డొనేషన్ కడితే సీటు వచ్చేదే.. కానీ నాన్నగారు ఓ మాటన్నారు: కోట (పార్ట్ 5)

అప్పట్లో 61 శాతం ఫస్ట్‌ మార్క్‌  చాలాగొప్ప

నేను క్లాస్‌ ఫస్ట్‌ మార్కులు తెచ్చుకునేవాణ్ణి కాకపోయినా బాగానే చదివేవాణ్ణి. ఇప్పుడు వందకి వంద మార్కులు వేస్తున్నారు కానీ, నా చిన్నతనంలో 61 శాతం మార్కులు తెచ్చుకుని ఫస్ట్‌క్లాస్‌ వస్తే చాలా గొప్ప. హెడ్మాస్టర్‌ పిలిచి అందరి చేత చప్పట్లు కొట్టించి, ఒక పెన్నులాంటిది గిఫ్ట్‌గా ఇచ్చి ప్రోత్సహిస్తే, చాలా గర్వపడిపోయేవాళ్ళం. డాక్టర్‌ కావాలనే పట్టుదలతో నేను కూడా చదివా. అయితే నాకు ప్రీ యూనివర్సిటీ మార్కుల్లో ఒక శాతం తక్కువ వచ్చింది. మద్రాసు యూనివర్సిటీలోనూ, మా బావగారు చదివినచోట సీటుకోసం ట్రై చేస్తే రాలేదు. ఆ సమయంలో డొనేషన్ల హడావిడి పెద్దగా లేదుగానీ, అప్పుడప్పుడే మొదలవుతోంది.


పుణ్యకాలం గడిచిపోయింది

డొనేషన్‌ ఒక సీటుకి నాలుగు వేలు, ఐదు వేలు.. అలా అడిగేవారు. ఆ డబ్బు కడితే నాకు సీటు వచ్చేది. అయితే మా నాన్నగారు ఏమన్నారంటే ‘నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి చదువుకో. అప్పు చేసైనాసరే నిన్ను చదివిస్తా. కానీ పావలా, రూపాయి డొనేషన్‌ కూడా కట్టను. నీ వెనుక తమ్ముడు వస్తున్నాడు. వాడు ఏం చదువుతానంటాడో. మరోవైపు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి. నేను, మీ బావ డొనేషన్లు కట్టి డాక్టర్‌ చదువు చదవలేదు. కష్టపడి చదివాం’ అన్నారు. సరే అని తెలిసిన చోటల్లా ట్రై చేశాం. ఈ క్రమంలో మూడు నెలలు గడిచాయి. కాలేజీ అడ్మిషన్లు పూర్తైపోయాయి.


వామ్మో... అకడమిక్‌ ఇయర్‌ మిస్సైతే ఎలా? బీఎస్సీ అయినా చదివితే ఆ తర్వాత మెడిసిన్‌ చేయొచ్చు అనే ఆశతో సీటుకోసం ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ‘ఏం చేయాలా’ అని ఆలోచిస్తుండగా, మా జ్ఞాతి కోట భాస్కరరావుశర్మ గుర్తొచ్చారు నాన్నకి. ఆయన ఏలూరు కాలేజీలో భౌతికశాస్త్ర విభాగాధిపతి (ఫిజిక్స్‌ హెచ్‌వోడి)గా చేసేవారు. ‘శ్రీనివాసరావు కుర్రాడురా. మెడిసిన్‌ చదువుతానని ఏడ్చాడు. ఎక్కడా సీటు రాలేదు. ఆ ధ్యాసలో పడి మిగిలిన కాలేజీల్ని వదులుకున్నాడు. నీ కాలేజీలో అవకాశం ఉంటే సీటు ఇప్పించు..’ అని ఉత్తరం రాసి కాంపౌండర్‌కి ఇచ్చి ఆయనతో నన్ను ఏలూరు పంపించారు. ఆ ఉత్తరం చూసి ఆయన నాకు సీటు ఇచ్చారు.

ఇరవైఏళ్ళు బ్యాంకు ఉద్యోగం

మూడేళ్లు బుద్ధిగా చదివి డిగ్రీ పూర్తి చేసి ఎంప్లాయ్‌‌మెంట్‌ ఎక్సేంజ్‌లో పేరు రిజిస్టర్‌ చేయించుకున్నాను. ఈ మూడేళ్లలో మెడిసిన్ చదవాలన్న ఆలోచన పోయింది. ఓ సారి రోడ్డుమీద వెళ్తుంటే బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన కనిపించింది. ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసులో అడిగితే పరీక్షలు రాయాలన్నారు. రాస్తే సెలక్ట్‌ చేసి బెజవాడలో ఇంటర్వ్యూకి పిలిపించారు. అక్కడికి వెళ్తే టెంపరరీ అపాయింట్‌మెంట్‌ ఇచ్చి, బెజవాడ పడమటలో పోస్టింగ్‌ వేశారు. అలా 1966లో ఉద్యోగంలో చేరాను. ఉద్యోగంలో చేరిన రెండేళ్ళకు పెళ్ళి చేశారు. పెళ్ళైన మూడు నెలలకే నా ఉద్యోగం పర్మనెంట్‌ అయింది. పాత సర్వీసును కూడా లెక్కలోకి తీసుకుని ఇంక్రిమెంట్‌ ఇచ్చారు. అప్పట్లో నా జీతం 130 రూపాయలు. అలా బెజవాడ పడమట బ్రాంచి నుంచి నందిగామకు బదిలీ చేశారు. అప్పుడు మా ఆవిడకు అనారోగ్యం చేయడంతో రిక్వెస్ట్‌ పెట్టుకుని హైదరాబాద్‌కు ట్రాన్సఫర్‌ చేయించుకున్నా. తొలుత కోఠి హెడ్‌ ఆఫీస్‌లో ఉద్యోగం వేశారు. ఆ తర్వాత టెల్లర్‌గా ప్రమోషన్ ఇచ్చి హెచ్ఎఎల్‌ బ్రాంచ్‌కు పంపారు.


ఆ తర్వాత మళ్ళీ ప్రమోషన్ ఇచ్చి నారాయణగూడ పంపించారు. ఆ తర్వాత కూడా ప్రమోషన మీద అటూ, ఇటూ వెళ్ళమన్నారు గానీ, నేనే ప్రమోషన్లు వద్దనుకుని నారాయణగూడ బ్రాంచ్‌లోనే ఉండిపోయా. అక్కడే ఉద్యోగానికి రాజీనామా చేశాను. అలా మొత్తం పందొమ్మిదిన్నరేళ్ళు బ్యాంకు ఉద్యోగం చేశాను. చివరిగా నేను తీసుకున్న జీతం 800 రూపాయలు. అప్పట్లో అది చాలా గొప్ప. ఐనా బ్యాంకులో నేను ప్రమోషన్ వద్దను కోవడానికి రెండు కారణాలున్నాయి. మొదటిది నా కుటుంబం, రెండోది నాటకం. ఆ నేపథ్యం కూడా మీకు నేను చెప్పాలంటే కొంచెం బాల్యంలోకి వెళ్ళాలి.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

FilmSerialమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.