‘అబ్బా ఏం చేశాడ్రా బ్యాంకోడు’ అనేవారు: కోట (పార్ట్ 8)

రంగస్థలమే నటనకు పెద్దబాల శిక్ష

నాటకం గురించి చెప్పాలంటే ఒకటే మాట. భాషకి డిక్షన్ ఎంత గొప్పదో, భాష నేర్చుకోవడానికి పెద్ద బాలశిక్ష ఎలా ఉపయోగపడుతుందో, అలా నటనకి రంగస్థలం ఉపయోగపడుతుంది. నటుడిలో ఆత్మస్థైర్యం పెంచుతుంది నాటకం. ఎదుటివారు ఎంత గొప్ప నటులైనా బెరుకు లేకుండా నటించే తత్వం నేర్పుతుంది. బాగా గడ్డం పెంచుకుని, కళ్ళల్లో గ్లిజరిన్ వేసుకుని రంగస్థలం మీద ఏడుపు సీన్లు చేస్తే ముందు నాలుగు వరుసల్లో కూర్చున్న వారికి బాగా కనిపిస్తుంది.. ఆ తర్వాతి వరుసల వారికి ఏం తెలుస్తుంది.? వాళ్లను కూడా రంజింపజేయాలంటే గట్టిగట్టిగా డైలాగులు చెప్పి, చేతులూ కాళ్లూ కదిలించాలి. కానీ సినిమాల్లో పరిస్థితి వేరు. రెండు అంగుళాల కన్నును కూడా 70ఎంఎం స్క్రీన్ మీద పే..ద్దగా చూపించవచ్చు. ఇక్కడ సెటిల్డ్‌గా చేయడం చాలా కీలకం. ఈ విషయం నాకు సినిమాల్లోకి ఎంటరైనప్పుడు అంతగా అర్థమయ్యేది కాదు. దర్శకులు ఒకట్రెండుసార్లు వివరించాక అర్థమైంది.


మొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’

సినిమా రంగంలో నేను మొదటిసారి కెమేరా ముందు నిలబడింది ‘ప్రాణం ఖరీదు’ చిత్రం కోసం. సీఎస్ రావుగారు రాసిన ‘ప్రాణం ఖరీదు’ నాటకం ఆధారంగా అదే టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాలో రావుగోపాలరావుగారు చేసిన పాత్రను నేను నాటకాల్లో వేసేవాడిని. చూసిన ప్రతీ ఒక్కరూ ‘అబ్బా ఏం చేశాడ్రా బ్యాంకోడు’ అని మెచ్చుకునేవారు. అవార్డులు కూడా వచ్చాయి. సినిమాలో నేను వేసిన పాత్రను సీఎస్ రావుగారు వేయాల్సింది. కానీ ఆయన అర్జెంటుగా ఊరెళ్లాల్సి రావడంతో నన్ను పిలిపించి ‘మన నాటకాన్ని సినిమాగా తీస్తున్నారు. చిన్న పాత్ర ఉంది. సెంటిమెంట్ బాగుంటుంది శ్రీనివాసరావు.. నువ్వెళ్లి ఆ పాత్ర చేసి రావయ్యా..’ అన్నారు. సరేనని వెళ్లా.. రాజమండ్రి దగ్గర వేమగిరిలో రెండు రోజులుండి చేసొచ్చా. మొదటిసారి కెమేరా ముందు నిలుచున్నాననే భావనే నాకు కలగలేదు. చెప్పాను కదా.. నాకు సినిమా పట్ల ఎలాంటి ఆసక్తిగానీ, అభిమానంగానీ లేదు. ఇంకా చెప్పాలంటే కోపం..! సినిమాల్లో నటించాలంటే ఆరు అడుగుల ఆజానుబాహుడై ఉండాలి, చూడ్డానికి కన్నూ, ముక్కూ అందంగా ఉండాలి. రింగుల జుట్టు ఉండాలి, అద్దంలో అందంగా కనిపించాలి. ఇలా మాట్లాడుకుంటుండేవారు. అలాంటప్పుడు నేను సినిమాలో ట్రై చేస్తే, ఒకవేళ పొరపాటున ఎవరైనా ‘ఏంటీ సినిమాల్లో నటిస్తావా..? అద్దంలో ఎప్పుడైనా ముఖం చూసుకున్నావా..?’ అని అడిగితే తట్టుకోగలనా..? అసలు ఈ ఫీలింగే నాకు ఎక్కువగా ఉండేది. అందుకేనేమో కోపంగా ఉండేది.. కానీ అలాంటి భయం నాకు రంగస్థలం మీద మాత్రం ఉండేది కాదు. ఎందుకంటే నాటకాలంటే నాకున్న దుగ్ధ అలాంటిది మరి.

ఆరేళ్ల గ్యాప్‌లో..

ప్రాణం ఖరీదు తర్వాత ప్రతిఘటన సినిమాలో నటించడానికి ముందుగా, ఈ ఆరేళ్లలో నేను నాటకాలు వేస్తూ, బ్యాంకులో ఉద్యోగం కొనసాగిస్తున్న సమయంలో ఓసారి జంధ్యాలగారు పిలిచి ‘అమరజీవి’ సినిమాలో అవకాశం ఇచ్చారు. నేను బెజవాడలో ఉన్నప్పటి నుంచి ఆయనతో పరిచయం. ఆ పరిచయంతోనే సినిమాల్లో నటించమని పిలిచేవారు. అలా సారథి స్టూడియోలో షూటింగ్‌లకు వెళ్లి చిన్నాచితకా వేషాలు వేసొచ్చేవాడిని. ‘బాబాయ్ అబ్బాయ్’లోనూ అలాగే చేశా.. యండమూరి గారి ‘కుక్క’లోనూ నటించాను. ప్రసాద్ గారని సెక్రటేరియట్‌లో చేసేవారు. ఆయన ఆ సినిమాని 63వేల రూపాయల్లో తీశారు. మంచి పేరు, నంది అవార్డు వచ్చాయి.


తొమ్మిది మంది:

నాకు రంగస్థలం మీద నటన నేర్పిన వారు తొమ్మిది మంది ఉన్నారు. మా అన్నయ్య కోట నరసింహారావు, భావనాచార్య, దేశిరాజు హనుమంతరావు, ఆదివిష్ణు, ఎల్బీ శ్రీరామ్, రామ్ ప్రసాద్, భానుప్రకాశ్, శశాంక్, విద్యాసాగర్.. నేను 300 సినిమాలు పూర్తి చేసిన సందర్భంగా వీళ్లందరికీ రవీంద్రభారతిలో సత్కారం చేశా. వీళ్లకు స్టేజీ మీద ఏమివ్వాలని చాలా రోజులు ఆలోచించి.. చివరకు ఓ వెండి వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఇచ్చా.. ప్రతిమ కింద ఓ ప్లేట్ చేయించి దానిపై వాళ్ల పేరు రాసి ‘ఈనాటి నా పురోగతికి ఆనాటి పునాదిరాయి మీరు.. నేను మిమ్మల్ని మర్చిపోకుండా తలచుకుంటూ ఉంటాను.. అని మీకు గుర్తుండటం కోసమని ఈ మెమెంటో మీ ఇంట్లో పెడుతున్నాను..’ అని రాసి ఇచ్చాను. ఈ కార్యక్రమానికి వచ్చిన డాక్టర్. డీ.రామానాయుడు గారు మాట్లాడుతూ.. ‘కోట ఖర్చు పెట్టడని అందరూ అంటుంటారు.. నాకు తెలిసి ఈ వేడుకకు లక్ష రూపాయలకు పైగా ఖర్చై ఉంటుంది. ఎవరినీ రూపాయి అడగకుండా నటన నేర్పిన వారిని సొంతంగా సత్కరించుకుంటున్నాడు. సినిమా వాళ్లలో ఇలా చేసిన వారు నాకు తెలిసి ఎవరూ లేరు..’ అని అన్నారు. మా గురువులు మాట్లాడుతూ.. ‘కోటకు మేం నేర్పింది తక్కువే.. ఏం చెప్పినా వెంటనే అర్థం చేసుకునేవాడు. అతడిని మేం బాగా ఉపయోగించుకున్నాం..’ అని అన్నారు. గిరిబాబుగారు, చంద్రమోహన్‌గారు ఇలా చాలామంది సినీ ప్రముఖులు ఆ కార్యక్రమానికి వచ్చారు.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

FilmSerialమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.