ఏ ముహూర్తాన అలా అన్నానో.. వారానికే కొడుకుని పోగొట్టుకున్నాను: కోట (పార్ట్ 54)

ABN , First Publish Date - 2021-11-25T03:32:12+05:30 IST

జగపతిబాబు మా అబ్బాయిని చంపి నా ఇంటిముందు తెచ్చి పడేసే సీన్‌ కోసం లొకేషన్‌లో పాడి కూడా సిద్ధం చేస్తున్నారు. నాకేమో ఆ వాతావరణం చూసి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎంతైనా కన్న కొడుకు కదా... చేసేది సినిమానే అయినా, నటనే అయినా నేను వాడిని పాడి మీద శవంలాగా... అసలు ఆ దృశ్యాన్నే జీర్ణించుకోలేకపోయా.

ఏ ముహూర్తాన అలా అన్నానో.. వారానికే కొడుకుని పోగొట్టుకున్నాను: కోట (పార్ట్ 54)

ఖాళీగా కూర్చోవడం పరమ చిరాకు..

ఇదిగో ఇలా ఖాళీగా కూర్చున్నప్పుడు నాకు ఆ రోజులన్నీ గుర్తుకొస్తుంటాయి. ఆ చనువుతోనే త్రివిక్రమ్‌లాంటివారితో ‘బోర్‌ కొడుతోందయ్యా నాకు. అనవసరంగా ఆర్టిస్టుని ఊరికే కూర్చోపెడుతున్నారు. ఖాళీగా ఉంటే ఏ ఆర్టిస్టుకయినా బ్రెయిన్ పాడయిపోతుంది. నన్ను ఇలా కూర్చో పెట్టొద్దు. మంచి వేషాలివ్వండి’ అని అడుగుతుంటా. ఎందుకంటే ఖాళీగా కూర్చోవడం నాకు పరమ చిరాకు. ఎప్పుడన్నా ఎవరన్నా పలకరించడానికి ఎవరో ఒకరు వస్తే తప్ప నాకు పొద్దుపోయేది ఎలాగ? అందులోనూ మూడున్నర దశాబ్దాలకు పైగా బతికిందంతానూ సినిమాల్లో‍నాయే. ప్రతిరోజూ 150మంది ఆర్టిస్టుల మధ్య మెలిగేవాడిని. అదీ తీరిక లేకుండా... మూడు షిఫ్టులతో. చుట్టూ జనం మధ్య కోలాహలంగా బతికి ఒక్కసారిగా సైలెంట్‌ అయిపోయి ఇంట్లో కూర్చోవాలంటే ఎంత నరకం? ఇంట్లో నేను, మా ఆవిడ, మా కోడలు, పిల్లలు ఉంటాం. పిల్లలు కూడా స్కూలుకి వెళ్తుంటారు. వస్తుంటారు. నేను, మా ఆవిడ ఎంత సేపని ఒకరిని ఒకరం చూస్తూ కూర్చోవడం? అందుకే మంచి వేషాలుంటే నన్ను మర్చిపోవద్దని నలుగురైదుగురిని అడుగుతుంటా.


కొత్త ఆర్టిస్టు నిలదొక్కుకోవాలంటే ఎష్టాబ్లిష్‌డ్‌ ఆర్టిస్టు సహకరించాలి. మా అబ్బాయిని ప్రోత్సహించి ధైర్యం చెప్పే బాధ్యత జె.డి.చక్రవర్తి, జగపతిబాబు తీసుకున్నారు.. ఒకరోజు షూటింగ్‌ స్పాట్‌కెళ్లాక చూస్తే ఒక సీన్‌ కి అరేంజ్‌మెంట్స్‌ చేస్తున్నారు. అవన్నీ చూసి నా మనసు ఇబ్బందిపడసాగింది. . అప్పుడు నా మానసిక పరిస్థితి బాబుకి చెప్పా . అలాగే చేద్దాం అన్నారు. ఉదయం లొకేషన్‌కి వెళ్ళగానే వాతావరణం చాలా సీరియస్‌గా ఉంది. ఆ రోజు మా అబ్బాయిని జగపతిబాబు చంపేసే సీన్‌ చిత్రీకరిస్తారని తెలిసింది. మా అబ్బాయి ఆంజనేయప్రసాద్‌ ‘గాయం–2’ చిత్రంలో నా కొడుకు వేషం వేశాడు.


జగపతిబాబు మా అబ్బాయిని చంపి నా ఇంటిముందు తెచ్చి పడేసే సీన్‌ కోసం లొకేషన్‌లో పాడి కూడా సిద్ధం చేస్తున్నారు. నాకేమో ఆ వాతావరణం చూసి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎంతైనా కన్న కొడుకు కదా... చేసేది సినిమానే అయినా, నటనే అయినా నేను వాడిని పాడి మీద శవంలాగా... అసలు ఆ దృశ్యాన్నే జీర్ణించుకోలేకపోయా. ‘ఏం చేయాలా?’ అని కాస్త అటూ ఇటూ ఆలోచించి బాబు దగ్గరికెళ్ళి ‘ఒక మాట చెప్పాలండీ..’ అన్నా. ‘చెప్పండి సార్‌.. మీ వాడు చాలా బాగా చేస్తున్నాడు. తిరుగులేదు. సినిమా పరిశ్రమకి చాలా మంచి విలన్ దొరికాడు. మీవాడు బోర్న్‌ ఆర్టిస్ట్‌ అండీ. మీ పేరు నిలబెడుతాడు...’ అని ఆయన చెబుతున్నారు. ‘అది కాదండీ. మీరేమీ అనుకోకపోతే ఒక మాటండీ..’ అన్నా.. చెప్పండి అన్నట్టు చూశారు.


ఏ ముహూర్తాన అన్నానోగానీ వారం తిరిగేసరికల్లా....

‘మా వాడిని నేను అలా పాడి మీద చూడలేనయ్యా. తలచుకుంటేనే కాస్త వణుకు వస్తున్నట్టుంది. నాకు మనస్కరించడం లేదు. వాడు అలా పడి ఉంటాడనుకుంటేనే నాకు ఏదోలా ఉంది. కాస్త అవాయిడ్‌ చేయండి. వాడిని అలా చూస్తే నేను చేయలేనండీ’ అన్నా. జగపతిబాబు ఏమనుకున్నారో ఏమో ఒక్క క్షణం ఆలోచించి ‘మరేం ఫర్లేదు కోటగారు.. మీరు నింపాదిగా ఉండండి. ఆ సీన్‌లో అక్కడ మీ అబ్బాయి ఉండడు. డూప్‌ని పెడదాం. మీ ఫీలింగ్‌ నాకు అర్థమైంది’ అన్నారు. ఆ సీన్‌లో వాడిని అలా చూడలేనని ఆ రోజు ఏ ముహూర్తాన అన్నానోగానీ, వారం తిరిగేసరికి నా బిడ్డని అలాగే చూడాల్సి వచ్చింది. ఆ సీన్‌ చేసిన వారానికి మావాడికి యాక్సిడెంట్‌ జరిగింది. ముందు వాడు బైక్‌ మీద వెళ్తుంటే, వెనుక కోడలు, మనవళ్లు కారులో వెళ్తున్నారు. అంతలోనే యాక్సిడెంట్‌ జరగడం, మా వాడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లడం... కడుపుకోత ఎవరికి అర్థమవుతుంది? నా భార్యని సముదాయించలేకపోయా. కళ్ళ ముందే కట్టుకున్న వాడిని పోగొట్టుకున్న మా కోడలుపిల్ల పరిస్థితిని మాటల్లో ఎలా చెప్పాలి? అన్నీ దిగమింగి పైకి ధైర్యంగా ఉంది.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-11-25T03:32:12+05:30 IST