‘లెజెండ్’ అనగానే.. నాకు గుర్తొచ్చేది జగపతిబాబే: కోట (పార్ట్ 53)

ABN , First Publish Date - 2021-11-24T03:32:45+05:30 IST

ఇవన్నీ పక్కనపెడితే జగపతిబాబు పేరు నేను ఎల్లప్పుడూ తలచుకోవాలి. ఎందుకంటారా? మా అబ్బాయి విషయంలో జగపతిబాబు, జె.డి.చక్రవర్తి చేసిన మేలు మర్చిపోకూడదు. ఒకరోజు చక్రవర్తి మా ఇంటికి వచ్చి ‘మీకెందుకండీ కోటగారు.. మీ..

‘లెజెండ్’ అనగానే.. నాకు గుర్తొచ్చేది జగపతిబాబే: కోట (పార్ట్ 53)

త్రివిక్రమ్‌ దగ్గర నేను చేసిన చివరి చిత్రం ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’. అందులో నా వేషం భలే గమ్మత్తుగా కుదిరింది. ఆ సినిమాలో ఇంటి సీన్లు హైదరాబాద్‌లో ఉన్న ‘మర్యాదరామన్న’ సెట్లో తీశారు. ఆ సెట్లోకి నేను వెళ్ళగానే త్రివిక్రమ్‌ ఎదురొచ్చి చెప్పింది ఏమిటంటే... ‘‘అసలు ఈ సినిమాలో ముందు మేం మీకు వేషమే అనుకోలేదండీ. ఏమిటో ఈ సెట్లోకి రాగానే ఇక్కడ కోటగారు కూర్చుని ఉంటారు. ఇక్కడ ఫలానా వాళ్లుంటారు అన్నాను గభాలున. నా సినిమా అంటే మీరుండాలి, మీరు లేకపోవడమేంటి? అనే తపన నా మనసులో ఉన్నట్టుంది. అందుకే నా నోటివెంట మీ పేరు వచ్చేసింది. వెంటనే కో డైరెక్టర్‌ని పిలిచి మీ కేరక్టర్‌ని చొప్పించాం. వేషం పెద్దగా ఉండదు. ఏమనుకోవద్దు’’ అన్నారు. అతని నిజాయితీకి ముచ్చటేసింది. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సెట్లో ఉన్నప్పుడే నాకు పద్మశ్రీ పురస్కారం వచ్చింది. విషయం తెలిసి నిర్మాత చినబాబుగారు కేక్‌ తెప్పించారు. ఆయన చాలా సహృదయుడు. మంచి ఆర్టిస్టుని ప్రోత్సహించాలనే మనస్తత్వం ఉన్నవాడు. నేనంటే ప్రేమ ఉన్న నిర్మాతల్లో ఆయన ఒకడు.


‘సింహా’ చాలా స్పెషల్‌ !

‘సింహా’ సినిమా గురించి తప్పకుండా చెప్పుకోవాలండీ. బోయపాటి శ్రీను ‘ఈ వేషం మీకోసమే రాశానండీ. మీరు వేస్తేనే బావుంటుంది’ అన్నప్పుడు మామూలుగానే తీసుకున్నా. కానీ సినిమా చేశాక తెలిసింది ఆయన మాటల్లోని అర్థం. చాలా పవర్‌ఫుల్‌ వేషం వేశాను అందులో. లెజెండ్ సినిమా గుర్తొచ్చిన ప్రతిసారీ నాకు జగపతిబాబుగారు జ్ఞాపకం వస్తారు. బాబు చాలా కమిటెడ్‌ ఆర్టిస్ట్‌. చిన్న పాత్ర నుంచి ఎలాంటి వేషం ఇచ్చినా సరే తనలో తాను చాలా మథనపడతారు. హీరోగా ఒక వెలుగు వెలిగి విలన్‌ వేషాలకు మలుపు తీసుకోవడం ఆయన వేసిన డేరింగ్‌ స్టెప్‌. నేను విలన్‌గా నటించినవాణ్ణి కనుక, జగపతిబాబు విలన్‌గా ఎంతో బాగా చేస్తున్నారనే విషయం బల్లగుద్ది చెప్పగలను. ‘హీరో వేసినన్నాళ్ళూ వచ్చిన పేరు కన్నా, విలన్ వేసినప్పుడు చాలా మంచిపేరు వచ్చింది’ అని బాబు ఒకసారి మీడియాతో కూడా అన్నట్టున్నారు. ఆయన టాలెంట్‌ను ప్రేక్షకులు గుర్తించారు మరి. అయితే ఇక్కడొక మాట చెప్పాలండీ.. కొందరు సొద అనుకున్నా ఫర్వాలేదు. చెప్పితీరాలి. ఎందుకంటే ఏం తక్కువ చేశారని జగపతిబాబును విలన్‌గా అందరూ ఎంకరేజ్‌ చేయడం లేదు? ఎక్కడెక్కడో పొరుగు భాషలవాళ్ళు పనిగట్టుకుని వచ్చి పట్టుకుపోతున్నారుగానీ, ఇక్కడి వాళ్ళకి అందరికీ ఎందుకు కనిపించడం లేదు. ఏం అతనేం తక్కువ ఆర్టిస్టా? బావుండదా అతను చేస్తే? పోనీ ఫేస్‌ వేల్యూ లేదా? అసలు అతనికి ఏం తక్కువ? అయినా ఎందుకు ఎంకరేజ్‌ చేయరు? తెలుగులో ఇలాంటి కెపాసిటీ ఉన్న నటులు ఉన్నప్పుడు ఎంకరేజ్‌ చేయాలి. జగపతిబాబు నాకు ‘గాయం’ నుంచే పరిచయం. ఆ సినిమాకి చేస్తున్నంతకాలం ‘మీ పక్కన సీన్‌లో నిలబడాలంటే కాసింత ప్రాక్టీస్‌ అవసరమండీ కోటగారు’ అనేవారు. ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా ‘కోటగారు ఈజ్‌ ఎ వండర్‌ఫుల్‌ ఆర్టిస్ట్‌...’ అని అన్నట్టు గుర్తు.


వాళ్ళ మేలు మరిచిపోకూడదు

ఇవన్నీ పక్కనపెడితే జగపతిబాబు పేరు నేను ఎల్లప్పుడూ తలచుకోవాలి. ఎందుకంటారా? మా అబ్బాయి విషయంలో జగపతిబాబు, జె.డి.చక్రవర్తి చేసిన మేలు మర్చిపోకూడదు. ఒకరోజు చక్రవర్తి మా ఇంటికి వచ్చి ‘మీకెందుకండీ కోటగారు.. మీ అబ్బాయితో నేను చేయిస్తాను. అద్భుతంగా చేయగలడు’ అన్నాడు. అందుకు నేను ‘హీరో వేషాలు చేయించకండయ్యా... నా మాట విని విలన్ పాత్రలు చేయించండి’ అన్నా. ‘మేమూ అదే అనుకుంటున్నామండీ’ అన్నాడు చక్రవర్తి. అన్నట్టుగానే చాలా చక్కగా చేయించాడు. అవతల జగపతిబాబు కూడా ఎంతో సహకరించారు. మా అబ్బాయి అంత బాగా చేయగలడా? అని నేనే ఆశ్చర్యపోయాను. అంటే ఒకటండీ... సెట్లో ఎప్పుడూ ఒక కొత్త ఆర్టిస్ట్‌ నిలదొక్కుకోవాలంటే, ఎస్టాబ్లిష్డ్‌ ఆర్టిస్టు ధైర్యం చెప్పాలి. ఎదుటివారికి కాసింత ఊపిరి ఇచ్చి తిరగనివ్వాలి. వాళ్లని ప్రోత్సహించాలి. అవన్నీ చేశారు బాబు. అంతే కాదు, ఆయన నాకు చేసిన సాయం మరొకటి ఉంది. మా అబ్బాయి విషయంలోనే అదీనూ. ఒకరోజు స్పాట్‌కెళ్లాక ఒక సీన్‌కి అరేంజ్‌మెంట్స్‌ చేస్తున్నారు. అవన్నీ చూసి నా మనసు ఇబ్బందిపడసాగింది. అప్పుడు నా మానసిక పరిస్థితిని బాబుకి చెప్పా. అలాగే చేద్దాం అన్నారు.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-11-24T03:32:45+05:30 IST