నా దృష్టిలో ఎన్టీఆర్ సంపూర్ణ నటుడు.. ఎందుకంటే?: కోట (పార్ట్ 48)

నేను అన్నట్టే...

నాకు నటుడు శ్రీహరి అంటే చాలా ఇష్టం. ఎక్కడ కనిపించినా ‘అన్నా’ అని ఆప్యాయంగా పలకరించేవాడు. ఒకసారి రామానాయుడుగారి స్టూడియోలో షూటింగ్‌లో ఉన్నాడు. నేనెందుకో అక్కడికెళ్లా. చాలా బాగా నటిస్తున్నాడనిపించింది. ‘ఈ ఏడాది తప్పకుండా నంది తీసుకుంటావు తమ్మీ’ అన్నా. ‘గట్లే కానీ అన్నా. నీ నోటి చలవ’ అన్నాడు. అన్నట్టే ఆ ఏడాది నంది తీసుకుని నా దగ్గరకు వచ్చి ‘అన్నా, నీ మాట నిజమైందే, నంది తీసుకున్నా’ అని చాలా సంతోషంగా చెప్పాడు. నాతో క్లోజ్‌గా ఉండేవాడు. అంత త్వరగా కన్నుమూయాల్సిన వ్యక్తి కాదు. శ్రీహరి లేని లోటు తెలుగు సినిమాలో ఇంకా కనిపిస్తూనే ఉంది.

నా దృష్టిలో ఎన్టీఆర్ సంపూర్ణ నటుడు

వివాదాల సంగతి పక్కనపెడితే నేను నటుడినే అయినప్పటికీ నాకు నచ్చే నటులు కూడా కొందరుంటారుగా. నాగార్జునగారు, వెంకటేశ్‌గారి తరాన్ని పక్కన పెడితే ఈ తరంలో నేను మెచ్చే నటులు ముఖ్యంగా ముగ్గురు. వారిలో ఎన్టీఆర్‌ ఒకరు. తారక్‌ నన్ను బాబాయ్‌ అంటాడు. నా దృష్టిలో అతను సంపూర్ణ నటుడే. నేను గమనించిన బలాలు అతనిలో మూడు ఉన్నాయి. అందులో మొదటిది భాష. అతని ఉచ్ఛారణ చాలా స్పష్టంగా ఉంటుంది. తెలుగు మాట్లాడుతుంటే ఎంత పెద్ద డైలాగుకైనా వన్స్‌మోర్‌ కొట్టాలనిపిస్తుంది. అంత స్వచ్ఛంగా చెబుతాడు. పైగా అతను చెబుతుంటే పిల్లకాయ మాట్లాడుతున్నట్టుగా ఉండదు. ఓ పద్ధతి, వ్యవహారం ఉన్న ఓ వ్యక్తి చెబుతున్నట్టు ఉంటుంది. శ్రోతకు అలాంటి భావన కలగిందంటే వక్త సక్సెస్‌ అయినట్టే. రెండో ప్లస్‌ పాయింట్‌ అతని చలాకీతనం. చాలా కలుపుగోలుగా ఉంటాడు. ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటాడు. డీలా పడటం, నీరసపడటం వంటివి అతనికి చేతకాదు. హీరో అనే వ్యక్తి యాక్టివ్‌గా ఉంటే సెట్‌లోనూ ఆ వాతావరణం ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇక నేను గమనించిన మూడో విషయం, ప్రధానమైన అంశం అతని నటన. ఎదుటివారిని నమ్మించగలడు, నవ్వించగలడు, కంటనీరు పెట్టించగలడు, డ్యాన్సులు, ఫైట్లు ఈజ్‌తో చేయగలడు. ఇవన్నీ అతనికి బలాలే.


ఇన్ని బలాలకు తోడు అతనిలో అణకువ ఉంది. పెద్దలంటే గౌరవం ఉంది. ఒకసారి ఓ సభలో మాట్లాడుతూ ‘‘కోట శ్రీనివాసరావుగారు గొప్ప నటుడని చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. ఆయన సెట్లో ఉంటే నేను చాలా అలర్ట్‌గా ఉంటానని చెప్పడానికి వచ్చాను. సెట్లో మామూలుగా మాట్లాడే కోటగారు, కెమెరా ముందు నిలుచుంటే విజృంభిస్తారు. ఆయన టైమింగ్‌ పట్టుకోవడం ఎదుటి ఆర్టిస్ట్‌కి ఒకరకంగా సవాలులాంటిదే’’ అన్నారు. చిన్నవాడైనా అంత బాగా ఎప్పుడు గమనించాడా అని ఆశ్చర్యపోవడం ఆ వేదికమీద నా వంతయింది.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

FilmSerialమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.