’ చిత్రం దీపావళి పండుగను పురస్కరించుకుని వచ్చే నెల 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో కూడా ‘పెద్దన్న’గా విడుదల చేస్తున్నారు. డి.ఇమ్మాన్‌ సంగీతం సమకూర్చిన ‘అన్నాత్త’ మూవీని సన్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మాత కళానిధి మారన్‌ నిర్మించారు. ఇందులో కీర్తి సురేష్‌, మీనా, ఖుష్బూ, జగపతిబాబు తదితరులు నటించారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.