ప్రకాశ్ రాజ్‌పై నా అనుమానమే నిజమైంది: కోట (పార్ట్ 45)

ABN , First Publish Date - 2021-10-30T03:52:40+05:30 IST

మరి వాళ్ళకన్నా నేను బాగా చేసినట్టు అనిపించుకోవాలి, కానీ ఎక్కడా డామినేట్‌ చేసినట్టు అనిపించుకోకూడదు. అలాంటిచోటే కదా నాబోటి ఆర్టిస్టుకి పరీక్ష అనిపించేది. మామూలు సమయాల్లో చేయడానికి ఏముంటుంది? ఏమాటకి ఆమాట చెప్పాలంటే అసలు నా వేషం గురించి..

ప్రకాశ్ రాజ్‌పై నా అనుమానమే నిజమైంది: కోట (పార్ట్ 45)

బృందావనం తాత

ఇలాంటిదే ఇంకో గొప్ప సినిమా ‘బృందావనం’. తారక్ (ఎన్టీఆర్‌)తో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ‘బృందావనం’ నాకు చాలా తృప్తినిచ్చింది. అందులో నాది తాత వేషం. ‘ఏమైనా సరే ఆ వేషం కోటగారే చేయాలి’ అని నిర్మాత దిల్‌రాజుగారు కచ్చితంగా చెప్పారట. ‘బృందావనం’ సినిమా టైమ్‌లోనే మా అబ్బాయి పోయారు. సరిగ్గా అబ్బాయి పోయిన నెలరోజులకు ఆ సినిమా షూటింగ్‌ మొదలైంది. క్లైమాక్స్‌లో ఒక సీన్లో నేను కూర్చుని తాగుతూ, అటుగా వచ్చిన తారక్‌ని చూసి, ‘రా తాతా రా’ అని పిలుస్తా. ‘నేను తాగుతానురా రోజూ’ అంటా. ‘నేనూ ఎప్పుడైనా తాగుతాను తాతా’ అని అతను ఒప్పుకొంటాడు. అతని నిజాయతీ నచ్చి ‘ఆర్నెల్లు అక్కడ, ఆర్నెల్లు ఇక్కడ ఇదిగో దీనితో గడిపేస్తుంటా’ అని గ్లాసులో మందు చూపిస్తా. ఆర్నెల్లు పెద్దబ్బాయి ఇంట్లో, ఆర్నెల్లు చిన్నబ్బాయి ఇంట్లో ఉంటానన్నది నా మాటలకు అర్థం. ఆ సీన్ చాలా అద్భుతంగా ఉంటుంది. పైడిపల్లి వంశీగారు ఆ సీన్‌ చాలా బాగా తీశారు.


ఆ చిత్రంలో తారక్ చాలా టిపికల్ కేరక్టర్ చేశాడు. అతని తల్లిదండ్రులు కోటీశ్వరులు. వాళ్ళంటే అతనికి అపారమైన గౌరవం. కొడుకంటే వారికి గొప్ప నమ్మకం. ఇటు ప్రేయసి కోసం ఇంకో అమ్మాయికి ప్రియుడిగా నటిస్తుంటాడు. అలాగని కొత్తగా పరిచయమైన అమ్మాయిని ఇరకాటంలో వదిలేసి వెళ్ళలేడు. ఇలా తారక్ పాత్ర గమ్మత్తుగా ఉంటుంది. ఆ టెంపో అతను బాగా మెయింటెయిన్ చేశాడు. నిజంగా చేయకపోయి ఉంటే తేలిపోయేవాడు. ఎందుకంటే అవతల దిగ్గజాల్లాంటి నటులు శ్రీహరి, ప్రకాశ్‌రాజ్‌. అన్నదమ్ముల పాత్రలు. నేనేమో తండ్రిని. ఇంతమంది ముందు ఆ పాత్రలో నెగ్గుకు రావడం చాలా కష్టం. అయినా తారక్ చాలా సులువుగా చేయడం నాకు ముచ్చటనిపించింది.


విగ్గు స్టోరీ

‘బృందావనం’లో నా పాత్ర కోసం మా మేకప్ మేన్ తెల్లటి విగ్గు రెడీ చేయించాడు. శ్రీహరికి, ప్రకాశ్‌రాజ్‌కి తండ్రి అంటే బాగా ముసలిగా కనిపించాలి కదా అని మా ఉద్దేశం. మొదటి రోజు సెట్‌కి ఆ విగ్గు పెట్టుకుని వెళ్ళాను. అందరూ చాలా బావుందన్నారు. కానీ కాసేపటికి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎంత సేపటికీ నాతో షాట్ తీయరు. కాసేపటికి డైరక్టర్ వంశీ వచ్చి, ‘విగ్గు లేకుండా ఉంటేనే బావుంటుందేమో శ్రీనివాసరావుగారూ’ అన్నారు. అప్పటికప్పుడు మేకప్‌ మేన్‌ని పిలిపించి విగ్గు గురించి చెప్పాం. అదృష్టం బావుండి ఆ వేళ విగ్గుమ్యాన్ కూడా సెట్‌లోనే ఉన్నాడు. తన దగ్గర ఇంకో విగ్గు ఉంది. అది నాకు చాలా బాగా సెట్‌ అయింది. అప్పుడు అందరూ కుదుటపడి విగ్గు ఓకే అనుకుని షూటింగ్‌ మొదలుపెట్టారు.


నా అనుమానమే నిజమైంది

బృందావనం సినిమా గురించి ఇంకో ముఖ్య విషయం చెప్పాలి. ఇందులో ప్రకాశ్ రాజ్‌, శ్రీహరి ఇద్దరూ డైలాగ్స్‌ చాలా బాగా చెబుతారు. ప్రకాశ్‌రాజ్‌ మంచి ఆర్టిస్ట్‌ మాత్రమే కాదు. చక్కటి డైలాగ్‌ డిక్షన్‌, పలికే ప్రతి పదంలో అప్‌ అండ్‌ డౌన్స్ వంటివన్నీ చాలా చక్కగా ఉచ్ఛరించడం అతని క్వాలిఫికేషన్స్. శ్రీహరి తక్కువ తిన్నోడేం కాదు. సీన్‌ పండించడంలో ఎప్పుడూ ముందుంటాడు. మరి వాళ్ళకన్నా నేను బాగా చేసినట్టు అనిపించుకోవాలి, కానీ ఎక్కడా డామినేట్‌ చేసినట్టు అనిపించుకోకూడదు. అలాంటిచోటే కదా నాబోటి ఆర్టిస్టుకి పరీక్ష అనిపించేది. మామూలు సమయాల్లో చేయడానికి ఏముంటుంది? ఏమాటకి ఆమాట చెప్పాలంటే అసలు నా వేషం గురించి వంశీ నాకు చెప్పగానే ‘ప్రకాశ్‌రాజ్‌ అసలు ఈ వేషం ఎలా వదిలేశాడు?’ అని అడిగాను. నా అనుమానం నిజమైంది. ‘నేను చేస్తాను ఈ వేషం’ అని ప్రకాశ్‌రాజ్ అడిగారట.


‘కాదు, కాదు, శ్రీనివాసరావుగారే చేయాలి’ అని దిల్ రాజుగారు కచ్చితంగా చెప్పారన్నారు. నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవాల్సిన సమయం బృందావనం క్లైమాక్స్ షూటింగ్ నాటికి నా ఎడమ కన్నుకి ఆపరేషన్ చేసి ఆరు రోజులైంది. నేనేమో పాత్రలో ఇన్వాల్వ్‌ అయి చేయాలని తాపత్రయపడుతున్నా. ఒక పక్క కొడుకు పోయిన దుఃఖం, మరోపక్క ఆపరేషన్ జరిగిన కంటినొప్పి వంటివన్నీ నన్ను బాధించసాగాయి. ఇవన్నీ యూనిట్‌ వారికి బాగా తెలుసు. అందుకే షూటింగ్‌లో ఎవరూ నాకు గట్టిగా ఏమీ చెప్పలేకపోయారు. వారి అవస్త గమనించి నేనే కలగజేసుకుని చేశా. ఎందుకంటే, ‘పాపం ఆయన బోలెడు దుఃఖంలో ఉన్నాడు. ఏం చేస్తాడులే’ అనే ఫీలింగ్‌తో ఉంది యూనిట్. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం అదేనని నా మనసు నాకు చెప్పింది.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-10-30T03:52:40+05:30 IST