ప్రతి పాటకీ వెనక ఓ 50 మంది డ్యాన్సర్లు ఎందుకు?: కోట (పార్ట్ 7)

ABN , First Publish Date - 2021-08-20T03:26:09+05:30 IST

కానీ ఇప్పుడు సినిమాల్లో వస్తున్న డ్యాన్సులు చూడండి. హీరోయిన్ ముందు హీరో గెంతుతూ ఉంటాడు. కింద పడి కొట్టుకుంటూ ఉంటాడు. అదేంటంటే ఫ్లోర్ డ్యాన్సులంటారు. మామూలుగా మన ఇళ్లల్లో అమ్మాయిల ముందు అబ్బాయిలు గెంతుతారా?..

ప్రతి పాటకీ వెనక ఓ 50 మంది డ్యాన్సర్లు ఎందుకు?: కోట (పార్ట్ 7)

ఒకే నాటకం నూటపాతిక ప్రదర్శనలు

నేను వేసిన నాటకాల్లో నాకు గొప్ప పేరు తెచ్చిపెట్టిన నాటకం పేరు ‘మళ్లీ పాత పాటే’. ఈ నాటకాన్ని దాదాపు నూటపాతిక ప్రదర్శనలిచ్చా. అప్పట్లో హీరోలంటే రామారావుగారు, నాగేశ్వరరావుగారు మాత్రమే. వాళ్లు తప్ప పరిశ్రమలో ఇంకెవరూ లేరన్నది ఆ నాటకం కాన్సెప్ట్‌. అందులో నాది ప్రొడ్యూసర్‌ వేషం. ఆ వేషంలో నాకు చాలా మంచి పేరు వచ్చింది. చాలా మంది వంద నాటకాలు వేశామంటారండీ. కానీ నిజంగా అన్ని నాటకాలు వేయాలంటే మూడు జన్మలు కావాలండీ. వంద ప్రదర్శనలిచ్చామని చెప్పడానికి బదులు వంద నాటకాలు ఆడేశామని చెప్తుంటారు. నాటకాలు నాకు చేసిన మరో మేలు మాండలికంలో మాట్లాడగలిగే నైపుణ్యం లభించడం. నేనిప్పుడు మాట్లాడుతున్న యాసంతా ఎవరో నేర్పిందో, ఎవరి దగ్గరో నేర్చుకున్నదో కాదు. నా అంతట నేను ఆసక్తిగా నేర్చుకున్నదే. అలా నేర్చుకున్న యాసతో బ్యాంకు లంచ్‌టైమ్‌లో చుట్టూ పది మందిని కూర్చోపెట్టుకుని జోకులు చెప్తుండేవాడిని. ‘శ్రీనివాసరావు.. నువ్వు ఒక్క రోజు రాకపోయినా సందడి ఉండటం లేదయ్యా, నీ వాలకం చూస్తుంటే ఎక్కువ రోజులు బ్యాంకులో ఉండేటట్టు లేవయ్యా’ అనేవారు స్టాఫ్‌. మా ముచ్చట్లు చూసి మేనేజర్‌కి కోపంవచ్చి ‘వెళ్లండి. లంచ్ అవర్‌ అయిపోయింది. ఎవరి సీట్లకు వాళ్లు వెళ్లండి’ అని అరిచేవారు.


జీవితంలో థ్రిల్‌

మీకు జీవితంలో థ్రిల్‌ కలిగించిన అంశమేంటి? అని చాలా మంది అడుగుతూ ఉంటారు. నా జీవితంలో నేను మర్చిపోలేని విషయం ఒకటే. అది ‘పండగొచ్చింది’ నాటికను టీవీలో చూసుకోవడమే. నేను నడిస్తే ఎలా ఉంటాను? తలకాయ ఊపితే ఎలా ఉంటాను? మాట్లాడేటప్పుడు హావభావాలు ఎలా ఉంటాయి? వంటివాటిని తొలిసారి టీవీలో చూసుకున్నప్పుడు నాకు నోటమాట రాలేదు. గోవింద్‌ చౌదరిగారి దర్శకత్వంలో వేసిన ఈ నాటకంలో నేను మున్సబ్‌ పాత్ర చేశా. దూరదర్శన్‌లో ప్రదర్శితమైన తొలి తెలుగు నాటికం అదే. నేను, సుబ్బరాయశర్మగారు, నూతనప్రసాద్‌ తదితరులు నటించాం. నూతనప్రసాద్‌ అప్పుడే సినిమాల్లోకి వెళ్తున్న రోజులు. ‘పండగొచ్చింది’ హాస్య నాటిక. గట్టిగా మాట్లాడాలంటే హాస్యమంటే అదే. అప్పట్లో చేసిందే హాస్యం. కామెడీ అంటే ఇప్పుడొచ్చేది. నటనకు అప్పట్లో ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడేముందండీ... ప్చ్‌..


50 మంది డ్యాన్సర్లు ఎందుకు?

ఇప్పుడేముందండీ...ప్చ్..పద్ధతులు తెలియాలి! ఏదో అంటారే.. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేదీ కవితకు అనర్హం అని. ఇప్పుడున్న నటులకు కూడా ఇది వర్తిస్తుంది. అప్పట్లో నాటిక అంటే ఇలా ఉండాలి, నటన అంటే అలా ఉండాలి అని ప్రాథమికంగా కొన్ని లక్షణాలు ఉండేవి. అంతెందుకు? కథక్, కూచిపుడి, భరతనాట్యం వంటివాటికీ నిబంధనలుంటాయి. కానీ ఇప్పుడు సినిమాల్లో వస్తున్న డ్యాన్సులు చూడండి. హీరోయిన్ ముందు హీరో గెంతుతూ ఉంటాడు. కింద పడి కొట్టుకుంటూ ఉంటాడు. అదేంటంటే ఫ్లోర్ డ్యాన్సులంటారు. మామూలుగా మన ఇళ్లల్లో అమ్మాయిల ముందు అబ్బాయిలు గెంతుతారా? గెంతరు కదా? పద్ధతిగా హుందాగా ఉంటారు. కానీ సినిమాల్లో పరిస్థితి అలా ఉండదు. ప్రతి పాటకీ వెనక ఓ 50 మంది డ్యాన్సర్లు ఉండాల్సిందే? అంతమంది ఎందుకు అన్నది నా ప్రశ్న? ఉంటే తప్పేంటి? అని ఎదుటివారు అడిగితే నా దగ్గర సమాధానం లేదు. హీరో జైలు పాలైతే ఒకప్పటి సినిమాల్లో ఆ ఖైదీని మాసిన గడ్డంతో చూపించేవాళ్ళు. ఇప్పుడు గడ్డం లేని మగమనిషి లేడు. నటుడన్నవాడికి ముఖం అంతా జుట్టుంటే మేకప్‌మేన్ ఏం చేస్తాడు? అంతోసి దానికి ముంబై నుంచి మేకప్ మ్యాన్ ఎందుకు? వాళ్ళకి రోజూ పదివేలు, ఏడువేలు ఇవ్వడం ఎందుకు? ఏం చేసినా ఓ కారణం ఉండాలి కదా అంటే ‘మీదంతా పిచ్చి’ అంటారు. ‘సరే పో’ అని అనుకుంటా. పూర్వం ఎవరైనా గడ్డం పెంచి పిచ్చోడిలాగా ఉన్నావ్.. నీట్‌గా గడ్డం చేసుకుని మంచి బట్టలు వేసుకో అని అనేవారు. అప్పుడు పెద్దలు చెబితే పిల్లలు వినేవారు. ఇప్పటి తరానికి ఏమైనా చెప్తే, చెప్పినవాడు వెధవ అవుతాడు. అలాగని ఇంట్లో బిడ్డలకి మంచీ చెడూ చెప్పకుండా ఉండకూడదు. ‘తినగ తినగ వేము తియ్యగ నుండు..’ అంటారే అలా మనం చెప్పగా చెప్పగా పిల్లలకి తప్పకుండా మంచీ చెడు మనసుకు ఎక్కుతుంది.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-08-20T03:26:09+05:30 IST