‘క్రాక్‌’ మూవీ రివ్యూ

ABN , First Publish Date - 2021-01-10T16:46:35+05:30 IST

రవితేజ, గోపీచంద్‌ కాంబినేషన్‌లో సినిమా అనగా.. మనకు వెంటనే గుర్తుకు వచ్చే పేర్లు 'డాన్‌శీను, బలుపు'. ఈ రెండు సినిమాలు మంచి విజయాలనే అందుకున్నాయి. అలాంటి కాంబినేషన్‌లో సినిమా అంటే అందరిలో ఆసక్తి ఉండటం ఖాయం....

‘క్రాక్‌’ మూవీ రివ్యూ

చిత్రం: క్రాక్‌

బ్యానర్స్‌: సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌

నటీనటులు:  రవితేజ, శ్రుతిహాసన్‌, సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్‌, రవిశంకర్‌, సప్తగిరి, వంశీ, సుధాకర్‌ కోమాకుల తదితరులు

దర్శకత్వం:  గోపీచంద్‌ మలినేని

నిర్మాత: బి.మధు

సంగీతం: తమన్‌.ఎస్‌.ఎస్‌

సినిమాటోగ్రఫీ:  జీకే విష్ణు

ఎడిటర్‌: నవీన్‌ నూలి


రవితేజ, గోపీచంద్‌ కాంబినేషన్‌లో సినిమా అనగా.. మనకు వెంటనే గుర్తుకు వచ్చే పేర్లు 'డాన్‌శీను, బలుపు'. ఈ రెండు సినిమాలు మంచి విజయాలనే అందుకున్నాయి. అలాంటి కాంబినేషన్‌లో సినిమా అంటే అందరిలో ఆసక్తి ఉండటం ఖాయం. వీరి కలయికలో సినిమా రూపొందడం ఒకటైతే. మరో విషయం... కోవిడ్‌.. థియేట్స్‌ అన్‌లాక్‌ నేపథ్యంలో విడుదలైన తొలి స్టార్‌ హీరో సినిమా క్రాక్‌. తొలి రెండు చిత్రాలకు భిన్నంగా రవితేజను పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా తెరపై ప్రెజంట్‌ చేశాడు డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని. మరి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? దాదాపు ఆరేడు నెలల తర్వాత వచ్చిన ఈ స్టార్‌ మూవీ ఈ సంక్రాంతిక మంచి స్టార్టప్‌ అని అనుకోవచ్చా?  టీజర్‌, ట్రైలర్‌ సినిమా బావుంటుందనే అంచనాలను క్రియేట్‌ చేశాయి. మరి అంచనాలను సినిమా అందుకుందా? అటు రవితేజ, ఇటు గోపీచంద్‌ మలినేనికి సరైన హిట్‌ లేదు. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన క్రాక్‌ మూవీ హిట్‌ అయినట్లేనా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


కథ:


సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ సీఐ పోతరాజు వీర శంకర్‌(రవితేజ)ను పోలీస్‌ డిపార్టెమెంట్‌లో అందరూ క్రాక్‌ అనే పిలుస్తారు. అందుకు కారణంగా సిన్సియర్‌గా డ్యూటీ చేయడం. తన పనికి అడ్డువచ్చిన వాడి తాట తీయడం. అలాంటి వీరశంకర్‌కి ఉన్న మరో సమస్య.. ఎవరైనా బ్యాగ్రౌండ్‌ గురించి మాట్లాడితే కోపం రావడం. ఎవడైనా బ్యాగ్రౌండ్‌ తెలుసా? చిందులేస్తే వాడి అంతు చూడందే శంకర్‌కి నిద్రపట్టదు. అందుకనే అతనికి ట్రాన్స్‌ఫర్స్‌ మీద ట్రాన్స్‌ఫర్స్‌ వస్తుంటాయి. అలా శంకర్‌ కడపకు ట్రాన్స్‌ఫర్‌ అవుతాడు. అదే సమయంలో అక్కడ ఉండే కొండారెడ్డి(రవిశంకర్‌) చిన్న తప్పు చేస్తాడు. ఆ కేసుని వీర శంకర్‌ డీల్‌ చేస్తాడని తెలుసుకున్న జిల్లా ఎస్‌.పి.. కొండారెడ్డికి ఫోన్‌ చేసి జాగ్రత్తగా ఉండమని చెబుతాడు. కానీ ఎస్‌.పి. మాటలను విని నేను చాలా మంది పోలీస్‌ ఆఫీసర్స్‌ను చూశానని కొండారెడ్డి అంటాడు. శంకర్‌ గురించి తెలుసుకోవాలంటే రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు వెళ్లి కటారికృష్ణ(సముద్రఖని)ని కలవమని చెబుతాడు ఎస్‌.పి. సరేనని! కొండారెడ్డి కటారికృష్ణను కలుస్తాడు. ఒంగోలు ఒకప్పుడు పేరు మోసిన రౌడీ అయిన కటారి కృష్ణ.. రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు ఎందుకు వచ్చాడు?  అతనికి, శంకర్‌కి ఉన్న గొడవేంటి? చివరకు కటారికి కృష్ణ గురించి విన్న కొండారెడ్డి ఏం చేస్తాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. 


సమీక్ష:


రవితేజ వయసెంత? లేటెస్ట్ గా కిరాక్‌ సినిమాలో ఆయన్ని చూసిన వారందరికీ వచ్చిన డౌట్‌ ఇది. స్క్రీన్‌ మీద ఫ్రెష్‌ లుక్‌తో పర్ఫెక్ట్ కాప్‌గా కనిపించారు రవితేజ. పోలీస్‌ రోల్స్ కి పర్ఫెక్ట్ హీరో అనే పేరుంది రవితేజకి. ఇప్పుడు ఆ విషయం ఈ మూవీతో మరోసారి ప్రూవ్‌ అయింది. కొన్ని కాంబినేషన్స్ కి ఎప్పుడూ క్రేజ్‌ ఉంటుంది. రవితేజ, శ్రుతిహాసన్‌ కాంబోలో మేజిక్‌ స్క్రీన్‌ మీద రిఫ్లెక్ట్ అయింది. శ్రుతి హాసన్‌ ఇల్లాలి పాత్రలో ఉన్నప్పుడు చీరకట్టులో, తైక్వాండో ప్రాక్టీస్‌ చేస్తున్న షాట్స్ లో పక్కా ప్రొఫెషనల్‌గా, పోలీస్‌ డ్రస్సులో శివంగిలాగానే అనిపించారు. వారిద్దరి కొడుకు కేరక్టర్‌లో నటించిన గోపీచంద్‌ మలినేని కొడుకుకి బాలనటుడిగా మంచి ఫ్యూచర్‌ ఉంది. టైమింగ్‌తో పాటు పిల్లాడి ఫేస్‌లో క్యూట్‌నెస్‌, క్లారిటీ కనిపిస్తోంది. 50 రూపాయలు, ఒక మామిడికాయ, మేకు అనే కాన్సెప్ట్ ని ట్రైలర్‌లోనే చిత్ర యూనిట్‌ రివీల్‌ చేసింది. ఆ మూడు వస్తువుల చుట్టూ అల్లుకున్న కథ బావుంది. ప్రతి సీన్‌లోనూ హీరోని డైరక్టర్‌ ఎలివేట్‌ చేసిన తీరు కూడా అభిమానుల చేత విజిల్స్ వేయిస్తుంది. తమన్‌ ఇచ్చిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, ట్యూన్స్ బావున్నాయి. పాటలను  పిక్చరైజ్‌ చేసిన తీరు, పాటలకు కంపోజ్‌ చేసిన స్టెప్స్ మెప్పిస్తాయి.


భూమ్‌ బద్దలు పాటలో అప్సర రాణి లుక్స్ ఫ్రెష్‌గా ఉన్నాయి. అప్పుడెప్పుడో ముమైత్‌ఖాన్‌ తర్వాత స్పెషల్‌ సాంగ్స్ కి కేరాఫ్‌లా ఉన్నారు. ఆమె తర్వాత ఒకరకంగా ఆ ప్లేస్‌ ఖాళీగానే ఉంది. ఇప్పుడు అప్సర రాణి ట్రై చేస్తే అంతటి పేరును మళ్లీ అందుకోవచ్చు. రామ్‌ లక్ష్మణ్‌ మాస్టర్లు కంపోజ్‌ చేసిన ఫైట్లు ఒళ్లు గగుర్పొడిపిస్తాయి. అసలు స్టంట్స్ మీద పెద్దగా ఆసక్తి లేనివాళ్లు కూడా కళ్లప్పగించి ఆ స్టంట్స్ ని చూసేలా కంపోజ్‌ చేశారు రామ్‌లక్ష్మణ్‌. వరలక్ష్మి కాసేపే కనిపించినా ఆమె మార్కు యాక్టింగ్‌కి స్కోప్‌ ఉన్న పాత్రలో చేశారు. సౌత్‌కి పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ గా సముద్రఖని అప్పియరెన్స్ ఉంది. సంక్రాంతికి కావాల్సిన పక్కా కమర్షియల్‌ వేల్యూస్‌ ఉన్నాయి ఈ మూవీలో. సేతుపతికి రీమేక్‌ అని మొదట్లో వార్తలు వినిపించినా, దానికీ దీనికీ ఎక్కడో ఒక చోట తప్పితే పెద్దగా పొంతనలు లేవు. వరలక్ష్మిని సముద్రఖని చంపించే సీన్‌లో అక్కడెక్కడో సముద్రతీరాన సేద తీరుతున్న రౌడీలు క్షణాల్లో ఆమె ముందు వాలిపోవడం కాస్త లాజిక్‌కి అందదు.


రిలీజ్‌ టైమ్‌లో ఫైనాన్షియల్‌ ఇష్యూస్‌ కారణంగా కొన్ని షోలు వాయిదా పడ్డప్పటికీ, జనాలను థియేటర్లకు రప్పించే పక్కా మాస్‌ ఎలిమెంట్స్ అన్నిటినీ దట్టించారు గోపీచంద్‌ మలినేని. సినిమాలోనే పాట ఉన్నట్టు ఈ సంక్రాంతికి పొంగల్‌ కాకుండా, పక్కా మాస్‌ బిర్యానీని వడ్డించారు రవితేజ.


చివరగా.. క్రాక్‌ ... ఎంటర్‌టైనింగ్‌ మాస్‌ బిర్యానీ

Updated Date - 2021-01-10T16:46:35+05:30 IST