ఆర్టిస్ట్‌కి టైమ్‌ వస్తే టైమే దొరకదు: కోట శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2021-07-11T01:15:07+05:30 IST

తన 77వ పుట్టినరోజు సందర్భంగా విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ‘ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన చెప్పుకొచ్చిన ఆసక్తికర విశేషాలు..

ఆర్టిస్ట్‌కి టైమ్‌ వస్తే టైమే దొరకదు: కోట శ్రీనివాసరావు

పదేళ్ల క్రితం వరకూ సినిమా అనేది తల్లి పాల లాంటిది. 

ఇప్పుడు సినిమా డబ్బా పాలులాగా తయారైంది. 

ప్రపంచం మామూలుగానే ఉంది. మనలోనే మార్పు వస్తుంది. 

ఈ తరానికి సాధన తక్కువ.. వాదన ఎక్కువ..

ఇప్పటికీ నేను అలసిపోలేదు..

తన 77వ పుట్టినరోజు సందర్భంగా విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ‘ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన చెప్పుకొచ్చిన ఆసక్తికర విశేషాలు..



 ఏడు పదులు దాటిన వయసులో దాదాపు 43 ఏళ్లు సినిమా రంగానికే కేటాయించారు. ఒక్కసారి వెనక్కి వెళ్లి చూసుకుంటే మీ జర్నీ ఎలా అనిపిస్తుంది. 

చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నన్ను డాక్టర్‌గా చూడాలని నా తల్లిదండ్రులు కోరిక. నా కోసం కాకపోయినా ఊరి కోసం అయినా డాక్టర్‌ చదవాలని నాన్న అంటుండేవారు. సైన్‌ గ్రూప్‌లో ఫస్ట్‌ క్లాస్‌కి ఒక శాతం మార్కులు తగ్గడంతో సీటు దొరకలేదు. నాన్న అయితే ప్రపంచంలో ఎక్కడైనా చదువు నేను మాత్రం ఒక్క రూపాయి కూడా డొనేషన్‌ కట్టను అని చెప్పేశారు. డిగ్రీ తర్వాత బ్యాంక్‌లో పని చేశాను. చాలామంది సినిమాల్లోకి వెళ్లమని సజెస్ట్‌ చేశారు. అప్పట్లో నటుడు కావాలంటే కొన్ని ప్రామాణికాలు ఉండేవి. నేను నల్లగా ఉండేవాణ్ణి. భయంతో సినిమాల్లో ప్రయత్నించలేదు. నాటకాల వైపు వెళ్లి, అక్కడ టి.కృష్ణగారు చూడడంతో నాకు అవకాశం వచ్చింది. ఈ జీవితంలో దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. సుఖవంతమైన జీవితాన్ని ఇచ్చాడు.. ఎన్నో బాధల్ని మిగిల్చాడు. నటుడిగా గుర్తింపు పొందాను. అనుకోకుండా ఎమ్మెల్యే అయ్యాను, పద్మశ్రీ అవార్డు కూడా పొందాను. ఇవన్నీ కూడా అనుకుంటే జరిగినవి కాదు. మంచైనా, చెడైనా అలా కలిసొచ్చాయి అంతే! 


రాజకీయాలపై ఇంట్రెస్ట్‌ ఉండేదా? 

నాకు రాజకీయాల మీద ఎలాంటి ఆసక్తి లేదు. నాది రాజకీయ నేపథ్యమూ కాదు. కాకపోతే వాజ్‌పాయ్‌గారంటే విపరీతమైన అభిమానం. విద్యాసాగర్‌గారు పట్టుబట్టడంతో బీజేపీలో చేరాను. ఎమ్మెల్యేగా గెలిచాను. 

మీ జర్నీలో హీరో మినహా అన్ని రకాల పాత్రలు పోషించారు. నటుడికి సంతృప్తి ఉండదు అంటుంటారు. మీరు చేయాల్సిన పాత్రలు ఇంకేమైనా ఉన్నాయా? 

అప్పట్లో సాంఘికం, పౌరాణికం, చారిత్రాత్మకం, జానపథం, కౌబాయ్‌.. ఈ ఐదు జానర్‌ కథలే ఉండేవి. అప్పుడు సినిమా ప్రభావం ప్రేక్షకుల మీద ఉండేది, ఇప్పుడు ప్రేక్షకుల ప్రభావం సినిమాపై ఉంటుంది. దాని వల్ల రకరకాల కథలు పుట్టకొస్తున్నాయి. ఫలానా అని ఇప్పుడేం చెప్పలేం. నా కెరీర్‌లో 150 చిత్రాల్లో రాజకీయ నాయకుడిగా నటించా. ఎక్కడా చెడ్డపేరు రాలేదు. ఇతర చిత్రాల్లో ఏదన్నా మేనరిజం నచ్చితే దాన్ని పట్టుకునేవాడిని. నేను నటించే చిత్రాల్లో దానిని అప్లై చేసేవాడిని. ఎదుటి వ్యక్తిని బాగా గమనించడం నాకు అలవాటు. షాట్‌కి గంట ముందు పాత్ర ఏంటో విని చేయడమే నాకు తెలుసు. అదేలా వచ్చింది అంటే నా దగ్గర జవాబు లేదు. ఆర్టిస్ట్‌కి టైమ్‌ వస్తే వ్యక్తిగత జీవితానికి టైమ్‌ ఉండదు. నేను బ్యాంక్‌ ఉద్యోగిని కాబట్టి ప్రపంచాన్ని పెద్దగా చూడలేదు. టెన్‌ టూ ఫైవ్‌, వన్‌ టు హండ్రెడ్‌ ఇదే నాకు తెలుసు. అయితే సినిమాల్లోకి వెళ్లాక ఏమీ తెలియని చెన్నైలో స్థిరపడాలంటే భయంగా ఉండేది. 

నాలుగు దశాబ్ధాలకు పైగా జర్నీలో ఎప్పుడైనా అలసిపోయిన భావన కలిగిందా? 

దాదాపు 30 ఏళ్లు రోజుకి 20 గంటలు పని చేశా. పని వల్ల తలనొప్పి వచ్చినట్లు కూడా నాకు గుర్తు లేదు. అలసిపోయి ఉంటే ఎప్పుడో సినిమాల నుంచి పారిపోయేవాణ్ణి. అంత బిజీలోనూ ఏ అవకాశాన్ని వదులుకోలేదు. 



విభిన్నమైన పాత్రలతో మిమ్మల్ని మోసిన దర్శకుల గురించి ఏం చెబుతారు? 

అన్ని భాషల్లో 750కు పైగా చిత్రాల్లో నటించా. ఎంతోమంది దర్శకులు నన్ను ప్రోత్సహించారు. ఇ.వి.వి సత్యనారాయణ నా ఎనర్జీ మొత్తాన్ని పీల్చేశాడు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేయించాడు. 

మీతరం, ఈతరం సినిమాలకు వస్తే ఏం చెబుతారు? 

పదేళ్ల క్రితం వరకూ సినిమా అనేది తల్లి పాల లాంటిది. ఇప్పుడు సినిమా డబ్బాపాలులాగా తయారైంది. ప్రపంచం మామూలుగానే ఉంది. మనలోనే మార్పు వస్తుంది. ఇప్పటి జనరేషన్‌కు సాధన తక్కువ. వాదన ఎక్కువ. ఈతరం పిల్లలు విజ్ఞానం పెంచుతూ జ్ఞానాన్ని కోల్పోతున్నారు. చెబితే వినరు. చెప్పేవాళ్లూ లేరు. ఇలా అంటే ఈతరానికి కోపం రావచ్చు. సాధన లేకపోతే ఏమీ చేయలేమండీ! నా గురువులు గొప్పవారు కాబట్టే నేను ఈ స్థాయిలో ఉన్నాను. 

తెలుగు వారికి అవకాశాలు తగ్గుతున్నాయని, అవకాశాలు ఇవ్వాలని మీరు ఎప్పుడూ సపోర్ట్‌గా నిలుస్తుంటారు? 

ఇప్పుడు కాదు.. 1994లోనే ఈ విషయంపై పోరాటం చేశాను. నేను పరభాషా నటులు అందరికీ వ్యతిరేకిని కాను. నటనలో ప్రూవ్‌ చేసుకున్నవారిని తీసుకోమంటున్నాంతే. నటన అంటే తెలియని వాళ్లని తీసుకొచ్చి ఆర్టిస్ట్‌లను తక్కువ చేయడం నాకు నచ్చడం లేదు. తెలుగు నటుల కన్నా పరభాషా నటులకే గౌరవం, డబ్బులు ఎక్కువ. తెలుగులో వాళ్లల్లో ప్రతిభ లేదా అన్నది నా ప్రశ్న. 

ఈతరంలో మీలాంటి నటుణ్ణి ఎవరైనా చూశారా? 

ఆ దృష్టిలో ఎవర్నీ చూడలేదు కానీ.. రావు రమేశ్‌, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు పాత్రలు చూస్తే ఇలా చేస్తే బావుంటుంది అని నాకు అనిపిస్తుంది. వెన్నెల కిశోర్‌ కూడా నచ్చుతాడు. కానీ అతనికి ఇంకా మంచి వేషాలు పడాలి. 

ఇప్పుడు మీరు అవకాశాలు వస్తే చేయగలరా? 

వేషాన్ని బట్టి తప్పకుండా చేస్తా. 



ఆరు నెలల తర్వాత ‘బాహుబలి’ హవా ఏమైంది..

‘బాహుబలి’ సినిమా విడుదలకు ముందు ఆరు నెలలు ఊదరగొట్టారు. ఆరు నెలల తర్వాత ఎవరన్నా పట్టించుకున్నారా? ఏదైనా అంతే.  కానీ ‘మాయాబజార్‌’ సినిమాను ఈరోజు వేసినా ఆరేళ్ల కుర్రాడి నుంచి అరవై ఏళ్ల ముసలాడి వరకూ చూస్తారు. ‘మాయాబజార్‌’లో చిన్న సీన్‌ తీయాలంటే ఇప్పుడు కోట్లు ఖర్చు చేస్తారు. ఇప్పటి టెక్నాలజీ ఏమీ లేకుండానే ఆ రోజుల్లో గొప్పగా తీశారు. ‘బాహుబలి’ని రాజమౌళి గొప్పగా తీశారు.  ప్రపంచ ఖ్యాతి సాఽధించింది. నేను కాదనను. కానీ ఆయనకు వచ్చిన పద్మశ్రీ అవార్డు కర్ణాటక నుంచి వచ్చింది. తెలుగువాళ్లు ఎందుకు ఆయన్ను సిఫార్సు చేయలేదు. తెలుగువాడిగా ఆయన్ని గౌరవించాలి కదా! 


Updated Date - 2021-07-11T01:15:07+05:30 IST