న‌టుడిగా ర‌వితేజను చూసి.. నేను గ‌ర్వప‌డ్డ సినిమా అది: కోట (పార్ట్ 65)

ABN , First Publish Date - 2022-06-29T03:24:08+05:30 IST

ఓ ద‌ర్శకుడిగా రాఘ‌వేంద్రరావుగారిని ఎలా ఇష్టప‌డ‌తానో, అలాగే ర‌వితేజ‌ (Ravi Teja)ని ఓ హీరోగా ఇష్టప‌డ‌తాను. ర‌వితేజ జెన్యూన్‌గా క‌ష్టప‌డేట‌టువంటి క‌థానాయ‌కుడు. అత‌ని ద‌గ్గర నాకు న‌చ్చేది ఏంటంటే అత‌ను ఏమిటో అతనికి చాలా బాగా తెలుసు. అత‌ని కెపాసిటీ గురించి..

న‌టుడిగా ర‌వితేజను చూసి.. నేను గ‌ర్వప‌డ్డ సినిమా అది: కోట (పార్ట్ 65)

ఓ ద‌ర్శకుడిగా రాఘ‌వేంద్రరావుగారిని ఎలా ఇష్టప‌డ‌తానో, అలాగే ర‌వితేజ‌ (Ravi Teja)ని ఓ హీరోగా ఇష్టప‌డ‌తాను. ర‌వితేజ జెన్యూన్‌గా క‌ష్టప‌డేట‌టువంటి క‌థానాయ‌కుడు. అత‌ని ద‌గ్గర నాకు న‌చ్చేది ఏంటంటే అత‌ను ఏమిటో అతనికి చాలా బాగా తెలుసు. అత‌ని కెపాసిటీ గురించి అత‌నికి బాగా తెలుసు. వ్యక్తిగా, ఆర్టిస్టుగా త‌నకు తాను మంచి విమ‌ర్శకుడు. త‌న ద‌గ్గర‌కు వ‌చ్చిన క‌థ‌ల‌ను క‌రెక్ట్‌గా జ‌డ్జ్ చేసుకుని చేయ‌గ‌లిగిన‌ హీరో. అత‌ను హీరోగా న‌టించిన సినిమాల్లో మా కాంబినేష‌న్‌లో తొలిసారి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన చిత్రం ‘ఇడియ‌ట్‌’. అందులో నేను పోలీస్ కానిస్టేబుల్ వేషం వేశా. ర‌వితేజ నా కొడుకు వేషం వేశాడు. 


‘ముత్యాల‌ముగ్గు’ సంగీత నా భార్యగా న‌టించింది. ఆ చిత్రంలో పొద్దున్నే జ‌రిగే ఒక సీన్ ఉంటుంది. నాకు ఇప్పటికీ ఆ సీన్ చాలా ఇష్టం. ఉద‌యాన్నే లేచి నేను దేవుడికి ద‌ణ్ణం పెట్టి ‘నాకున్నది ఒక‌టే కోరిక అది నాకూ తెలుసు.. నీకూ తెలుసు.. రోజూ గుర్తుచేస్తున్నాన‌ని ఏమీ అనుకోవద్దు’ అని అంటా. అంత‌లో నా భార్యగా చేసిన సంగీత నావైపు కోపంగా చూసి కూతురిని ఉద్దేశించి ‘ఆ ప్లేట్ ఇటు తీసుకురావే’ అంటుంది. చెల్లెలు కేర‌క్టర్ చేసిన పిల్ల ప్లేటులో దోశ తీసుకెళ్ళి ర‌వితేజ‌కు ఇస్తుంది. అత‌ను నిల‌బ‌డి తింటుంటాడు. అత‌ను ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ప‌క్కనే నిల‌బ‌డి చూస్తూ ఉంటా. నేను చూస్తూ ఉండ‌టాన్ని గ‌మ‌నించిన ర‌వితేజ అక్కడినుంచి వెళ్ళి సోఫాలో కూర్చుని తింటాడు. నేను సోఫా ద‌గ్గర‌కువెళ్ళి చెప్పులు విప్పేసి, అత‌నికి ఎదురుగా కింద కూర్చుని గ‌డ్డం కింద చేయి పెట్టుకుని చూస్తా ఉంటా. కాసేపు న‌న్ను చూసి తినడం మానేసి ‘అబ్బా అట్టా సూడ‌కు నాన్నా.. సిగ్గేస్తుంది’ అంటాడు. ‘నీకు సిగ్గు కూడా ఉందంట్రా..’ అని వెట‌కారంగా న‌వ్వుతూ ‘ఏరా నువ్వు తినే తిండికి, నువ్వు చ‌దివే చ‌దువుకీ ఏమ‌న్నా బ్యాల‌న్స్ అవుతుందంట్రా...’ అని చేతుల్ని త‌క్కెడ‌లా పెట్టి చూపిస్తా. ‘నువ్వు తినేది ఇంత..చ‌దివేది ఇంత‌’ అని చేతుల్ని ప‌ర‌స్పరం విరుద్ధంగా చేసి చూపిస్తా. 


ఆ సీన్‌ పూరి జ‌గ‌న్నాథ్ ఎలా రాసుకున్నాడోగానీ, ఫ‌క్తు మ‌ధ్యత‌ర‌గ‌తి తండ్రి మ‌న‌స్తత్వం అండీ అదీ. మ‌ధ్యత‌ర‌గ‌తి తండ్రికి, ఎదిగిన కొడుకుకు ప్రతి ఇంట్లో దాదాపుగా అలాంటి సీన్లు జ‌రుగుతుంటాయి. ఎందుకో తెలియ‌దుగానీ త‌ల్లి ఎప్పుడూ మగపిల్లల్ని వెన‌కేసుకుని వ‌స్తుంటుంది. ‘ఇడియ‌ట్‌’ లోనూ అంతే. ర‌వితేజ చాలా నేచుర‌ల్‌గా న‌టించాడు. ఆ సీనే కాదు, టీ షాప్ ద‌గ్గర హీరోని, ఫ్రెండ్స్‌ని చిత‌క‌బాదే సీను, కోపంగా నేను ఇంటికి వ‌చ్చి చిందులు వేస్తుంటే ర‌వితేజ కోసం వ‌చ్చిన ఫ్రెండ్‌ని చేతిలో ఉన్న చెంబుతో కొట్టే సీను.. అప్పట్లో థియేట‌ర్లలో చాలా మెప్పించాయి. ఇవి ఎంత బావుంటాయో ఈ చిత్రంలో కొన్ని సెంటిమెంట్ సీన్లు కూడా అంతే బావుంటాయండీ. న‌టుడిగా ర‌వితేజను చూసి నేను గ‌ర్వప‌డ్డ సినిమా అది.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2022-06-29T03:24:08+05:30 IST