అడ్వాన్స్, పారితోషికం అంతా కలిపి రూ. 2500 ఇచ్చారు: కోట (పార్ట్ 9)

ABN , First Publish Date - 2021-08-26T02:02:42+05:30 IST

అప్పుడు ముత్యాల సుబ్బయ్యగారు ‘అప్పుడు మనం చూసిన నాటకంలో పల్లెటూరి విలన్‌గా చేశారే.. ఆయన్ని ట్రై చేస్తే ఎలా ఉంటుంది..? సమయం చూసి ఓసారి గుర్తు చేయమని మీరు కూడా చెప్పారు..’ అన్నారట.. ‘భలే గుర్తు చేశావయ్యా.. చాలా మంచి యాక్టరు.. భలే ఉంటాడాయన. కానీ ఆయన్ని..

అడ్వాన్స్, పారితోషికం అంతా కలిపి రూ. 2500 ఇచ్చారు: కోట (పార్ట్ 9)

టి. కృష్ణకు నన్ను గుర్తు చేసిన ముత్యాల సుబ్బయ్య

రవీంద్రభారతిలో ఓసారి ‘మీరైతే ఏం చేస్తారు’ అనే నాటకం ప్రదర్శించాం. అందులో నాది భూసామి వేషం. టి.కృష్ణగారు, ముత్యాల సుబ్బయ్యగారు ఆ నాటకం చూశారు. టి. కృష్ణగారి దగ్గర ముత్యాల సుబ్బయ్యగారు కో డైరెక్టర్. వాళ్లు ఆ నాటకం చూసింది 1982లో. వందేమాతరం సినిమా వాళ్లు తీయాలనుకున్నది 1985లో. అందులో ఓ పాత్రకు స్టేజ్ ఆర్టిస్ట్‌నే ఎంపిక చేయాలన్నది టి.కృష్ణగారి నిర్ణయం. ‘ఎవరున్నారు ఎవరున్నారు..’ అని టి. కృష్ణగారు అడుగుతోంటే అప్పుడు ముత్యాల సుబ్బయ్యగారు ‘అప్పుడు మనం చూసిన నాటకంలో పల్లెటూరి విలన్‌గా చేశారే.. ఆయన్ని ట్రై చేస్తే ఎలా ఉంటుంది..? సమయం చూసి ఓసారి గుర్తు చేయమని మీరు కూడా చెప్పారు..’ అన్నారట.. ‘భలే గుర్తు చేశావయ్యా.. చాలా మంచి యాక్టరు.. భలే ఉంటాడాయన. కానీ ఆయన్ని పట్టుకోవడం ఎలా..?’ అని ప్రశ్నించారట. అప్పుడు.. పక్కనే రమణారెడ్డిగారు (హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్‌లో పనిచేసేవారు. మంచి నటుడు. టి.కృష్ణగారి ఊరివాడే అనుకుంటా.. సినిమాల్లోనూ నటించేవారు) ఉన్నారట.


‘మీరు మాట్లాడేది బ్యాంకు శ్రీనివాసరావు గురించా..?’ అని అడిగారట. ‘అవును.. మీకు తెలుసా..?’ అని అడిగితే ‘నేను తీసుకొస్తా.. నాకు తెలుసు.. బ్యాంకులో పనిచేస్తాడు..’ అని చెప్పి నా దగ్గరకు వచ్చాడు. ‘నీకో తీపికబురు చెబుతా శ్రీనివాసరావు.. నాకు మంచి స్వీటు ఇప్పించు..’ అని అడిగాడు. ‘సరే పద’ అని మంచి స్వీటు తినిపించా. అప్పుడు చెప్పాడు ‘వందేమాతరం’ సినిమా గురించి. ‘మంచి వేషం. విలేజ్ పాలిటిక్స్ మీద రెండు మెయిన్ కేరక్టర్స్ ఉంటాయి. అందులో ఓ పాత్రకు నిన్ను అనుకుంటున్నారు. సినిమా ఆడితే నీకు మంచి పేరొస్తుంది. వాళ్లంతట వాళ్లు పిలుస్తున్నారు. అర్జెంటుగా వెళ్లు.. ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకు..’ అన్నాడు.. సరే అన్నాను. అప్పట్లో ఎస్టీడీలు ఏమీ లేవు. ఎన్‌బీఏ సర్వీసులని ఒక టెలిఫోన్ సర్వీస్ ఉండేది. వాళ్లను అడిగితే వాళ్లే ఇచ్చేవారు. రమణారెడ్డి ఇచ్చిన నెంబర్‌కు ఫోన్ చేశా.


టి.కృష్ణగారే ఫోన్ ఎత్తారు.. ‘నేను పలానా అండీ..’ అని చెప్పగానే ‘మీరు అర్జెంట్‌గా మద్రాసుకి రావాలండీ.. రేపు బయలుదేరగలరా..?’ అని అడిగారు టి.కృష్ణగారు. ‘రేపు రమ్మంటే కష్టమవుతుందండీ.. బ్యాంక్‌లో క్యాష్‌లో ఉన్నాను. ఏమీ అనుకోకండీ.. ఇక్కడ ఎవరో ఒకరికి క్యాష్ అప్పగించి రావాలి. ఎల్లుండి రమ్మంటే బయలుదేరతా..’ అన్నా. ‘సరే.. ఎల్లుండి బయలుదేరండి.. నెగ్లెక్ట్ చేయకండి.. నేను మళ్లా వైజాగ్ వెళ్లాలి..’ అన్నారు. ఇప్పట్లాగా అప్పట్లో ట్రైన్ రిజర్వేషన్లు పెద్దగా ఉండేవి కాదు.. అనుకోని ప్రయాణం.. ఎలాగోలా టిక్కట్టు తీసుకుని రైలు ఎక్కేశా.. మద్రాసు సెంట్రల్ స్టేషన్‌లో దిగి ఫోన్ చేశా..


‘మీరు రైలు దిగగానే ఫోన్ చేయండి’ అని టి.కృష్ణగారు చెప్పిన మాటలు, ఆయన ఇచ్చిన ఫోన్‌ నెంబరు గుర్తున్నాయి. అందుకే చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌లో దిగి ఫోన్ ఎక్కడుందా? అని వెతికా. షాపతను తమిళంలో మాట్లాడాడు. ఫోన్ చేసుకోవాలని ఇంగ్లీషులో అడిగా. అర్థం చేసుకుని ఫోనిచ్చాడు. నెంబర్‌ డయల్‌ చేయగానే ఫోన్ రింగైన శబ్దం అవతలివైపు నుంచి వినిపిస్తూనే ఉంది. ఆ గ్యాప్‌లోనే మనసులో ఎన్నో ఆలోచనలు. అందుకు కారణం లేకపోలేదు.. అంతకు ముందు మద్రాసు వెళ్ళానో లేదో గుర్తులేదుగానీ నటుడిగా అడుగుపెట్టడం అదే తొలిసారి. ఓ వైపు ఫోన్ మోగుతూనే ఉంది.. ఇవతల ఫ్లాట్‌ఫారమ్‌ మీద దిగిన ప్రయాణికులు ఎవరి గమ్యం వాళ్ళు వెతుక్కుంటూ వెళుతున్నారు. ‘వీళ్ళల్లో ఎంతమంది నాలాగా అవకాశాలకోసం వస్తున్నారో’ అనిపించింది.


ఇంతలో ‘హలో’ అని అవతలి నుంచి గొంతు వినిపించింది. అది టి. కృష్ణగారి గొంతే. గుర్తుపట్టా. ‘సార్‌ నేను పలానా’ అనగానే, ‘అక్కడే ఉండండి. మీకోసం కారు పంపిస్తాం’ అన్నారు. నాకు బాగా గుర్తు. ఎర్ర మారుతికారులో ఒకతను వచ్చారు. ఆయనే నిర్మాత పోకూరి బాబూరావు. ఈతరం ఫిలిమ్స్‌ పతాకంపై ఆయన చాలా సినిమాలు తీశారు. ఇప్పటికీ తీస్తూనే ఉన్నారు. సెంట్రల్‌ స్టేషన్‌ నుంచి నన్ను ఈతరం ఆఫీసుకు తీసుకెళ్ళారు. అక్కడే స్నానంచేసి, బట్టలు మార్చుకున్నా. అక్కడి నుంచి కంపెనీ ఆఫీసుకు తీసుకెళ్ళారు. అక్కడ వై.హరికృష్ణగారు, ఆయన పక్కనే టి.కృష్ణగారు ఉన్నారు. ‘మనం వేషం అనుకున్నాం కదా. అది వేస్తున్నారాయన’ అని అక్కడున్నవారికి టి.కృష్ణగారు పరిచయం చేశారు. ‘ఆయనకు డేట్లు ఇచ్చి, అడ్వాన్స్ ఇచ్చి పంపండి’ అని నిర్మాతగారిని చూసి చెప్పారు. 22 రోజులేమో డేట్లు తీసుకున్నారు. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అడ్వాన్స్, పారితోషికం అంతా కలిసి అప్పట్లో 2,500 రూపాయలు ఇచ్చారు.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-08-26T02:02:42+05:30 IST