నేను షూటింగ్‌కి తాగి వస్తానని, అమ్మాయిలతో తిరుగుతానని అన్నాడట: కోట (పార్ట్ 47)

ABN , First Publish Date - 2021-11-10T01:24:09+05:30 IST

ఆ మాటను నేను తప్పు పట్టాను. ఎందుకంటే నాక్కూడా ఓ సంవత్సరం రెండు నందులు వచ్చాయి. ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ ‘కృష్ణవంశీగారు, మీరు తెలుగు డైరెక్టర్‌ అయి ఉండి, అలా మాట్లాడటం తప్పుకదా? అవార్డులు వచ్చిన వారిని పొగడాలంటే పొగుడుకోవచ్చు కానీ, తెలుగులో..

నేను షూటింగ్‌కి తాగి వస్తానని, అమ్మాయిలతో తిరుగుతానని అన్నాడట: కోట (పార్ట్ 47)

తెలుగువారికి ఏం తక్కువ?

ఒక మాట మాత్రం గర్వంగా చెప్పుకుంటాను. 25 ఏళ్ళ నుంచి నా లక్ష్యం ఒకటే. తెలుగులో సినిమాలు తీసే నిర్మాతలు మన నటుల్ని ప్రోత్సహించాలి. ఈ మాట అన్నానని నాకు పరభాషా నటులంటే పడదని అనుకుంటే పొరపాటు. నసీరుద్దీన్ షా, నానా పటేకర్‌, అమితాబ్‌బచ్చన్ వంటి వారిని తీసుకురండి. ఏం.. ఇప్పుడు నేను వెళ్ళి పొరుగు భాషల్లో యాక్ట్‌ చేయట్లేదా? నా ఉద్దేశం ‘నటులను’ తీసుకురండి అని. అంతేగానీ ఏదో బచ్చాగాళ్లను తీసుకురావడం దేనికి? ఆ నటులకు, వాళ్లతో వచ్చే అసిస్టెంట్లకు స్టార్‌ హోటళ్లు, ఫ్లయిట్‌ ఛార్జీలు ఎందుకు అని? ఓనమాలు రానివారికి లక్షలు లక్షలు ఇవ్వడం వల్ల ఏమవుతుంది?


నిర్మాతలు తమ వ్యాపారం కోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు. కానీ ఇక్కడి తెలుగు నటులు మానసికంగా ఇబ్బందిపడిపోతారండీ. తెలుగు వాళ్లని ప్రోత్సహించడం తెలుగు సినిమా నిర్మాతల బాధ్యత. ఒక పక్కేమో ‘తెలుగు సినిమా, తెలుగు సినిమాకు అవార్డులు రావడం లేదు’ అంటారు... ఎలా వస్తాయి? మనం తీసేది తెలుగు సినిమా అయితే కదా? అందులో కనిపించే ముఖాలే మనవి కానప్పుడు అది తెలుగు సినిమా ఎలా అవుతుంది? పొట్ట పొడిస్తే తెలుగు అక్షరం రాని వ్యక్తి ముక్కలు ముక్కలు చేసి మాట్లాడిన భాషలో మన నేటివిటీని ఎలా చూడగలుగుతాం? మనమే చూడలేనప్పుడు అవార్డుల కమిటీల్లో ఉన్నవాళ్లకి ప్రత్యేకంగా ఏం కనిపిస్తుంది. ఇదిగో ఇది మాట్లాడితే కాంట్రవర్సీ అంటారండీ. తెలుగు నటులను ప్రోత్సహించాలనే విషయం మీద నేను ఒక్కడినే పోరాడుతున్నాను. ఈ విషయం గురించి పరుచూరి వెంకటేశ్వరరావుగారు చాలాసార్లు ప్రస్తావిస్తుంటారు. 


‘ఒన్‌ మేన్‌ ఆర్మీలాగా పోరాడుతున్నావ్‌’ అని కనిపించినప్పుడల్లా అంటారు. వాస్తవంగా అనుకోవాలంటే ఆ పోరాడటం వల్ల నాకు వచ్చేదేంటి? పోయేదేంటి? ఇప్పటికీ నాకు తగ్గ వేషాలు నేను చేసుకుంటూనే ఉన్నాను. నటించడానికి సమయం చాలక పరుగులు తీసిన సందర్భాలున్నాయేకానీ, వేషాలు లేక ఖాళీగా కూర్చున్న రోజులు మాత్రం లేవు. అలాంటప్పుడు నేనెందుకు పోరాడాలి? నాకేం పట్టిందని అందరిలాగా కూర్చోవడం నాకిష్టం లేదండీ. మన తెలుగువారి గురించి, సాటి నటుల గురించి ఆలోచించకపోతే ఎలా? ‘నాలుగు సినిమాలు ఇస్తే నాలుగూ పాడు చేశాడు’ అని ఎవరిమీదైనా నిర్మాతలకు కోపం ఉంటే అలాంటివారికి వేషాలు ఇవ్వక్కర్లేదు కానీ అసలు అవకాశమే ఇవ్వకుండా ఎక్కడెక్కడి నుంచో మనుషులను తీసుకొస్తే మాత్రం తప్పే.


తెలుగువాడి దమ్ము...

తెలుగులో దమ్మున్న నటులు ఎవరున్నారనే విషయం మీద ఒకసారి నాకు, దర్శకుడు కృష్ణవంశీగారికి మాటామాటా పెరిగింది. ‘ఆ నలుగురు’ సినిమా సమయంలోనే అనుకుంటా. కృష్ణవంశీగారు టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘తెలుగులో మంచి నటులు లేరు అనడానికి నిదర్శనం ప్రకాశ్‌రాజ్ గారికే వరుసగా సపోర్టింగ్‌ ఆర్టిస్టు, విలన్‌ కేటగిరిల్లో రెండు నంది అవార్డులు రావడం’ అన్నారు. ఆ మాటను నేను తప్పు పట్టాను. ఎందుకంటే నాక్కూడా ఓ సంవత్సరం రెండు నందులు వచ్చాయి. ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ ‘కృష్ణవంశీగారు, మీరు తెలుగు డైరెక్టర్‌ అయి ఉండి, అలా మాట్లాడటం తప్పుకదా? అవార్డులు వచ్చిన వారిని పొగడాలంటే పొగుడుకోవచ్చు కానీ, తెలుగులో మంచి నటులు లేరు అనే టాపిక్‌ ఎందుకొచ్చింది? అలా అనడం సబబు కాదు’ అన్నా. దానికి ఆయన నన్ను ఏదో అన్నారట. ‘కోట శ్రీనివాసరావుకు ఏం పనిలేదు. ఆయనేదో పిచ్చిపిచ్చిగా మాట్లాడతాడు’ అనే అర్థం ధ్వనించేటట్టు ఏదో అన్నారు. అప్పుడు ఇద్దరం యంగ్‌గా ఉన్నాం. మాటామాటా పెరిగింది. నేను కూడా విలేకరులను పిలిచి ఇంటర్వ్యూ పెట్టి ఒక మాట చెప్పా. అది నాకు ఇంకా బాగానే గుర్తు. ‘వంశీగారు మీకు దమ్ముంటే ఈ కోట శ్రీనివాసరావుకు మంచి వేషం ఇచ్చి చూడండి. తెలుగువాడి దమ్ము ఏంటో చూపిస్తా’ అన్నా. దానికి ఆయన ఎదురు ప్రెస్‌మీట్‌ పెట్టి ‘షూటింగ్‌కి తాగి వస్తాడు కోట, తాగి నటిస్తాడు, అమ్మాయిలతో తిరుగుతాడు, అమ్మాయిలతో దెబ్బలు తిన్నాడు...’ ఇలా ఏవేవో మాటలు అన్నాడు.


ఇవన్నీ నిజమే అయితే, మరి ఆయన నన్ను తన సినిమాల్లో కూడా పెట్టుకున్నాడుగా. తాగి వస్తానన్నది నిజమైతే ఎందుకు వేషాలిచ్చినట్టు? రాఖీ ఆయన దర్శకత్వంలోనే నటించాగా. చిరంజీవిగారి అబ్బాయి రామ్‌చరణ్‌తేజ్‌ ‘గోవిందుడు అందరివాడేలే’ లో పెట్టుకున్నారుగా. కాబట్టి నా ఇన్నేళ్ల అనుభవం నాకు నేర్పిందేంటంటే ‘సినిమా పరిశ్రమలో మాటామాటా అనుకుంటూనే ఉంటారు. గట్టిగా పోట్లాడుకున్నప్పటికీ అది శాశ్వతం కాదు. ఆ మాటలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది మామూలే’. నేనే కాదు, దాసరి నారాయణరావుగారు‍ ఇంకా పెద్దపెద్దవాళ్లు చాలా మందికి ఇలాంటి అనుభవాలు ఉండేవుంటాయి. అలాంటివారు ఇంకెంత ఫేస్‌ చేసి ఉండాలి?

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-11-10T01:24:09+05:30 IST