బుర్రకథ ప్రాక్టీస్ చేస్తే ఒళ్ళు పగిలేలా కొట్టారు: కోట (పార్ట్ 6)

రిహార్సల్స్‌ చేస్తే కొట్టేవారు

నా చిన్నతనం నుంచీ నాటక రంగంతో నాకు మంచి అనుబంధం ఉంది. నాకు, నా తమ్ముడికి నాటకాల్లో తొలి గురువు మా అన్నయ్య కోట నరసింహారావుగారే. ఆయనతో కలిసి మేం నాటకాలు చూడ్డానికి వెళ్ళేవాళ్ళం. నాన్నగారు ఏమీ అనేవారు కాదు. కానీ నాటకం రిహార్సల్స్‌ చేసి వచ్చామని తెలిస్తే మాత్రం కర్ర పుచ్చుకుని పెటీపెటీమని కొట్టేసేవారు. మమ్మల్ని చెడగొడుతున్నాడని మా అన్నయ్యని తెగ తిట్టేవారు.


బుర్రకథ ప్రాక్టీస్ చేస్తే ఒళ్ళు పగిలేలా కొట్టారు

కేవలం నాటకాలే కాదు, బుర్రకథ కూడా ప్రాక్టీస్‌ చేశాను. అలా ప్రాక్టీస్‌ చేస్తూ ఓ సారి మా నాన్నగారికి పట్టుబడిపోయాను. అప్పటికి నేను ఫిఫ్త్‌ ఫారమ్‌లో ఉన్నా. మా క్రాఫ్ట్‌ మాస్టారు ఒకసారి నాకు బుర్రకథ నేర్పారు. అప్పట్లో క్రాఫ్ట్‌ మాస్టర్లు చాక్‌పీస్‌లు తయారు చేయడం, నవారు అల్లడం, నాటకాలు వేయడం, బుర్రకథలు చెప్పడం వంటివి నేర్పించేవారు. నేను డక్కీ చేతబట్టుకుని మాస్టారు చెప్పింది రిపీట్‌ చేస్తూ గట్టిగా అరుస్తూ ప్రాక్టీసు చేస్తున్నా. మా ఇంటి వరండాలో నిలబడి నాన్నగారు మా కేకలు విని ‘ఎవర్రా గోల..’ అని అడిగారు. ‘మీ అబ్బాయి వాసుగారేనండీ.. బుర్రకథ చెప్తున్నట్టున్నారు’ అని పక్కన ఉన్నవాళ్ళెవరో అన్నారు. ఇంక అంతే.. ఇంటికి వచ్చాక ఒళ్ళు పగిలిపోయేలాగా కొట్టారండీ. ‘డాక్టర్‌గారి అబ్బాయివి. బుద్ధీ, జ్ఞానం ఉండాలి. బుర్రకథలేంటి? చూసేవాళ్ళు ఏమనుకుంటారు?’ అని పిచ్చి పిచ్చిగా కొట్టారు. ఇక ఆ తర్వాత నేను బుర్రకథ జోలికి పోలేదు. పల్లెటూర్లలో మాస్టారిగారి కొడుకు, కరణంగారి అబ్బాయి, డాక్టర్‌గారి పిల్లాడు... ఇలా అందరూ అందరికీ తెలిసేవారు. అందువల్ల జాగ్రత్తగా మసలుకునేవాళ్ళం. ఒకవేళ ఏమైనా తప్పు చేశామని తెలిస్తే నీళ్లల్లో నవారు నానేసి వాతలు పడేదాకా కొట్టేవారు. కొట్టారు కదా అని బైటకువచ్చి కూర్చుని ఏడుస్తున్నామనుకోండి. పక్కింటాయన వచ్చి ‘ఏరా... ఎందుకేడుస్తున్నావ్‌?’ అని అడిగేవారు. ‘నాన్నగారు కొట్టారండీ’ అని విషయం మొత్తం చెప్పామనుకోండి. ‘బడుద్ధాయ్‌. మీ నాన్న కాబట్టి అంతటితో వదిలేశాడు. నేనైతే చంపేసేవాణ్ణి, పిచ్చివేషాలేయకు’ అని ఇంకాస్త హెచ్చరించే వారు. మేం పెరిగిన పద్ధతి అలాంటిది మరి.


వంటవాడిపాత్రలో రంగస్థల ప్రవేశం

నాటకాల విషయానికొస్తే, నేను మా అక్కయ్య వాళ్ళింట్లో ఉన్నప్పుడు అంటే పదో తరగతి చదువుతుండగా మొదటిసారి నాటకం వేశాను. ఆ నాటకం పేరు ‘ఆడది’. కానీ ఒక్క స్ర్తీ పాత్ర కూడా ఆ నాటకంలో లేదు. ఉన్నవన్నీ మగాళ్ల పాత్రలే. ఆ నాటకంలో శతభిషం అనే వంటవాడి పాత్ర వేశాను. ఆ తర్వాత ప్రీ యూనివర్సిటీలో ఒకటీ అరా వేషాలు వేశాను. ఏలూరులో ఉన్నప్పుడు కూడా యూనివర్సిటీకి వెళ్లి నాటకాల్లో నటించేవాణ్ణి. కాలేజీ ఫంక్షన్లు, ఎన్‌సీసీ క్యాంపుల సమయంలోనూ నాటకాల్లో పాల్గొనేవాణ్ణి. నా చిన్నతనంలో పౌరాణిక నాటకాలు ఎక్కువగా ప్రదర్శించేవారు. నా తరానికి వచ్చేసరికి సాంఘిక నాటకాల ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. అందువల్ల నేను పౌరాణిక పాత్రలు వేసింది చాలా తక్కువ. సోషల్‌ నాటకాలే ఎక్కువగా వేశాను. అందులోనూ పంచెకట్టు వేషాలే అధికం. ప్యాంటు షర్టు ధరించిన పాత్రలు తక్కువ.

నాటకమే జీవితంలో భాగమైపోయింది

ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే పెళ్ళి చూపులు ఏర్పాటు చేశారు మా నాన్నగారు. భీమవరంలో మా మేనమామగారి ఇంట్లో పెళ్ళిచూపులు జరిగాయి. నాకు పిల్లనిచ్చిన మావగారు మా మేనత్త భర్తకి తమ్ముడు. ఆయన పేరు శంకరమంచి రాజేశ్వరరావుగారు. గుంటూరు దగ్గర సొలస అనే కుగ్రామం వాళ్ళది. వాళ్ళ అమ్మాయి పేరు రుక్మిణి. నాలుగో ఐదో చదువుకుంది. నేను వెళ్ళి చూసింది ఆ అమ్మాయినే. మా ఇంటిల్లిపాదికీ రుక్మిణి బాగా నచ్చింది. దాంతో 1968లో నాకు పెళ్ళి చేశారు. హైదరాబాద్‌ మకాం మార్చిన తర్వాత నాటకాల్లో మునిగితేలేవాణ్ణి. చెప్పాలంటే, బ్యాంకు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి, మరీ ముఖ్యంగా 1970 తర్వాత నాటకం నా జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ప్రతి రోజూ ఇంటికి వచ్చేసరికి రాత్రి 11, 12 గంటలయ్యేది. ఇంట్లో చిన్న పిల్లలుండేవారు. పైగా మా ఆవిడకి ఆరోగ్యం బావుండేదికాదు. దాంతో మా మావగారు వాళ్ళు నేరుగా నా ముఖంమీద ఏమీ అనలేకపోయేవారు. ‘కూడుపెడుతుందా? గుడ్డ పెడుతుందా? ఎందుకు వచ్చిన ఈ వెధవ నాటకాలు?’ అని అనలేక అనలేక అంటుండేవారు. వాళ్ళన్నదీ నిజమే.


ఎక్కువ ప్రదర్శనలు రవీంద్రభారతిలోనే

నాటకాలు వేస్తే డబ్బులు వచ్చేవి కావు. పైగా నెలకి 40, 50 రూపాయలు చేతిడబ్బే పడేది. కాకపోతే ఏమిటంటే, అప్పుడప్పుడే హైదరాబాద్‌ బాగా అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది. నగరం అభివృద్ధి అవుతున్న రోజులు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అన్నిరంగాల్లోని నిష్ణాతులూ అక్కడ ఉండేవారు. అలా చాలా మందిని నేను నాటకాల ద్వారానే కలిసేవాణ్ణి. ఇక్కడో విషయం చెప్పాలండీ... మామూలుగా నాటకాలు వేసేవాళ్లందరూ ఏదో ఒక సమాజంలో ఉంటారు. అంటే వాళ్లకి ఒకరే గురువు ఉంటారన్నమాట. కానీ నేను ఏ సమాజంలోనూ లేను. ఎక్కువగా పరిషత్‌లకి వెళ్లలేదు. ఎందుకంటే నా ఉద్యోగం నన్ను పర్మిట్‌ చేసేదికాదు. పరిషత్ పోటీల రిహార్సల్స్‌ చేయాలంటే బ్యాంకులో సెలవులు ఇచ్చేవారుకాదు. అందువల్ల రవీంద్రభారతిలోనే ఎక్కువగా నాటక ప్రదర్శనలు చేశాను. వైవిధ్యమైన పాత్రల్ని చేయాలనే తపన ఉండేది.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

FilmSerialమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.